Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Alternative to BJP: బీజేపీకి ప్రత్యామ్నాయం తక్షణావసరం

Alternative to BJP: బీజేపీకి ప్రత్యామ్నాయం తక్షణావసరం

మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలన్నీ మారాల్సిందే

బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక పటిష్ఠమైన, దూర దృష్టి కలిగిన, జాతీయవాద పార్టీ దేశంలో ఎదగాల్సిన బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం సాధ్యమైనంత త్వరగా రూపుదిద్దుకోని పక్షంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంగా ముందుకు సాగాలన్న పక్షంలో బలమైన పాలక పక్షంతో పాటు పటిష్టమైన ప్రతిపక్షం కూడా అవసరం. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవాలనో, అది ఎప్పటికీ ప్రతిపక్షంగా ఉండి పోవాలనో అత్యధిక శాతం ప్రజలు కోరుకోవడం లేదు. ఎక్కువ మంది ప్రజలు కాంగ్రెస్ తన బూజుపట్టిన విధానాలను, సిద్ధాంతాలను మార్చుకోవాలని మాత్రమే ఆశించడం జరుగుతోంది. అది కొత్త ఆలోచనలతో, కొద్ది కార్యక్రమాలతో, కొత్త నాయకులతో సమూలంగా మార్పు చెందితే దానికి తప్పకుండా పూర్వ వైభవం సంపాప్తించే అవకాశం ఉంది. అది మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం లేదు. దేశకాల పరిస్థితులను సరిగ్గా అవగాహన చేసుకోవడం లేదు. దాని నాయకత్వం, దాని భావజాలం 1947 నాటి పరిస్థితుల దగ్గరే ఆగిపోయి ఉంది.

- Advertisement -

దేశాన్ని దాదాపు యాభై ఏళ్లపాటు అఖండంగా పాలించిన పార్టీకి ‘సమూలంగా’ మారడమనేది కాస్తంత కష్టసాధ్యమైన విషయమే. సమూలంగా మారడంలో పార్టీ నష్టపోయే అవకాశం కూడా ఉందనే భయం దాని యువ నాయకత్వంలో కూడా వేళ్లుపాదుకుపోయి ఉంది. వారి భయాలు, అభద్రతా భావాలు ఎలా ఉన్నప్పటికీ, పార్టీ తన మనుగడను, తన అస్తిత్వాన్ని కాపాడుకోవా లన్న పక్షంలో సమూలంగా మార్పు చెందక తప్పదు. బీజేపీ మాదిరిగానే తాను కూడా ఒక జాతీయ పార్టీ అనే విషయాన్ని అది ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. నెహ్రూ-గాంధీ కుటుంబ ఆధిపత్యం ఉన్నా లేకపోయినా ఒక జాతీయ పార్టీగా అది కొనసాగడం అనేది అనివార్య మైన విషయం. అది పాలక పక్షంగానో, ప్రధాన ప్రతిపక్షంగానో కొనసాగినంత కాలం దేశంలో ప్రజాస్వామ్యం అనేది సుస్థిరంగా, సుభిక్షంగా ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, అందులోనూ సచేతన ప్రజాస్వామ్యంలో ఒక క్రమశిక్షణ కలిగిన, సిద్ధాంతాలకు కట్టుబడిన బలమైన ప్రతిపక్షం అనేది ఉండి తీరాలి. అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం.

