Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్NTR Death anniversary: జెండాపై కపిరాజు 'ఎన్టీఆర్'

NTR Death anniversary: జెండాపై కపిరాజు ‘ఎన్టీఆర్’

తెలుగువారందరికీ అన్నగారు ఎన్టీఆర్ వర్ధంతి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ‘నందమూరి తారక రామారావు’ పేరు వినగానే ఏ తెలుగువాని మనసైనా నవనవోన్మేష అనుభూతికి గురికాక తప్పదు. నవకోటి కాంతుల పులకరింతలతో మేను పరవశించక మానదు. ఒకటేమిటి రెండేమిటి అనేకానేక ఆనందదాయక భావోద్వేగాలు ఒక్కసారిగా మనల్ని తడుముతూ కుదిపేస్తాయి. మీదే ప్రాంతమని ఉత్తరాదిలో మన తెలుగు వాళ్ళని ఎవరైనా అడిగితే మేం తెలుగు వాళ్ళమని సమధానమిస్తే, ఓహో! మీరు మదరాశీలా? అని మన అస్తిత్వాన్ని వారంతా తరచూ ప్రశ్నించేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రుడంటే ఇలా ఉంటాడని, ఆంధ్రుడంటే అందరి వాడని చెబుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్. ఆంధ్ర ప్రజానీకమంతా రామారావు గారిని ‘అన్నగారు’ అని ఆత్మీయంగా పిలుస్తుంటారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో ప్రేమపూర్వక స్థానాన్ని సంపాదించుకున్నారు. నందమూరి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రిగా అశేష కీర్తిని గడించారు. గడీలలో ఉన్న రాజకీయాన్ని గల్లీలోకి తీసుకొచ్చిన రాజకీయ చైతన్యశీలి. వెనుకబడిన, దళిత, గిరిజన వర్గాల వారిని పెద్దయెత్తున ప్రజా ప్రతినిధులుగా శాసనసభకు పంపిన ఘనత ఎన్టీఆర్ దే. ఎవరు ఇంతటి ప్రజాకర్షణ గల వ్యక్తి ? అని, ఢిల్లీలో కాంగ్రెస్ వాదుల గుండెల్లో గుబులు రేకెత్తించిన రాజకీయ దురంధరుడు. ఒక సినిమావాడు ఎన్నికల్లో పోటీ చేసి ఏమిచేయగలడని? అపహాస్యము చేసిన ఎందరో రాజకీయ నాయకుల నోళ్లు మూయించిన ఉద్దండ పిండం ఎన్టీఆర్.

- Advertisement -

‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు’ అనేది ఎన్టీఆర్ ఉవాచ. అది కేవలం ఉవాచ మాత్రమే కాదు. మనసా వాచా కర్మేనా ఆచరించిన మంత్రం. ప్రగతిశీలవాదులు మాత్రమే ఇలాంటి నినాదాన్ని సర్వత్రా ఆచరిస్తారు. ఎన్టీఆర్ తన జీవితంలో తుచ తప్పకుండా ఆ నినాదమనే నమ్మకాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగిన మనిషి. రామారావు గారు సినిమాల్లో నటిస్తున్నప్పుడు అనేక పురాణేతిహాసాల నుండి తీసుకున్న రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, కర్ణుడు లాంటి ప్రతి నాయకుల పాత్రలకు గొప్ప గౌరవాన్ని ఇనుమడింపజేసేవారు. ఆయా పాత్రలకు ఉదాత్తత పరిఢవిల్లేలా స్క్రిప్టును తానే రాసేవారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు విజయవంతంగా చేపట్టారు. పౌరాణిక కథానాయక పాత్రలకు పోటీగా ప్రతినాయక పాత్రలను తీర్చిదిద్ది, అగ్రకుల ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఒక కౌంటర్ కల్చరల్ విధానాన్ని సినిమాల్లో ప్రవేశపెట్టడం ఆనాడు ఎన్టీఆర్ తోనే ప్రారంభమయ్యిందనవచ్చు. అందుకే అతనిని నూతన సినీ సాంస్కృతిక సమాజానికి యుగకర్తగా కీర్తించవచ్చు.
