కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావుపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానానికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గురువారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. అధికారులు తెలిపిన సమయానికి 10వ వార్డ్ కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి మాత్రమే హాజరు అయ్యారు. దీంతో తిరిగి మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు సమయాన్ని పొడిగించారు. అయినప్పటికీ కౌన్సిల్ సభ్యులు ఒక్కరు కూడా ఒంటిగంట వరకు హాజరు కాకపోవడంతో కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లుగా ప్రత్యేక అధికారి మహేశ్వర్ ప్రకటించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా తక్కల్లపల్లి రాజేశ్వరరావు కొనసాగనున్నారు.
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట సిఐ బర్పటి రమేష్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హుజురాబాద్ సిఐ బొల్లం రమేష్, జమ్మికుంట ఎస్సై రాజేష్, ఇల్లందకుంట ఎస్సై రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
✳️ టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు…
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని అధికారులు ప్రకటించడంతో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.