Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్New challenges to new CM in Rajasthan: రాజస్థాన్‌ సీఎంకి సరికొత్త సవాళ్లు

New challenges to new CM in Rajasthan: రాజస్థాన్‌ సీఎంకి సరికొత్త సవాళ్లు

మోదీ ప్రకటించిన గ్యారంటీల అమలు భజన్‌ లాల్‌ శర్మకు కత్తి మీద సామే

రాజస్థాన్‌ శాసనసభకు మొట్టమొదటిసారిగా ఎన్నికైన భజన్‌ లాల్‌ శర్మను ముఖ్య మంత్రిగా ఎంపిక చేయడం ద్వారా తమకు భారీ ఓటు బ్యాంకు అయిన బ్రాహ్మణులను బీజేపీ సంతృప్తిపరచి నట్టయింది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్త అయిన భజన్‌ లాల్‌ శర్మ చాలా ఏళ్ల నుంచి బీజేపీకి సేవలందిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపు గానే ఆయనకు ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం జరిగింది. తమ పార్టీలో సాధారణ కార్యకర్త సైతం ఉన్నత పదవులు అలంకరించడానికి అవకాశం ఉందని చెప్పడమే బీజేపీ ఉద్దేశం. ఈ కొత్త అధికార వ్యవస్థలో పాత తరం వారిని పక్కన పెట్టేయడం జరిగింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వసుంధరా రాజే సింధియాను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయకపోవడాన్ని బట్టి, బీజేపీ భవిష్యత్‌ వ్యూహాన్ని తేలికగా అర్థం చేసు కోవచ్చు. 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పుడు ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో ఊహాగానాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆమె బహుశా జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉంది. రాజస్థాన్‌ లో బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఇది రెండవ పర్యాయం.
కాగా, ఉప ముఖ్యమంత్రులుగా కూడా కొత్త వారిని, అందులోనూ వెనుకబడిన తరగతులకు చెందిన వారిని ఎంపిక చేయడం జరిగింది. ఒక్క రాజస్థాన్‌ లోనే కాకుండా చత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా ఉప ముఖ్యమంత్రులుగా వెనుకబడిన తరగతుల వారికి అవకాశం దక్కింది. ఒకపక్క అగ్రవర్ణాలకు అవకాశం ఇస్తూనే, వెనుకబడిన వర్గాలను అందలాలకు ఎక్కించాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాజ్‌ పుట్‌ కుటుంబానికి చెందిన దియా కుమారి, దళిత వర్గానికి చెందిన ప్రేమ్‌ చంద్‌ బైర్వాలకు రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవులను అప్పగించడం జరిగింది. అక్కడితో రాజస్థాన్‌ లో కుల సంకీర్ణం పూర్తయింది. మరో 29 మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ ప్రస్తుతం జాట్లు, దళితులు, ఆదివాసీల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌ ముఖ్యమంత్రికి అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. మోదీ ప్రకటించిన గ్యారంటీలను తుచ తప్పక అమలు చేయడమే భజన్‌ లాల్‌ శర్మకు ఇప్పుడు లక్ష్యంగా మారింది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ తదితరులు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. పాలనాపరంగా ఏమాత్రం అనుభవం లేని భజన్‌ లాల్‌ శర్మకు ఈ వాగ్దానాలు అమలు చేయడం కత్తి మీద సామే అవుతుంది. ఆయన ఇప్పటికే పాలనలో అనుభవజ్ఞులైన కొందరు సలహాదార్లను, అధికారులను ఎంపిక చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం పూర్తయింది. ఆయన రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయవలసి ఉంది. తక్షణ కర్తవ్యం రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు 450 రూపాయల సబ్సిడీతో గ్యాస్‌ సిలెండర్లు సమ కూర్చడం కూడా జరగాలి. ఇది కాకుండా ప్రతి ఆడపిల్లకూ రెండు లక్షల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్‌ ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ వాగ్దానం చేసింది. బడ్జెట్‌ పరిమితులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాల అమలుకు నిధులు సమకూర్చడమన్నది అత్యంత కష్టసాధ్యమైన విషయమనడంలో సందేహం లేదు. అంతేకాక, కాంగ్రెస్‌ హయాంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అవినీతి వ్యవహారాల వంటివి జరిగినందు వల్ల వాటి మీద సమగ్ర దర్యాప్తు జరిపించాల్సి ఉంది. ఒకపక్క పాత తరం నాయకులతో తలపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటన్నిటినీ లోక్‌ సభ ఎన్నికల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం పాలనానుభవం లేని భజన్‌ లాల్‌ శర్మకు ‘ముందున్నది ముసర్ల పండుగ’ అనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News