ఎన్టీఆర్ 1923 వ సం: మే 28 వ తేదీన కృష్ణా జిల్లా, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. 1947లో పట్టభద్రులై ఉద్యోగ వేటలో పడ్డారు. కొన్నాళ్ళు మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం చేశారు. 1949 ‘మన దేశం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు నందమూరి. 1950లో పల్లెటూరి పిల్ల, 1951లో పాతాళభైరవి మరియు మల్లీశ్వరి, 1952లో పెళ్లి చేసి చూడు మరియు చంద్రహారం ఎన్టీఆర్ ను గొప్ప నటునిగా తీర్చిదిద్దాయి. 1956 లో మాయాబజార్, 1959లో భూకైలాస్, 1960లో వేంకటేశ్వర మహాత్మ్యం మంచి విజయాన్ని సాధించాయి. 1963 లో లవకుశ అతి పెద్ద విజయాన్ని అందుకుంది. 1977లో స్వీయ దర్శకత్వంలో విడుదలైన ‘దానవీరశూరకర్ణ’ లో మూడు పాత్రలు వేసి జనాన్ని మరీమరీ మెప్పించారు. 1979 లో శ్రీమద్విరాట్ పర్వం చిత్రంలో ఐదు పాత్రలు తానే పోషించి ప్రభంజనం సృష్టించారు. మిస్సమ్మ, గుండమ్మ కథ, దేవత, బడిపంతులు మొదలగు చిత్రాలలో ఎన్టీఆర్ నటనకు గాను ప్రజలు ముగ్ధులయ్యారు.
ఇలా చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధ పాత్రలను ధరించి ప్రజలను సమ్మోహన పరిచేవారు. 55 యేళ్లు పైబడిన వయసులో అడవి రాముడు, యమగోల, వేటగాడు, గజదొంగ, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి లాంటి చిత్రాల పాటల్లో వేసిన డాన్స్ లకు జనం ఊగిపోయేవారు. చేసిన ఫైట్స్ కు మైమరిచిపోయేవారు. ఆయన పలికే సంభాషణలకు జనం జేజేలు పలికేవారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆయన చిత్రాన్ని ప్రదర్శించిన సినిమా హాళ్లన్నీ మారుమ్రోగేవి. అంతలా జనాన్ని కట్టిపడేసేవారు ఎన్టీఆర్. ఆయన నట కౌశలానికి మెచ్చి1968 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించారు.
రామారావు గారి సినిమాలు చూసుకొని పెరిగిన వాడ్ని నేను. ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటికి మేము పుట్టక పోయినప్పటికీ, కలర్ సినిమాలు వచ్చేనాటికి అంటే 70వ దశకంలో మేము బాలలం. మేము పాఠశాలకు వెళ్లే దారిలో ఒక బజారు ఉండేది. మాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ లో ఏదైనా సినిమా మారితే, ఆ సినిమా పోస్టర్లు తెల్లవారేసరికి బజారులో ఉన్న దుకాణాల గోడలకు అంటించేవారు. స్కూల్ కి వెళ్లేటప్పుడు మరియు తిరిగి వచ్చేటప్పుడు వాటిని మేము నోరెళ్లబెట్టి చూస్తూ అలా ఉండి పోయే వాళ్ళం. ఈ క్రమంలో ఒకరోజు ‘అడవి రాముడు’ సినిమా వాల్ పోస్టర్ రెండు మూడు దుకాణాలకు అటూఇటూ అంటించారు. ఆ పోస్టర్లను చూసుకుంటూ చాలాసేపు అలా ఉండిపోయాం. దాంతో పాఠశాలకు వెళ్లాల్సిన టైం దాటిపోయింది. టీచర్లు ఏమంటారోనన్న భయంతో ఆ పూటంతా అలానే బడ్డీల దగ్గర పోస్టర్లను చూస్తూ గడిపేం. దారిని పోయే జనం సినిమా పోస్టర్లను చూస్తూ కాలం గడపడం ఆ రోజుల్లో రివాజు. ఎన్టీఆర్ చిత్రాల పోస్టర్లు చూడడమైతే మరీను. అంతలా అభిమానాన్ని ప్రేక్షకుల మదిలో సంపాదించుకున్నారు ఎన్టీఆర్.