ఆత్మవిమర్శ అవసరం
అయితే, సమస్యంతా ఇక్కడే ఉంది. రాహుల్ గాంధీ కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గానీ సమర్థవంత మైన, పటిష్ఠమైన, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, సంస్థగా గుర్తింపు పొందలేకపోతుండడం దురదృష్ట కరం. పైగా, కాంగ్రెస్ పార్టీకి గానీ, రాహుల్ గాంధీకి గానీ తాము ప్రతిపక్షమన్న స్పృహగానీ, అవగాహన గానీ లేవు. తామింకా పాలక పక్షమనే అభిప్రాయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీతో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం పాలకపక్ష తరహా అహంకారాన్ని, దౌర్జన్యాన్ని, దూకుడుతనాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. తామెవరం అనేది వాళ్లకే అంతుబట్టడం లేదు. తాము చెప్పదలచుకున్నదేమిటో వారికే అర్థం కావడం లేదు. దాదాపు అయోమయావస్థలో ఉన్నారనిపిస్తుంది. ఒకపక్క నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఈ పోటీలో తన స్థానం ఏమిటన్నది గుర్తించలేని స్థితిలో ఉంది. ఒకవేళ గుర్తించినా తానేం చేయాల్లో, దీనికి ప్రతిగా తన వ్యూహమేమిటో తెలుసుకోలేని పరిస్థితిలో ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక జాతీయ స్థాయి ప్రతిపక్షం ఇంత అయోమయంగా వ్యవహరించడం, ఇంతగా దిక్కుతోచని స్థితిలో ఉండడం ఏ దేశ చరిత్రలోనూ కనిపించదు.

కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒకటి రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. తాను అంతరించిపోవాలని కోరుకుంటోందా? ప్రస్తుతానికి తాను ప్రతిపక్షంగానే కొన సాగాలని భావిస్తోందా? బీజేపీకి లొంగిపోవాలని ఆశిస్తోందా? కాంగ్రెస్ ముక్త భారత్ ను, కాంగ్రెస్ రహిత భారత్ ను కోరుకుంటున్న బీజేపీ ఆశయాన్ని నెరవేర్చదలచుకుందా? మధ్య మధ్య విజయాలు కూడా సిద్ధిస్తున్నందువల్ల ఈ పార్టీ అటువంటి స్థాయికి దిగజారిపోయే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సాధించిన విజయాలను బట్టి కాంగ్రెస్ పార్టీ కాస్తంత సానుకూలంగా ఆలోచించే అవకాశమే ఉంది. రాహుల్ గాంధీలో కూడా కొంత సానుకూల దృక్పథమే ఉండి ఉండాలి. ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించదలచుకోవడమే ఇందుకు నిదర్శనం. భారత్ జోడో యాత్ర ఘన విజయం సాధించకపోవచ్చు కానీ, విఫలం మాత్రం చెందలేదు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గానీ, దానికి నాయకత్వం వహిస్తున్న నెహ్రూ-గాంధీ కుటుంబం కానీ అంత తేలికగా బీజేపీకి లొంగిపోయే అవకాశం లేదు. రాహుల్ గాంధీయే తమకు ప్రధాన ప్రచార సారథి అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్రకటించినందు వల్ల బీజేపీ ఇక నిబ్బరంగా ఎన్నికల ప్రచారం సాగించడా నికి అవకాశం ఏర్పడింది.

ఆధునిక భావజాలం
అయితే, దేశ ప్రజల్లో చాలామందికి కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీద ఉందేమోనన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఒక్కోసారి ఎంతో తెలివిగా, విషయ పరిజ్ఞానంతో వ్యవహరించే పార్టీ నాయ కత్వం మరొకసారి అతి దారుణమైన పొరపాట్లు చేస్తూ ఉంటుంది. చేసిన తప్పుల్నే చేస్తూ ఉంటుంది. ఆ పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా కొరవడుతుంది. ఆ పార్టీ తరచూ దెబ్బ తింటూ ఉండడమనేది పూర్తిగా స్వయంకృతాపరాధం. ఆ పార్టీ క్రమంగా ప్రజలకు దూరమైపోతూ ఉండడానికి, వైఫల్యాలను, పరాజయాలను ఎదుర్కొంటూ ఉండడానికి కొన్ని కీలకమైన కారణాలున్నాయి. ఈ కారణాలను ఆ పార్టీ ఒప్పుకోదు, మార్చుకోదు.

