Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Sexual assault: లైంగిక దాడులను ఆపలేమా?

Sexual assault: లైంగిక దాడులను ఆపలేమా?

ముంబైలో అత్యధికంగా మహిళలపై ..

డిసెంబర్ 11 వ తేదీన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో వంతమూరి గ్రామానికి చెందిన ఒక మహిళపై కొంతమంది దాడిచేసి నగ్నంగా ఊరేగించి ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టివేసిన సంఘటనను గౌరవ కర్ణాటక హైకోర్ట్ తీవ్రంగా తప్పు పడుతూ సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మహిళ మాన రక్షణకు చుట్టూ ఉన్న వారెవరూ మానవత్వంతో స్పందించకుండా ఎవరూ ముందుకు రాని పరిస్థితి దయనీయం. చట్టంపట్ల నిందితులకు భయం లేదని ఈ సంఘటన బట్టి తెలుస్తుంది. ” ఇలాంటి సమాజంలో బతకడం కంటే చావడం మేలు అనే స్థితి రాకుండా చూసుకోవాలి ” అని ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళా కమీషన్ , మానవ హక్కుల కమీషన్ చేపట్టిన దర్యాప్తు వివరాలతో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటువంటి సంఘటనలు వింటే మనం ఆధునిక సమాజంలో జీవిస్తున్నామా ? ఇంకా ఆటవిక సమాజంలో ఉన్నామా ? అనే సందేహం కలుగక మానదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం మరియు సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న పరిస్థితులలో మహిళలపై హింసకు పాల్పడటం మానవ జాతికే కళంకం. మహిళల హక్కులను దెబ్బతీసే ఇటువంటి ఘటనలు సమాజానికి హానికరం. భారత రాజ్యాంగం అధికరణం 14 ప్రకారం చట్టం ముందూ అందరూ సమానమని ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, లింగ వివక్షతకు తావులేదని, అలాగే ఆర్టికల్‌ 21 ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు కలిగి ఉంటారని చెబుతుంది. కన్నార్పకుండా చూడడం, సైగలు చేయడం, తాకడం లేదా అసభ్య కరమైన వ్యాఖ్యానాలు చేయడం వంటి ‘సెక్స్’ పరమైన అనుచితమైన ప్రవర్తనను లైంగిక వేధింపులు అని వ్యవహరించ వచ్చు. ఎవరైనా స్త్రీపై దాడి చేసినా లేదా నేరపూరిత బలాన్ని ప్రయోగించినా లేదా ఆమెను నగ్నంగా ఉండేలా బలవంతం చేయాలనే ఉద్దేశ్యంతో లేదా అటువంటి చర్యకు సహకరించే వ్యక్తులు శిక్షార్హులు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 అనేది మహిళల గౌరవం మరియు నిరాడంబరతను కాపాడేందుకు ఉద్దేశించిన కీలకమైన చట్టపరమైన నిబంధన. ఒక మహిళ నమ్రతను ఆగ్రహానికి గురిచేసే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించడంపై ఇది జరిమానా విధిస్తుంది. లింగ-ఆధారిత నేరాల నుండి మహిళలను రక్షించడానికి మరియు సమాజంలో వారి హక్కులు మరియు గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ యొక్క నిబద్ధతను ఈ విభాగం ప్రతిబింబిస్తుంది. ఎవరైనా స్త్రీపై దాడి చేసినా లేదా నేరపూరిత బలాన్ని ప్రయోగించినా లేదా ఆమెను నగ్నంగా ఉండేలా బలవంతం చేయాలనే ఉద్దేశ్యంతో లేదా అటువంటి చర్యకు సహకరించే వ్యక్తికి మూడు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా పొడిగించబడే కాలానికి గాని వివరణతో కూడిన జైలు శిక్ష విధించబడుతుంది. ఏడు సంవత్సరాల వరకు, మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఇది నాన్ బెయిలబుల్ మరియు గుర్తించదగిన నేరం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వార్షిక నివేదిక 2022లో ఒక బాధాకరమైన విషయాన్ని వెల్లడించింది. 2022 సం.లో భారతదేశంలో మహిళలపై నేరాలు 4% పెరిగాయని తెలిపింది. ఇందులో భర్తలు మరియు బంధువుల క్రూరత్వం, అపహరణలు, దాడులు మరియు అత్యాచారాలు ఉన్నాయి. ఈ నివేదిక మహిళలపై నమోదైన నేరాలలో గణనీయమైన పెరుగుదలను వివరించింది, 2020లో 3,71,503 కేసుల నుండి 2022లో 4,45,256 కేసులు పెరిగాయి. 2021నాటి 4,28,278 కేసులతో పోలిస్తే, 2022 గణాంకాలు పెరిగాయి. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం మహిళలపై నేరాలలో గణనీయమైన నిష్పత్తిలో ‘భర్త లేదా అతని బంధువుల ద్వారా క్రూరత్వం 31.4 శాతం, మహిళల కిడ్నాప్ మరియు అపహరణ 19.2 శాతం ఆమె నిరాడంబరతకు ఆగ్రహాన్ని కలిగించే ఉద్దేశ్యంతో మహిళలపై దాడి 18.7 శాతం, మరియు అత్యాచారాలు 7.1 శాతంగా నమోదయ్యాయి. ప్రతి లక్ష మంది మహిళలపై నేరాల రేటు 2021లో 64.5 నుండి 2022లో 66.4కి పెరిగింది. 2022లో మొత్తం 31,516 అత్యాచార కేసుల్లో గరిష్టంగా రాజస్థాన్‌లో 5,399, ఉత్తరప్రదేశ్ (3,690), మధ్యప్రదేశ్ (3,029), మహారాష్ట్ర (2,904), హర్యానా (1,787) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లక్ష మంది మహిళలకు నమోదైన నేరాల రేటు 2021లో 64.5తో పోలిస్తే 2022లో 66.4గా ఉంది. ఢిల్లీలో మహిళలపై 14,158 నేరాలు నమోదయ్యాయి, ముంబైలో అత్యధికంగా 80.6% ఛార్జిషీట్ రేటుతో 6,176 కేసులు నమోదయ్యాయి, బెంగళూరులో 74.2% ఛార్జిషీట్ రేటుతో 3,924 కేసులు నమోదయ్యాయి. ఐ పి సి , ప్రత్యేక మరియు స్థానిక చట్టాల కింద మహిళలపై నేరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 65,743 కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్రలో 45,331 కేసులు నమోదయ్యాయి మరియు రాజస్థాన్‌లో 45,058 కేసులు నమోదయ్యాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (యన్ ఎఫ్ హెచ్ యస్) యొక్క ఐదవ రౌండ్ ప్రకారం, భారత ప్రజానీకంలో ఒక ప్రముఖ భాగం భర్తను సమర్థిస్తుంది. సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లడం, అత్తమామలను అగౌరవపరచడం మరియు భర్త విధేయతను అనుమానించడం వంటి కారణాలతో భార్యను కొడుతున్నారు. ఇవి చటారీత్యా నేరం.