ఒకరోజు ఎన్టీఆర్, ఎఎన్ఆర్ నటించిన మల్టీస్టార్ సినిమా ‘రామకృష్ణులు’ ప్రచార రథం మా ఊరు వచ్చింది. చిన్న చిన్న సినిమాలకైతే సైకిల్ మీద వచ్చి ఊరూరా పోస్టర్లు అంటించేవారు. కానీ పెద్ద పెద్ద కాంబినేషన్లో వచ్చే సినిమాలకు జీపుల్లో ప్రచారం చేసేవారు. అలా జీపు వచ్చినప్పుడు కరపత్రాలు పంచేవారు. జీపు వెనక మా పిల్లలమంతా పరిగెత్తుకుని వెళ్లడం భలే సరదా. అదొక ఆసక్తికర అనుభూతి. జీపులో ఉన్నవాళ్ళు కరపత్రాలు విసురుతుంటే అవి ఏరుకునే వాళ్ళం. ఈ క్రమంలో నాకు పెద్ద కరపత్రాల కట్టొకటి దొరికింది. దాన్ని అపురూపంగా ఇంటికి తెచ్చి, స్నేహితులమంతా వీధిలో ఉన్న గోడలకి అంబలితో అంటించి ముచ్చట పడ్డాం. చిన్నతనంలో సినిమాలే ప్రపంచంగా బతికాం. ప్రజలు సినిమాల గూర్చి ఎక్కువగా చర్చించేవారు. రామారావు గారి గురించైతే మరీ మాట్లాడుకునేవారు. పిల్లలం అయితే పెద్దల మాటలు ఆసక్తిగా వినేవాళ్ళం. అదే అప్పటి దుర్వసనం. కానీ నేటి చెడ్డ అలవాట్లతో ఆ వ్యసనాన్ని పోల్చుకుని చూస్తే, అసలు అది దుర్వసనమే కాదని చెప్పొచ్చు.
ఆ రోజుల్లో సినిమాలు అర్థ మరియు శత దినోత్సవాలు జరుపుకునేవి. నేడు అలాంటి సంబరాలైతే కరువయ్యాయి. ఎందుకంటే చిత్రాలు అన్నేసి రోజులు ప్రదర్శించడం గగనమై పోయింది. ఆనాడు సినిమాలు 50 రోజులు, 100 రోజులు ప్రదర్శింప బడితే అవి పలు దినపత్రికల్లో ఏ ఏ సెంటర్లలో ఎన్ని రోజులు ప్రదర్శితమయ్యేవో! అనే విషయం తెలిపేలా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ను పిల్లలంతా భద్రంగా దాచుకునేవారు. వాటిని మా పుస్తకాలకు అట్టలుగా వేసుకునేవాళ్ళం. ఉపాధ్యాయులు అవి చూస్తే మాపై కోప్పడేవారు. అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మొదటి రోజు మొదటి షో చూడాల్సిందే మరి. అది ఒక ఎక్సైట్మెంట్ గురిచేసే సందర్భం. ఒకవేళ ఆ చిత్రం మా ఊరు రాకపోతే వేరే ఊరు సైకిళ్లపై వెళ్లి చూసేవాళ్లం. తిరిగి వచ్చేక మిత్రులతో సినిమా గూర్చి చర్చించే వాళ్ళం. రామారావు గారి సినిమాలకు సుదూర ప్రాంతం సైకిళ్లపై వెళ్లే సందర్భాలు కోకొల్లలు.
ఆనాడు సినిమాలకు గొప్ప ప్రజాదరణ ఉండేది. జనరంజకమైన వినోద సాధనం ఆనాడు సినిమాలే. సినిమావాళ్ళలా ఉండాలనే తాపత్రయం ఆనాటి యువతి యువకుల్లో ఉండేది. నటీనటులు ఏ ఫ్యాషన్ దించితే ఆ ఫ్యాషన్లలో కళాశాలలకు వెళ్ళడం జరిగేది. నేరో కట్, బెల్ బాటన్, డిస్కో, బ్యాగి మొదలగు స్టైళ్లలో ప్యాంట్లను దర్జీలతో కుట్టించేవాళ్ళం. ఇంకా హీరోలు ధరించే టీషర్ట్స్, బనియన్లు; హీరోయిన్ వేసుకునే చీరలు, బ్లౌజెస్, మోడ్రన్ డ్రెస్సెస్ పలురకాల మోడళ్లలో అమ్ముడుపోయేవి. వాటిని ధరించడానికి జనం తెగ ఆరాటపడేవారు. సినిమా పాటల పుస్తకాలు, క్యాలెండర్లు ఎక్కువగా విక్రయించబడేవి. పిల్లలు ఆయా పాటలను సాధన చేసేవారు. ఎన్టీఆర్ పాటలకైతే మరీ గిరాకీ ఉండేది.