అవిః

కుటుంబ పాలన, విపరీతమైన అవినీతి, మైనారిటీల బుజ్జగింపు, కుహనా లౌకికవాదం, జనాకర్షణ విధానాలు, ద్వితీయ శ్రేణి నాయకత్వ లేమి, ఆర్థిక సంబంధమైన అవకతవకలు, కొత్త ఆలోచనలకు కొరత, సిద్ధాంతాల క్షీణత వగైరాలు. ఓ పార్టీకి ఉండవలసిన లక్షణాలన్నీ క్రమంగా మృగ్యమైపోతున్నా, ఆ పార్టీకేమీ పట్టడం లేదు. గత కాలపు భేషజాలు, డాబూ దర్పాలనే ఇంకా కొనసాగిస్తోంది. తాము సంస్థానాధీశులమన్న అభిప్రాయం నుంచి అది ఒకపట్టాన బయటపడలేకపోతోంది. అది ఒకటి రెండు విజయాలు సాధించిందంటే అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేకత, పాలక పక్ష వైఫల్యాలు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, బలమైన ప్రత్యర్థులున్న పక్షంలో కాంగ్రెస్ నెగ్గే అవకాశమే ఉండదు. దేశ రాజకీయ రంగంలో బీజేపీ దినదినాభివృద్ధి చెందడం, నరేంద్ర మోదీ ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీద చేరడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే, ఆ పార్టీలోని లోపాలు, లొసుగుల కారణంగానే బీజేపీ భారత రాజకీయ రంగంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదగ గలిగింది. జాతీయ స్థాయిలోనే కాక, రాష్ట్ర స్థాయిలోనూ అది అనేక విజయాలు సాధించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు విధానాలే కారణం. కుల, మతాలకతీతంగా బీజేపీ వ్యాప్తి చెందుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు దెబ్బతింటోంది. తాము అభివృద్ధికి, సమర్థ పాలనకు, జాతీయవాదానికి ప్రతీకలమని చెప్పుకోవడంలో బీజేపీ పురోగతి చెందుతుండగా, అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు ధోరణి వగైరాలకు ప్రతీకగా కాంగ్రెస్ మారిపోతోంది.

సమగ్ర విధానం
ఇటువంటి దాడిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఇంతవరకూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించుకోవడం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమంటూ ప్రారంభమైన ప్రచారం ఇప్పుడు దేశానికే వ్యతిరేకమంటూ కొనసాగుతోంది. ఒకప్పుడు మధ్యేవాద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వామపక్ష సిద్ధాంతాల వైపు మొగ్గు చూపుతుండడంతో దేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలు, ముఖ్యంగా యవత ఈ పార్టీకి దూరమైపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతోంది. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీకి ప్రత్యామ్యాయం అయ్యే అవ కాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలకు స్వస్తి చెప్పాలి. ప్రతికూల భావాలను విడనాడాలి. నిర్విరామంగా పాలక పక్షాన్నీ, నరేంద్ర మోదీని విమర్శిస్తూ పోవడం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఒక బాధ్యతాయుతమైన, గుణాత్మకమైన, నిర్మాణాత్మమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం ఆ పార్టీ ఇప్పటికైనా అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రజల నమ్మకం చూరగొనాలన్న పక్షంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. నిజాలు మాత్రమే చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దేశంలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులకు వ్యతి రేకంగా వ్యాఖ్యలు చేయడం, విమర్శలు చేయడం మానుకోవాలి. నినాదాలు చేయడంతో తృప్తి పడకుండా కార్యాచరణలో కూడా చూపించాలి. అవసరమున్నా, లేకపోయినా జాతీయవాదాన్ని ఖండించడాన్ని కూడా మానుకోవాల్సి ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాస్ చంద్రబోస్ వంటి నాయకులను గౌరవించడం కూడా అలవరచుకోవాలి.

అన్నిటికన్నా ముఖ్యంగా ముందు పార్టీలోనే మార్పులు, చేర్పులు తీసుకురావాలి. పార్టీని అన్ని స్థాయిల్లోనూ పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, కొత్త నాయకులకు ద్వారాలు తెరవడం అన్నది ఏ పార్టీకైనా చాలా అవసరం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ప్రక్షాళన చర్యలు తీసుకోవడం అవసరం. ఆత్మపరిశీలన, ఆత్మ వి‍మర్శ చేసుకోవడం చాలా మంచిది. నిజానికి ఇందుకు చాలా కాలమే పట్టవచ్చు. కానీ, ఇందుకు చర్యలు వెనువెంటనే ప్రారంభించినా ప్రజల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

– బి. కామేశ్వరరావు,

మాజీ లెక్చరర్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News