కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పూర్తి కావడానికి మరో నెల రోజులు పడుతుంది. కన్యా కుమారిలో యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన నున్నటి గడ్డంతో ఉన్నారు. పంజాబ్ చేరేటప్పటికి ఆయన గడ్డం బాగా పెరిగి పోయింది. ప్రస్తుతం ఆయనను చూసినవారికి ఆయన బీజేపీ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోటీపడుతున్నారా అనిపిస్తుంది. పైగా, అమృత్సర్లో కాషాయ వస్త్రాలు ధరించి కూడా కనిపించడం ఈ అభిప్రాయాన్ని నిర్ధారించే అవకాశం కూడా ఉంది. తనకంటూ ఒక ఇమేజ్‌ను సృష్టిం చడమే ఆయన ధ్యేయమైతే, అది కొంత పనిచేసినట్టే కనిపిస్తోంది. నిజానికి, యాత్ర సందర్భంగా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకపోవడం ఒక విధంగా ఆయనకు విజయమనే చెప్పవచ్చు. సాధారణంగా ఏ నాయకుడైనా కశ్మీర్ నుంచి తన పాదయాత్ర ప్రారంభించి, కన్యాకుమారితో పూర్తి చేస్తాడు. రాహుల్ గాంధీ మాత్రం కన్యాకుమారి నుంచి యాత్రను ప్రారంభించి కశ్మీర్‌తో పూర్తి చేయాలని సంకల్పించడం నిజానికి జనాన్ని బాగానే ఆకట్టుకుంది.
ఈ యాత్ర లక్ష్యం గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ, ఒక్కటి మాత్రం నిజ మనిపిస్తోంది. తమకు కాస్తో కూస్తో బలం ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ మనోబలాన్ని పెంచడం, మరింతగా మద్దతు కూడగట్టడమే కాంగ్రెస్ లక్ష్యం గా కనిపిస్తోంది. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లో ఎక్కువగా యాత్ర చేయడం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. తమ పార్టీ దాదాపు జీరో అయిపోయిన ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను తాకనైనా తాకకుండా వెళ్లిపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. భారత్ జోడో యాత్ర అని పేరు పెట్టడం వెనుక ఉద్దేశం భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందనే అభిప్రాయం కలగజేయడానికే అయినప్పటికీ, వాస్తవానికి అంతర్లీనంగా ఈ యాత్ర ఉద్దేశం మాత్రం తమ పార్టీ అంతరించిపోకుండా చివరి ప్రయత్నం చేయడమేనని పార్టీ నాయకులు సైతం భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలవుతున్న పార్టీ అని బీజేపీ వ్యాఖ్యానించడాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్ఠానం ఈ యాత్రకు ప్లాన్ చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
ఇదే అభిప్రాయం రాహుల్ గాంధీని నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా నడిపిస్తోంది. మరో విశేషమేమిటంటే, రాహుల్ యాత్రకు దేశంలోని పత్రికలు, ఇతర ప్రచార సాధనాలు ఆశించిన స్థాయిలో కవరేజ్ ఇవ్వడం లేదు.
పాదయాత్ర సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో జనం విశేషంగా రావడం, కొన్ని ప్రాంతాలలో యాత్ర పేలవంగా జరగడం వంటివి జరిగాయి. పాదయాత్ర విజయం సాధించిదా లేదా అన్న విషయం పక్కన పెట్టి, పత్రికలే ఆయనకు కవరేజ్ ఇవ్వకపోవడాన్ని బట్టి, ఆయన రాజకీయంగా ఇంకా ఎదగలేదన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా వేళ్లు పాదుకుపోయిందన్న అభిప్రాయం మారలేదన్న సంగతి అర్థమవుతోంది. రాహుల్ గాంధీ ఇంకా శిక్షణావస్థలోనే ఉన్నారని, సోనియా గాంధీ ముందు వరుసలో నిలబడి నాయకత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేరని జాతీయ పత్రికలు, అంతర్జాతీయ పత్రికలు కోడై కూస్తున్న సమయంలో ఈ పార్టీ దేశవ్యాప్త, జాతీయ పార్టీ అని నిరూపించుకోవడానికి పాదయాత్రతో పాటు ఇంకా అనేకం చేయాల్సి ఉంది.
పాదయాత్రను ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు పార్టీ అధిష్ఠానం తమ విధేయుడు మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక చేసుకుంది. ఖర్గే నుంచి విధేయతను ఆశించిన పార్టీ అధిష్ఠానం అదే విధేయతను పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి పొందలేకపోతోంది. పార్టీ జాతీయాధ్యక్ష పదవి కోసం త న ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ నిర్మొహమాటంగా తిరస్క రించారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్లో రెండు దశాబ్దాలకు పైగా నలిగిన పలు వురు రాష్ట్ర స్థాయి నాయకులు వెనుకా ముందూ చూడకుండా ఇతర పార్టీలకు వెళ్లిపోవడమే కాకుండా, వారు కోరుకున్న విధంగా లబ్ధి పొందారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి, హిమంత్ బిశ్వాస్ శర్మ వంటి నాయకులున్నారు. ఫలితంగా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మరింతగా కొడిగట్టిపోయింది.
