Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Joshimath: హిమాలయ ప్రాంతాలకు అభివృద్ధే గొడ్డలిపెట్టు

Joshimath: హిమాలయ ప్రాంతాలకు అభివృద్ధే గొడ్డలిపెట్టు

జోషిమఠ్ మానవ తప్పిదమే అని పదేపదే అందరికీ చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. పాత వీడియోలు, ఫోటోలు, ప్రసంగాలు అన్నీ ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చి హిమాలయాల్లో ఏం జరుగుతోందో వివరిస్తోంది. ఇందులో భాగంగా దివంగత సుష్మాస్వరాజ్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగం కూడా వైరల్ గా మారింది. కానీ అసలు హిమాలయ పర్వతాల్లో, హిమాలయ పర్వత పాదాల్లో నివసిస్తున్న ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ఏనాడు ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు.

- Advertisement -

అభివృద్ధి అంటే పర్వతాలు, కొండలు, గుట్టలు, నదులు, కాలువలు, సముద్రాలను ఆక్రమించేసి ఊళ్లుగా చేసేయటం లేక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టడమే అంటే ఎలా. ప్రకృతిని ధ్వసం చేసి వికృతిని సృష్టించి దానికి కాంక్రీట్ జంగిల్ అని పేరుపెట్టేసి..అదే అభివృద్ధి పాముకోండి అని జనాలపైకి తోసేస్తే దానికి బలయ్యేది ఎవరంటే.. యావత్ మానవాళి కూడా. ఇది గ్రహించనంత కాలం ఈ విధ్వసం సాగుతూనే ఉంటుంది. పైపెచ్చు ఇది హిమాలయాల్లో మాత్రమే కాదు ప్రతి ఊళ్లోనూ సాగుతున్న దందా. కొండలకు కొండలు మాయమై అక్కడ మహానగరాలు, శాటిలైట్ సిటీలు రాత్రిరాత్రి పుట్టుకొస్తున్నాయి. మరి ప్రళయం తరుముకుని రమ్మంటే రాదా అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు కొట్టుకుంటున్నా ప్రజలేమో అభివృద్ధి కావాలంటుంటే ప్రభుత్వాలు ఈ విధ్వంసాన్ని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఇది ప్రభుత్వం-ప్రజల పాపమే అని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు.

పర్యాటకుల స్వర్గధామం, భక్తులకు ఇలలో స్వర్గంలా ఉన్న హిమాలయ ప్రాంతాల్లో విపరీతమైన పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చార్ ధాంతో పాటు హిమాలయాల్లోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పేరుతో సాగుతున్న ప్రాజెక్టులు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఈమధ్యకాలంలో హిమాలయ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ తరచూ చూస్తున్నాం. ఇది చాలక ఇప్పుడు జోషీమఠ్ వ్యవహారం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని ప్రజలను వణికించేస్తోంది.

ప్రకృతి రమణీయతకు చిరునామా హిమాలయాలు. అలాంటి హిమాలయాలను అతిగా అభివృద్ధి చేస్తే వచ్చే అనర్థం ఇదేనంటూ జోషీమఠ్ లోని 25శాతానికి పైగా భవనాలకు పదేపదే పగుళ్లు వచ్చి..కుప్పకూలుతున్నాయి. దీంతో జోషీమఠ్ ఖాళీ చేసి..ఇతర సురక్షిత ప్రాంతాలకు ఇక్కడి ప్రజలు వలస పోక తప్పని దుస్థితి నెలకొంది. జోషిమఠ్ కుంచించుకు పోవటాన్ని ఏటా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా పరిశోధకులు గుర్తిస్తున్నారు, సర్కారును ప్రజలను హెచ్చరిస్తున్నారు అంతేకానీ దీనికంతా కారణం ఏంటో గుర్తించి, పరిష్కారాన్ని అమలు చేయలేక ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్ ఒక్కటే కాదు ఇలాంటి ప్రాంతాలు హిమాచల్, ఉత్తరాఖండ్ లో చాలా ఉన్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు నిద్రలేచిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఉన్న ఆవాసాలెన్ని, జనాభా ఎంత, వచ్చిపోయే టూరిస్టులు, వారికోసం నిర్మించిన హోటళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జుల పరిమాణాన్ని ఆ ఊళ్లు తట్టుకుంటాయా లేదా అన్న కోణంలో సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి చేసిన ప్రకటన చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుందని జోషీమఠ్ ప్రజలకు ఆగ్రహావేశాలు తెప్పిస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడికక్కడ నిలిపేసి.. శాస్త్రవేత్తల సలహాలు సూచనలతోనే ముందుకు పోతామని ప్రజలకు భరోసా ఇస్తోంది.