1982 లో ఎన్టీఆర్ సినిమా రంగం వదిలి మహోన్నత లక్ష్యంతో రాజకీయ రంగ ప్రవేశం చేసారు. తదనంతరం 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టిగరిపించిన మహా నాయకుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలిరా! అంటూ తన చైతన్య రథంపై ఆనాడు ఎన్టీఆర్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తూ పలు సభలు నిర్వహించేవారు. ఆయన వెళ్లిన చోటల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. ఆయన కోసం జనం పడిగాపులు కాసేవారు. అందువల్ల అనుకున్న టైం షెడ్యూల్ కి ఆ ఊరు చేరుకునేవారు కాదు. దాంతో జనం ఎన్ని గంటలైనా ఆయన కోసం వేచిచూస్తూ ఉండేవారు. నాటుబళ్ళు, ట్రాక్టర్లు కట్టించుకొని ప్రజలు ఆయన సభలకు హాజరయ్యేవారు. అదొక కథలు కథలుగా చెప్పుకునే చరిత్ర.
అలా ఎన్టీఆర్ ఓ రోజు మా ఊరు రాజాం వస్తున్నట్లు తెలిసింది. అతను ఇచ్చిన టైం షెడ్యూల్ సాయంత్రం 4 గంటలు అయితే, జనం అప్పటికి కొన్ని గంటలు ముందుగానే తండోపతండాలుగా సభాస్థలికి చేరుకున్నారు. ఊకపోస్తే ఊక రాలనంత జనం. కానీ ఆయన టైం కు చేరుకోలేకపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఒక్క వ్యక్తి కూడా తిరిగి ఇంటికి పోలేదు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా జనం ఆయన కోసం అంతలా ఎదురు చూశారు.
ఆయన్ని ప్రజలు నిజమైన దేవుడిగా భావించేవారు. రాముడిగా, కృష్ణుడిగా నటిస్తే దేవుడే దివి నుండి భువికి దిగి వచ్చాడా! అన్నట్లు భావించి జనం నీరాజనాలు పలికేవారు. అంతలా ప్రజలు ఆదరించిన, ఆరాధించిన నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన సినిమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ పెను సంచలనాలనే సృష్టించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించి ఏకచత్రాధిపత్యాన్ని వహించిన మహారాజుగా జనం చేత వేనోళ్ళ కొనియాడబడ్డారు. తన పరిపాలనలో పూర్తిగా ప్రజా సంక్షేమమే కోరుకునేవారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల శ్రేయస్సుకు నిరంతరమూ కృషి చేసేవారు. 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన పథకాలను రూపకల్పన చేసారు. దాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ఆదర్శప్రాయులైరి. కూడు, గూడు, గుడ్డ ప్రజలకు ఉచితంగా అందించాలని పరితపించేవారు. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో ఇల్లు కట్టించి పేదల పరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున మహిళా మణులు సారా ఉద్యమాన్ని లేవనెత్తడంతో వారి నిరసనను అర్థం చేసుకొని సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేశారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలన చేసేవాడే నిజమైన రాజు. రామరాజ్యం ఇలా ఉంటుందని, సమాజానికి ఎరుక పరిచిన రాజకీయ మేధావి ఎన్టీఆర్. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ నక్సలైట్లను దేశభక్తులని అభివర్ణించారు. భూమికోసం, భుక్తి కోసం అడవులు బాట పట్టి, తుపాకీ ఎక్కుపెట్టి పోరాటం చేస్తున్న నక్సలైట్ల అంతర్గత సమావేశాల్లో ఎన్టీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమం పట్ల ఆకర్షితులై ఇక మనం పోరాటం వదిలేసే తరుణం ఆసన్నమైందనే చర్చ కూడా వచ్చిందంట. ఆనాడు కామ్రేడ్ వంగపండు ప్రసాదరావు రచించిన ‘భూమి బాగోతం’ బహుళ ప్రజాదరణ పొందింది. ఆ జానపద నాటకానికి స్పందించి, మునసబు-కరణాల వ్యవస్థను రాష్ట్రంలో రద్దు చేశారనే వాదన ఉత్తరాంధ్ర ప్రజానీకంలో ప్రబలంగా ఉంది. ఆ వ్యవస్థ రద్దుతో గ్రామీణులు సంబరాలు చేసుకోవడం ఎరుకే కదా! అంతలా ఎన్టీఆర్ పరిపాలన జన హృదయాలను కొల్లగొట్టింది. ఇలా అనేక అభివృద్ధి పథకాలను ప్రజలకు అందిస్తూ ఏడేళ్లకు పైగా తేజోవంతమైన పరిపాలన చేసారు. 1989లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాక ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని చక్రం తిప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసి ‘నేషనల్ ఫ్రంట్’ అనే నూతన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు.
