Tuesday, May 21, 2024
Homeహెల్త్Winter packs must: చలిలో ఈ ప్యాక్స్ వేయాల్సిందే

Winter packs must: చలిలో ఈ ప్యాక్స్ వేయాల్సిందే

సిల్కీ స్కిన్ కోసం..

చలికాలంలో ఈ ఐదు ఫాలో అయిపోండి…
చలికాలంలో చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసం మార్కెట్ లో దొరికే కాస్మొటిక్ క్రీములే కాకుండా మన వంటింట్లోని కొన్ని సహజసిద్ధ పదార్థాలు సైతం చర్మాన్ని పట్టులా మృదువుగా, మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి.

- Advertisement -

అవేమిటంటే..
కొబ్బరినూనె, అలొవిరా జెల్ కాంబినేషన్ చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రెండూ చర్మం
యొక్క సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గుణాన్ని పునరుద్ధరిస్తాయి. చర్మం లోపలిపొరల్లోకి వీటి ప్రభావం వెళ్లి చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. దీని తయారీకి అరకప్పు అలొవిరా జెల్ లో అరకప్పు కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం రెండు వారాల పాటు ఉంటుంది. దీన్ని నిత్యం ముఖానికి, కాళ్లకు, చేతులకు రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

చలికాలంలో పసుపు,శెనగపిండి ఫేస్ ప్యాక్ ముఖానికి, మెడకు పూసుకుంటే చర్మంపై అది ఎంతో మంచి ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా చలికాలంలో జిడ్డు చర్మంతో ఎదురయ్యే కష్టాలు ఎన్నో. యాక్నే సమస్య తలెత్తుతుంది. చర్మం యొక్క సహజకాంతి లోపిస్తుంది. అందుకే ఈ ఫేస్ ప్యాక్ ముఖ్యంగా ఆయిలీ చర్మం ఉన్న వారికి ఎంతో బాగా పనిచేస్తుంది. శెనగపిండి, పసుపు , అలొవిరా జెల్, రోజ్ వాటర్ వీటన్నింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్కు కడిగేసుకున్న తర్వాత ముఖానికి జంటిల్ మాయిశ్చరైజర్ లేదా అలొవిరా జెల్ రాసుకోవడం మరవొద్దు.

శీతాకాలంలో చర్మాన్ని మెరిసేలా చేసే మరో ఫేస్ మాస్కు ఉంది. ఓట్స్, గులాబీ రేకుల పొడి మిశ్రమం చర్మంపై వండర్స్ సృష్టిస్తుంది. మీ చర్మాన్ని కాంతివంతం చేయడం ద్వారా మిమ్మల్ని నలుగురిలో మరింతగా మెరిసేలా చేస్తుంది. ఓట్స్, గులాబీ రేకుల పొడి, పెరుగు, నిమ్మరసం నాలుగింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

శీతాకాలంలో మనం ఎదుర్కొనే మరో ముఖ్యమైన చర్మ సమస్య పాదాలు పగుళ్లు బారడం. అలొవిరా జెల్ లో వాసెలైన్, విటమిన్ ఇ కాప్సూల్ రెండూ కలిపి పేస్టులా చేసి దాన్ని పాదాలకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఆ ప్యాక్ మంచి ప్రభావం చూబిస్తుంది. పగుళ్లను మటుమాయం చేస్తుంది.

ఇంకో ఫేస్ మాస్కు కూడా ఉంది. ఇది చలికాలంలో మీ చర్మానికి అదనపు మెరుపు, మృదుత్వాలను ఇస్తుంది. వాల్ నట్స్ పొడి, హైబిస్కస్ పొడి, పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం నాలుగింటినీ బాగా కలిపి ఆ పేస్టును ముఖానికి పూసుకోవాలి. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పట్టులా మృదువుగా అవుతుంది. ముఖం, పాదాలు, చేతులపై చర్మం పగుళ్లు అస్సలే ఉండవు. ఈ ఫేస్ మాస్కును కడిగేసుకున్న తర్వాత జంటిల్ మాయిశ్చరైజర్ లేదా అలొవిరా జెల్ ముఖానికి రాసుకోవడం మరవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News