Tuesday, May 14, 2024
Homeటెక్ ప్లస్300 Cell towers in Tribal areas: మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4G...

300 Cell towers in Tribal areas: మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్‌టవర్స్‌ ప్రారంభించిన సీఎం జగన్

ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందేలా జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు 300 సెల్‌టవర్లను సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 ఏర్పాటు అవ్వగా, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్‌ ఏర్పాటయ్యాయి. ఈ టవర్ల ఏర్పాటు ద్వారా 944 ఆవాసాలకు, 2 లక్షల మంది ప్రజలకు ఉపయోగం కలుగనుంది. ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటయ్యాయి.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

ఈ రోజు దేవుడిదయతో మరో మంచికార్యక్రమం జరుగుతుంది. గతంలో జూన్‌లో 100 టవర్లు ఇదేమాదిరిగా ప్రారంభించుకున్నాం. ఈరోజు మరో 300 టవర్లు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడైతే పూర్తిగా కనెక్టివిటీ లేని పరిస్థితి ఉందో, ఫోన్లలో మాట్లాడడానికి కూడా అనుకూలించని పరిస్థితులు ఉన్న గ్రామాల్లో ప్రారంభించుకుంటున్నాం.

సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లాలి. పారదర్శకంగా ఆ సంక్షేమపథకాలన్ని ప్రతి ఇంటికి అందాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ 400 టవర్లును దాదాపుగా రూ.400 కోట్ల పెట్టుబడితో నిర్మించుకున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ 300 టవర్లతో, 2లక్షల మంది జనాభాకు ప్రయోజనం కలిగనుంది. 944 గ్రామాలు వీటి ద్వారా కనెక్ట్‌ అవుతున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన 100 టవర్లతో 42వేల జనాభాకు ప్రయోజనం కలిగింది. చేరుకోవాల్సిన మార్గం ఇంకా ఉంది. దాదాపుగా ఇంకా మనం మరో 2,400 టవర్లును రానున్న నెలల్లో వేగంగా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 2900 టవర్లును ఏర్పాటు చేయడం ద్వారా… కనెక్టివిటీలేని 5,459 ఆవాసాలను కనెక్టివిటీలోకి తీసుకొచ్చే బృహత్తర ప్రణాళిక ఇది. సుమారు రూ.3119 కోట్లతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించాం. దీన్ని సఫలీకృతం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి.. ఇందులో భాగస్వామ్యం చేసేందుకు ఒప్పించాం. టవర్ల నిర్మాణం దిశగా అడుగులు వేగంగా వేయగలిగాం. టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను 2,900 లొకేషన్లలో ఇప్పటికే ఇచ్చాం.

ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాం. టవర్ల ఏర్పాటు కోసం పవర్‌ కనెక్షన్‌కు అనుమతులు కూడా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ కూడా రెట్టించిన వేగంతో చేశాం. 2,900 టవర్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఈ దఫా 300, గతంలో 100 మొత్తం 400 టవర్లు ఏర్పాటు పూర్తయింది. ఇక మిగిలిన టవర్ల నిర్మాణానికి అడుగుల వేగంగా పడుతున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలకొకసారి… 400 నుంచి 500 టవర్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తూ… మరో ఏడాది కాలంలో అన్ని టవర్ల నిర్మాణం దేవుడిదయతో పూర్తి చేస్తాం.

ఈ టవర్లు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో.. కనెక్టివిటీ లేని ఆవాసాలను సమాజంతో కనెక్ట్‌ చేసే కార్యక్రమం జరుగుతుంది. టీవీలు, ఫోన్లు పనిచేస్తాయి. మనం ఇచ్చే పథకాలు అన్నింటికీ వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. మనం బటన్‌ నొక్కిన వెంటనే వాళ్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే కార్యక్రమం కూడా అంతేవేగంగా జరుగుతుంది.


వాళ్లు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వేగవంతంగా, ఎఫెక్టివ్‌గా, పారదర్శకంగా జరగడం కోసం ఈ కనెక్టివిటీ చాలా అవసరంగా భావించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. గ్రామసచివాలయాలు, ఆర్బీకే వ్యవస్ధలు, విలేజ్‌ క్లినిక్‌లు, నాడు నేడుతో బాగుపడుతున్న ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఇవన్నీ గ్రామాన్ని, గ్రామ రూపురేఖలను మార్చే దిశగా పడుతున్న అడుగులు. అందులో భాగంగానే ఈ కనెక్టివిటీ అన్నది కూడా ఆ అడుగుల్లో ఒక ఉపయోగకరమైన అంశం అవుతుందని జగన్ ప్రసంగంలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News