ఉత్తరాఖండ్ లో ఉన్నట్టుండి కొండ చరియలు విరిగి పడటం, మెరుపు వరదలు రావటం, విపరీతంగా మంచు కురవటం, అతిగా వరదలు వచ్చి కొట్టుకుపోవటం, భవనాలకు బీటలు రావటం వంటివాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఖ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విపత్తలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక పథకాలను రూపొందించి, వాటి అమలుకు డిజాస్టర్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అత్యున్నత ధర్మాసనానికి అవిముక్తేశ్వర్ స్వామి పిల్ ద్వారా మొరపెట్టుకున్నారు. అభివృద్ధి వర్సెస్ పర్యావరణం అంటే అభివృద్ధికే జై కొడితే ఏం జరుగుతుందో వివరించేందుకు సజీవ సాక్ష్యం జోషిమఠ్. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు న్యాయపోరాటం, నివేదికలు, కమిటీలు, అధ్యయనాలు అంతా వృథా ప్రయాస. ఓవైపు జోషిమఠ్ ప్రజలు తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని రక్షించండని నిత్యం ధర్నాలకు, నిరసనలకు దిగుతున్నారు మరోవైపు జోషిమఠ్ పరిస్థితి దినదినానికి అధ్వానంగా మారుతోంది. దీంతో తక్షణం అత్యంత ప్రమాదకర జోన్లో ఉంటున్న వారందరినీ తరలించి, రిలీఫ్ క్యాంపులకు పంపుతున్నారు.

పర్యవారణ పరంగా హిమాలయ ప్రాంతం చాలా సున్నితమైంది. అందుకే తరచూ హిమాలయాల్లో లోపల భూపొరలు కదులుతుంటాయి.. కొన్ని ప్రాంతాలు సహజంగానే కుంచించుకు పోతుంటాయి.. భూకంపాలు కూడా ఈ సెక్టర్ లో చాలా ఎక్కువ. నేపాల్ నే ఉదాహరణగా తీసుకుంటే హిమాలయాలున్న నేపాల్ దేశంలో నిత్యం భూకంపాలు మొదలు మిగతా ప్రకృతి విపత్తులన్నీ కనిపిస్తూనే ఉంటాయి. నిజానికి 1970లోనే ప్రభుత్వ నివేదిక ఒకటి జోషీమఠ్ ఏటా కుంచించుకుని పోతోందని తేల్చింది. మరి అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరించినట్టు.

1970 రిపోర్ట్ ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం ఈ ప్రాంతంలో ఎటువంటి భారీ నిర్మాణ పనులు జరగరాదు. కానీ పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు వీటిని నిర్లక్ష్యం చేశాయి. కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, జమునోత్రి చార్ ధాం యాత్ర కోసం పెద్దఎత్తున వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా కనెక్టివిటీని సృష్టింస్తోంది. ఇక్కడికి లక్షల్లో వస్తున్న యాత్రికులకు, పర్యాటకుల కోసం భారీగా హోటళ్లు, లాడ్జులు నిర్మిస్తుండటంతో హిమాలయ ప్రాంతం తన స్వచ్ఛతను ఎప్పుడో కోల్పోయింది. వీటికి తోడు హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులు కూడా ఈప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. హిమాలయల ప్రాంతాల్లో అభివృద్ధి ముఖ్యమైన అంశమే అయినప్పటికీ వయసు రీత్యా చూస్తే హిమాలయ పర్వత పంక్తులు ప్రపంచంలో అతి పిన్న వయసున్న పర్వత పంక్తులు పైగా ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ, మట్టి క్రమక్షయం వంటివి ఇంకా ఎక్కువ. ఇప్పుడు క్లైమేట్ ఛేంజ్ హిమాలయాలకు సరికొత్త సవాళ్లు విసురుతోంది.

ఎకాలజిస్టు చంద్ర ప్రకాష్ కాలా ఇదే విషయాన్ని 2014లో వెల్లడించారు. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, మోడర్నైజేషన్ పేరుతో జరుగుతున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇక ఈ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు, భక్తుల సంఖ్య ఏటా విపరీతంగా పెరుగుతోంది. హిమాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తారాస్థాయికి చేరాయి. 60కి పైగా టన్నెళ్ల నిర్మాణం కూడా ఇక్కడి పర్యావరణాన్ని ఘోరంగా దెబ్బతీసింది. డ్యాములు, పవర్ జనరేషన్ కేంద్రాలు, రహదారుల విస్తరణ వంటివి ఉత్తరాఖండ్ లో పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం చీలకలు వస్తున్న జోషిమఠ్ ప్రాంతంలోనే హైడ్రో పవర్ ప్రాజెక్టు ఉంది. మరోవైపు పొరుగునే ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో కూడా మరో నాలుగు పవర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇలాంటివి నిర్మించే సమయంలో నదుల ప్రవాహానికి అడ్డు తగలకుండా అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాలు సాగాలన్న నియమాన్ని ఉల్లంఘించి, విస్మరించరాదు. తపోవన్-విష్ణుగడ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం టన్నెల్స్ నిర్మాణం, చార్ ధాం కోసం రహదారుల విస్తరణ వంటివి చేస్తున్నప్పుడు ఈ నియమాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. సోలార్, విండ్ పవర్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోకుండా ఇంకా ఇలా హైడల్ పవర్ కోసం హిమాలయ పర్వత ప్రాంతాలను పిండి పిప్పి చేయటం అవసరమా అన్న ప్రశ్న భారతీయులు తమకు తాము సంధించుకోవాలి. తరువాతి తరాలకు ఇలాంటి ప్రకృతి విపత్తులనే మనం వారసత్వంగా అందించే దౌర్భాగ్యాన్ని విడనాడాలని పర్యావరణ వేత్తలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టకపోవటం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News