యువ నాయకత్వం మృగ్యం
జ్యోతిరాదిత్య సింధియాను తమ గూటిలో ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, రాజకీయ లబ్ధి కోసం రాజేశ్ పైలట్ బీజేపీ బూచిని చూపించడం, కాంగ్రెస్ నాయకత్వానికి తీరని భంగపాటు తీసుకు వచ్చింది. యువ నాయకత్వం కూడా పార్టీకి దూరమైపోతోందన్న అభిప్రాయం కలగడానికి, ఆం దోళన చెందడానికి అవకాశమిచ్చింది. మరో విషాదకర విషయమేమిటంటే, ఎన్నికల కోసం నిధులను వసూలు చేయగలిగిన స్థాయిలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు లేదు. నిధులూ లేక చరిష్మా కూడా లేక ఈ పార్టీ మున్ముందు ఏ ఎన్నికల్లో అయినా ఎలా గెలుస్తుంది? పార్టీలో ఇప్పటికీ డోలాయమాన నాయకుడుగా, పార్ట్ టైమ్ నాయకుడుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ మీద పార్టీలోనే నమ్మకం కుదరడం లేదు. ఇక ప్రజల్లో నమ్మకం ఎలా కుదురుతుంది? పాదయాత్ర వల్ల ఎంత వరకూ ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ, కొన్ని రాష్ట్రాల్లో తన వల్ల ఏర్పడిన శూన్యాన్ని తానే భర్తీ చేసుకోవాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని మాత్రం తేలిపోతోంది.
దేశంలో అనేక సమస్యలున్నాయనే విషయం అందరికీ తెలుసు. ఆ సమస్యల్లో ఒక్క సమస్య పైన కూడా కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో పోరాటాలు జరపలేదు. ఈ సమస్య పైనా ప్రజలను సమీకరించ డం జరగలేదు. ఫలితంగా అటు పత్రికలు, ఇటు ప్రజలు ఈ పాదయాత్రను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు సైతం ఈ పాదయాత్రను పట్టించుకోవడం లేదు. ప్రజల్లో కొందరు బీజేపీ వ్యతిరేకుల దృష్టిని మాత్రం ఇది కొద్దిగా ఆకట్టుకోగలుగుతోంది. రాజకీయ బాధ్యతలను నెత్తికెత్తుకోవడం సుతరామూ ఇష్టం లేని రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రజల సమస్యలను గురించి పట్టించు కుని ఉపయోగమేమిటనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఆయన చర్వితచర్వణంగా హిందుత్వ గురించి మాట్లాడడం కూడా ప్రజల మనసులకు ఎక్కడం లేదు. దేశాన్ని కలిపి ఉంచడానికి తాను ఈ యాత్ర చేస్తున్నట్టు చెబుతున్న రాహుల్ గాంధీ దేశం ఏ విధంగా ఎక్కడ విభజనకు గురవుతోందో కూడా తార్కికంగా చెప్పలేకపోతున్నారు. అది రాజకీయంగా ఉపయోగపడుతుందా అన్నది వేరే విషయం. తాను ఏమీ చేయకుండా కూర్చునే వారసత్వ నాయకుడిననే అభిప్రాయాన్ని ఆయన ఈ యాత్ర సందర్భంగా కొద్దిగా వదల్చుకోగలిగారు. రాజకీయంగా ఆయనకు కొన్ని ఆదర్శాలున్నాయనే అభిప్రాయాన్ని కూడా కొద్దిగా కలిగించగలిగారు. రాజకీయంగా ఆయనకు ఇది కూడా ఒక కాలక్షేపమనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. పాదయాత్రలో తన సహచరులతో మాట్లాడుతుండడం, ప్రజల సమస్యలను తెలుసుకుంటూండడం, కొందరిని ఆలింగనం చేసుకుంటుండడం ఆయనను రాజకీయంగా కొద్దిగా బిజీ వ్యక్తిని చేస్తోంది. ఈ యాత్ర వల్ల కలిగిన రాజకీయ ప్రయోజనాలను ఆయన సద్వినియోగం చేసుకుంటారా లేదా అన్నది తెలియడం లేదు. చాలాకాలం పాటు నిష్క్రియాపరత్వంగా ఉన్న కాంగ్రెస్కు ఈ పాద యాత్ర ఒక ప్రత్యేక విశేషంగా కనిపిస్తోంది.
– జి. రాజశుక