Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Students cleaned septic tank: విద్యార్థులతో పారిశుద్ధ్య పనులా?

Students cleaned septic tank: విద్యార్థులతో పారిశుద్ధ్య పనులా?

ఒట్టి చేతులతో పారిశుద్ధ్య పనులు చేయడాన్ని నిషేధిస్తూ 2013లో చట్టం


పాఠశాల విద్యార్థులతో సెప్టిక్‌ ట్యాంకును శుభ్రం చేయించడం నిజంగా దిగ్భ్రాంతికర విషయం. ఈ ధోరణి ప్రమాదకరంగా కూడా కనిపిస్తోంది. గత డిసెంబర్‌ 1వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని ఏళువ హళ్లిలో ఉన్న మొరార్జీ దేశాయ్‌ రెసిడెన్షియల్‌ స్కూలులో ఏడు నుంచి తొమ్మిదవ తరగతులు చదివే విద్యార్థులతో ఆ స్కూలు యాజమాన్యం సెప్టిక్‌ ట్యాంకును, మరుగుదొడ్లను కడిగించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థులు సెప్టిక్‌ ట్యాంకును శుభ్రం చేస్తున్న దృశ్యం కొద్ది రోజుల క్రితం వీడియో ద్వారా వైరల్‌ కాకపోయి ఉంటే, ఇది బయటి ప్రపంచానికి తెలిసేదే కాదు. పాఠశాల యాజమాన్యమే విద్యార్థులతో ఇటువంటి పనులు చేయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఒక్క విద్యార్థికి కూడా మాస్కులు లేవు. ఇందుకు సంబంధించిన దుస్తులు లేవు. స్కూలు డ్రస్సులోనే వారు సెప్టిక్‌ ట్యాంకుల్లోకి దిగి శుభ్రం చేయడం జరిగింది.
నిజానికి దేశవ్యాప్తంగా ఏటా వేలాది మంది పారిశుద్ధ్య పనివారు డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నప్పుడు, సెప్టిక్‌ ట్యాంకులు కడుగుతున్నప్పుడు కార్బన్‌ మోనాక్సైడ్‌ విషవాయువు కారణంగా ఉక్కిరి బిక్కిరై మరణించడం జరుగుతోంది. 1993-2010 సంవత్సరాల మధ్య దేశవ్యాప్తంగా 993 మంది, 2018-23 సంవత్సరాల మధ్య 339 మంది ఈ విధంగా మరణించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ, పాఠశాల యాజమాన్యం ఎటువంటి భద్రతా చర్యలూ లేకుండా చిన్నపిల్లలతో మరుగు దొడ్లు కడిగించడం చాలా దారుణ విషయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆరోగ్య శాఖాధికారులకు, జిల్లా అధికారులకు ఈ విషయం తెలిసి, రంగంలోకి దిగి ఆ స్కూలు ప్రిన్సిపాల్‌ తో సహా నలుగురిని అరెస్టు చేయడం జరిగింది. స్థానిక ప్రజల్లో, విద్యార్థుల తల్లితండ్రుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయని గ్రహించిన ప్రభుత్వం దీని మీద దర్యాప్తుకు ఆదేశించింది.
యంత్రాలతో సంబంధం లేకుండా ఒట్టి చేతులతో ఈ విధంగా మరుగుదొడ్లను, డ్రైనేజీలను, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయించడం అనేది అమానవీయ చర్య కింద ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఏనాడో గుర్తించాయి. నిజానికి వీటిని శుభ్రం చేయడానికి టెక్నాలజీ సంబంధమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని వినియోగించడం వల్ల మనుషులకు ఎటువంటి హానీ ఉండదు. ఒట్టి చేతులతో పారిశుద్ధ్య పనులు చేయడాన్ని నిషేధిస్తూ 2013లో ఒక చట్టం చేయడం జరిగింది. ఇటువంటి పారిశుద్ధ్య పనులు ఎవరు చేయించి నప్పటికీ వారికి లక్ష రూపాయల జరిమానా లేదా రెండేళ్ల కఠిన శిక్ష లేదా ఈ రెండూ అమలు చేయడం జరుగుతుందని ఆ చట్టంలోని సెక్షన్‌ 8 తెలియజేస్తోంది.
ఇక 2014లో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇటువంటి పారిశుద్ధ్య పనివారికి పునరావాసం కల్పించాలని, ఆరోగ్య సంరక్షణ కల్పించాలని యకూడా ఆదేశించింది. ఇంతవరకూ సుమారు 60 వేల మంది పారిశుద్ధ్య పనివారిని గుర్తించి వారికి పునరావాసం, ఆరోగ్య సంరక్షణ కల్పించడం జరిగింది. ఈ గుర్తింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. “ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా భద్రతా సంబంధమైన దుస్తులు వేసుకోకుండా డ్రైనేజీలలోకి, సెప్టిక్‌ ట్యాంకులలోకి దిగడం నేరం” అని కూడా కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక పాఠశాల వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోకుండా, విద్యార్థులతో రోజూ మరుగుదొడ్లు కడిగించడం, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయించడం జరుగుతోంది. ఇదేదో ఒక రోజున సోషల్‌ సర్వీసు పేరుతో చేయిస్తున్న పని కూడా కాదు. సుప్రీం కోర్టు ఆదేశాలన్నా, చట్టాలన్నా ఈ స్యూలు యాజమాన్యం లెక్క చేయకపోవడం ఎంతగానో ఆందోళన కలిగిస్తోంది. ఈ విధంగా చేయించేవారికి కఠినంగా శిక్షిస్తే తప్ప ఇవి ఆగే అవకాశం ఉండదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News