చక్కని ముఖవర్చస్సుతో, రాజఠీవితో నడుస్తూ, గంభీరంగా సంభాషిస్తూ, అందర్నీ సమ్మోహన పరుస్తూ కనిపించే చెయ్యెత్తు మనిషి ఎన్టీఆర్. ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యత అతని సొంతం. క్రమశిక్షణ, కష్టపడే తత్వం అతని అభివృద్ధికి మార్గాలు. అంతేకాదు కార్యసాధకుడు కూడా. పని పూర్తయ్యే క్రమంలో ఎంతవరకైనా పోగల మనస్తత్వం ఉండేది. అతనిలో అమాయకత్వం, చిన్నపిల్లల తత్వం మరో కోణంలో చూడొచ్చు. ఇదే అతన్ని కొంతవరకు విమర్శలు పాల్జేసింది. సిలకట్టులోనైనా, ప్యాంటులోనైనా, చివరికి సన్యాసిగానైనా ఆయన స్ఫురద్రూపి.
ఆ మోహన రూపం తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ పదిలంగానే ఉంటుంది. నిత్య నూతనమై విలసిల్లుతుంది. ఇలా ఆ మహానుభావుని గూర్చి ఎంతసేపైనా చెప్పొచ్చు. ఎంత సమయమైనా మాట్లాడొచ్చు. ఆయన సినిమా, రాజకీయ అనుభవాలతో గడిపిన క్షణాలను పుంఖాను పుంఖాలుగా పేపర్ పై పెట్టొచ్చు. సాహిత్యకారులైతే ఆ యుగపురుషుని నట వైదుష్యాన్ని, పరిపాలనా వైశిష్ట్యతను పొగుడుతూ గొప్ప సాహిత్యాన్ని సృజన చేయొచ్చు.
ఆయనకు తెలుగు భాష అంటే అమితమైన ప్రేమ, మమకారం. తెలుగు భాషపై ఆయనకు పట్టు ఎక్కువ కూడా. పలు సందర్భాల్లో ఈ విషయం దృగ్గోచరమయ్యేది. ఆయన తెలుగు భాషకు చేసిన సేవలు అజరామరం. 1985 లో తెలుగు విశ్వవిద్యాలయ స్థాపననేది ఆయన పాలనలో కీలకమైన నిర్ణయం. దాంతో ఎందరో తెలుగు సాహిత్యకారులు, కళాకారులకు ఆ వేదికపై గౌరవించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. భాగ్యనగరంలో ట్యాంక్ బండ్ పై ప్రముఖుల విగ్రహాలు నెలకొల్పడం మొదలు ఆయన చేసిన అనేక పనులు తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. అంతేకాదు తన పరిపాలనలో ఉన్న అనేక ప్రభుత్వ శాఖల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలనే కీలక నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేశారు. తెలుగు భాషలో నిష్ణాతులైన వారికి ఉద్యోగాలలో కొన్ని మార్కులు అదనంగా కేటాయించాలనే వారు. బహుశా ఆయనలా మాతృభాషాభిమానం గల ప్రజా నాయకులు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ కానరారంటే విడ్డూరమేమీ కాదు.

(జనవరి 18 తేదీన ‘ఎన్టీఆర్’ వర్థంతి సందర్భంగా వ్రాసిన వ్యాసం)

పిల్లా తిరుపతిరావు…7095184846

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News