- Advertisement -

మన దేశంలోనే కాదు..
యు యన్ ఊమెన్ నివేదిక ప్రకారం 2022లో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 48,800 మంది మహిళలు మరియు బాలికలు వారి సన్నిహిత భాగస్వాములు లేదా ఇతర కుటుంబ సభ్యులచే చంపబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా, 6 శాతం మంది మహిళలు తమ భర్త లేదా భాగస్వామి కాకుండా వేరొకరి నుండి లైంగిక హింసకు గురయ్యారని నివేదించారు. ప్రపంచవ్యాప్తంగా 15-19 సంవత్సరాల వయస్సు గల పదిహేను మిలియన్ల కౌమార బాలికలు బలవంతపు సెక్స్‌ను అనుభవించారు.

పరిష్కారాలు :
లైంగిక వేధింపులు జరుగుతున్నప్పుడు కొంత మంది మహిళలు మౌనంగా భరిస్తున్నారు. లోలోపల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బయటకు చెబితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయేమో అని భయపడుతున్నారు. మహిళలు భయం వదలి ఫిర్యాదు చేసే స్థాయికి రావాలి. మహిళల పట్ల గౌరవం కలిగి ఉండాలని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అశ్లీల చలన చిత్రాలు, ఇంటర్నెట్ సైట్ లను నిషేధించాలి. చట్టపరమైన శిక్షలు గురించి అవగాహన కలిగించాలి. అత్యాచారాలు చేసినవారికి వేగంగా శిక్ష పడాలి. సామాజిక మార్పు రానంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అందరం మంచి సమాజం నిర్మించడంలో భాగస్వాములం కావాలి.

జనక మోహన రావు దుంగ
అధ్యాపకుడు
ఆమదాలవలస
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్
8247045230

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News