జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం JSW నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. దావోస్ లో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
JSW ఎనర్జీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉన్నది. ఈ సంస్థ థర్మల్, హైడ్రో మరియు సౌర వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా, ఇది 4,559 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. JSW నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేస్తుంది.
తెలంగాణలో ఏర్పాటు చేసే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుందని అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా JSW ఎనర్జీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, భవిష్యత్ ప్రాజెక్టులపై సహకరించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రభుత్వం అందించిన సహకారానికి సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో JSW వేగంగా విస్తరిస్తున్నదని, తెలంగాణలోనూ తమ గ్రూప్ ను విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.