Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Kalaprapurna: మిమిక్రీ కళకే వన్నె తెచ్చిన పద్మశ్రీ నేరెళ్ల వేణు మాధవ్

Kalaprapurna: మిమిక్రీ కళకే వన్నె తెచ్చిన పద్మశ్రీ నేరెళ్ల వేణు మాధవ్

డిసెంబర్ 28 న జయంతి సందర్భంగా

మిమిక్రీ అంటే వారికి ప్రాణం. వేలాది మంది గొంతుకలను తన కళ ద్వార ద్వన్యనుకరన చేసిన మిమిక్రీ సామ్రాట్. రారాజు. ఓరుగల్లు ముద్దు బిడ్డ. వీరు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో లక్షలాది ప్రదర్శనలు ఇచ్చి తన మిమిక్రీ కళ ద్వార కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాస్య బ్రహ్మ. వీరి ప్రదర్శన వున్నదని తెలిస్తే చాలు అక్కడ ఇసుక పోస్తే రాలనంత జనం తరలివస్థారు. కడుపుబ్బ నవ్వి నవ్వి మానసిక ప్రశాంతతని పొందుతారు. వీరి పేరు తెలియని వారు ఎవరూ వుండరు. వారే నేరెళ్ళ వేణుమాధవ్. వీరు డిసెంబరు 28, 1932 న జన్మించారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. మొదట్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక అన్ని భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించిన గొప్పతనం వీరిది.హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.వరంగల్ లోని శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త. ఆరు భాషల్లో పండితుడు. వేణుమాధవ్ ఈయనకు పన్నెండో సంతానం. సాహిత్యంలో మంచి ప్రవేశం ఉండడం వల్ల, ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి వారు వున్నారు. వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. తన 8 వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి, రాఘవయ్య మాష్టారు గారి వద్ద కొంతకాలం ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతిలో చేరి పెద్ద బాలశిక్ష చదవడం ప్రారంభించారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి నాగయ్య గారిమీద అభిమానం పెంచుకున్నారు. నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. ఇవేకాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య గారలు నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది వారి మిమిక్రీ ప్రస్థానం.ఏవీవీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణ మూర్తి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పురస్కారాలు కూడా లభించాయి. హాస్యనాటకాలంటే ముందుండే వాడు. మిగతా గురువులు కందాళై శేషాచార్యులు గారు, యద్దనపూడి కోదండ రామ శాస్త్రి గారు వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు.1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు మిగతా లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ మంజూరు చేశారు. దానితో వీరు ముప్పయి ఇంగ్లీషు సినిమాల్ని తనివిదీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు గారు పరమానందభరితులై “యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్” అని, ఇకనుండి నీకే అవసరం వచ్చినా నువ్వెవరినీ అడగకు. నా పెద్ద కుమారుడు విఠల్ ( బీ. పీ. ఆర్. విఠల్ గారు అనంతరకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు) అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్’ గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల జి సి ఎస్ స్కూలు హనుమకొండ లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు. తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. చెప్పుకోదగిన మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు,స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు. తెనాలి పట్టణంలోని అభ్యుదయ భావాలున్న స్వాతంత్ర్య సమరయోధులు కొల్లా కాశీవిశ్వనాధం, తయారమ్మ దంపతుల కుమార్తె శోభావతి తో వీరి వివాహం 3-2-1957 న జరిగింది. దీనికి సంధాన కర్తగా వ్యవహరించిన వారు స్థానం నరసిం హారావు. వీరికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనాథ్, రాధాకృష్ణ. ఇద్దరు అమ్మాయిలు లక్ష్మీతులసి, వాసంతి.వేణుమాధవ్ సినిమా, సాహిత్యం, కళలు లాంటి పలురంగాల ప్రముఖులతో సంబంధములు వున్నాయి.పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ 2018, జూన్ 19వ తేదీ న మరణించారు. వారిని స్మరించుకుంధాం. వారి జయంతి వేడుకలను గ్రామ గ్రామాన నిర్వహించి వారి సేవలను కొనియాడదాం.
కామిడి సతీష్ రెడ్డి,జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

- Advertisement -

(డిసెంబర్ 28 న మిమిక్రీ రారాజు నేరెళ్ల వేణు మాధవ్ జయంతి సందర్భంగా).
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News