Tuesday, May 21, 2024
Homeఫీచర్స్Inspiration: అండర్ వాటర్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో భారత కెరటం

Inspiration: అండర్ వాటర్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో భారత కెరటం

నీటి లోపల మోడల్స్ ఇచ్చే పోజులను కెమెరాలో బంధించడం అంటే మాటలు కాదు. అలాంటి అండర్ వాటర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫరే ఇక్కడ కనిపిస్తున్న క్రితి బిసారియా. న్యూయార్కులో ఉంటున్న క్రితి ఈ రంగంలో తనదైన ముద్రను వేస్తూ అంతర్జాతీయంగా మెప్పును పొందుతున్నారు. ఆమె విశేషాలు కొన్ని… కాలిఫోర్నియా శాంటాబార్బరా బీచుల్లోని జలాల్లో స్విమ్మర్స్, డైవర్స్ చేసే ఫ్లూయెడ్ మూవ్మెంట్స్ క్రితి ఒకసారి చూసింది. ఆ ద్రుశ్యం ఆమె మనసులో చెరగని ముద్ర వేసింది. అది ఆమెలో ఒక వినూత్న ఆలోచనను రేపింది. నీటి అడుగున మోడల్స్ తో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందన్న దే ఆ ఆలోచన. కేవలం ఆ భావనే ఆమెలో ఎంతో ఎగ్జైంట్ మెంటును రేకెత్తించింది. అంతే ఆ దిశగా ఆమె తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది. ప్రొఫెషన్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్ స్ట్రక్టర్స్ లో శిక్షణను తీసుకుంది.

- Advertisement -

ఓపన్ వాటర్ స్కూబా డైవ్ లో మంచి సామర్థ్యం సాధించింది. అంతేకాదు పేరొందిన అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్స్ ఎలేనా కాలిస్, రాల్ఫ్ క్లివెంజర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. ఇటీవల ఢిల్లీలో తాను తీసిన అండర్ వాటర్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ప్రదర్శనను కూడా ఆమె నిర్వహించారు. ప్రక్రుతి అంతటా నిండివున్న సహజరంగులు, భూమి పై పరచుకున్న నీటిలోని అద్భుత కదలికలే తన ఇమేజెస్ కు స్ఫూర్తి అంటారామె. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు క్రితికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ గురించి మొదటిసారిగా తెలిసింది. క్రితి అప్పుడు ఫోటో థీసెస్ ప్రాజక్టు మీద పనిచేస్తోంది. ఆ సమయంలోనే ఆమె జెనా హోల్లోవే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ వర్కు చూడడం తటస్థించింది. అంతకుమునుపెన్నడూ అలాంటి వర్కు చూడని క్రితి ఆమె వర్కు చూసి ఫిదా అయింది. అప్పటి నుంచే క్రితి తన అండర్ వాటర్ షూటింగ్ ప్రయోగాలను ప్రారంభించింది. నీళ్ల అడుగున ఫోటోలు తీసేటప్పుడు ఫ్యాబ్రిక్, లైటింగ్ కదలికలతో విజువల్ అద్భుతాలు చేశారామె. నీటిలోని ఫ్లూయిడిటీ స్రుష్టించే అధివాస్తవికత అద్భుతంగా ఉంటుందంటారు క్రితి. ‘నీటిలో వస్తువుల కదలికలు ఎంతో ఫేసినేటింగ్ గా ఉంటాయి. అందుకే నా వర్కులో ఫ్లూయిడిటీకి, మోషన్స్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తా’ నంటారామె.

తన అండర్ వాటర్ ప్రాజక్టులు ఎన్నింటికో న్యూయార్కులోని ‘ఫ్లైయింగ్ సోలో’ తో కలిసి ఆమె పనిచేస్తున్నారు. అమెరికాలో ఎంతోమంది ఇండిపెండెంట్ డిజైనర్లకు ‘ఫ్లైయింగ్ సోలో’ పెద్ద వేదిక లాంటిది. బెజుడెన్ హోట్ కోజర్,మన్నత్ గుప్త లాంటి ఎంతో ప్రతిభావంతులైన సమకాలీన డిజైనర్లతో కూడా కలిసి క్రితి పనిచేస్తున్నారు. నీళ్ల అడుగున మోడల్స్ తో క్రితి తీసిన ఫోటోగ్రాఫ్స్ ను చూసి వీక్షకులు మంత్రముగ్ధులవుతారు. ఎరుపు, నలుపు, తెలుపు, నీలం రంగుల్లో క్రితి తీసిన ఫోటోలు పెయింటింగ్స్ లాగ ఉండడం వీక్షకులను మరింత మైమరిపిస్తాయి. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ తీయడం ఒక ఎత్తయితే, అండర్ వాటర్ మోడలింగ్ మరింత కష్టమైంది. సాహసోపేతమైంది. ఎంతో ఓర్పు, స్రుజనాత్మక ప్రతిభతో కూడుకున్నది అంటారు క్రితి. ముఖ్యంగా ఇందుకు సరైన మోడల్ ని ఎంచుకోవడం కూడా క్లిష్టమైన పనే అంటారామె. నీటి అడుగున మోడలింగ్ చేయగలగడం ఒక ఎత్తయితే, అందం, ప్రశాంతతల గ్రేస్ ఆ మోడల్స్ లో ప్రతిఫలించాలంటారామె. ఇలాంటి అండర్ వాటర్ షూట్స్ చేయగలిగే మోడల్స్ కూడా చాలా తక్కువమంది ఉన్నారు. నీటి అడుగున ఫోటోలు షూట్ చేసే ముందు అక్కడ ఇవాల్సిన పోజులను ముందస్తుగానే మోడల్స్ చేత క్రితి సాధన చేయిస్తారు. షూట్ చేసేటప్పుడు నీటిలో భద్రతా పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని క్రితి చెప్పారు. అందులో వాడే ఎక్విప్ మెంటును ముందర పరీక్షించిన తర్వాతే నీటిలో షూట్ కు దిగుతారామె. నీటిలోపల షూట్ చేసేటప్పుడు అలసటగా అనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకునేలా ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండాలి కూడా. ఆ టైములో శ్వాస, రీహైడ్రేటింగ్ వంటివి మోడల్స్ తో పాటు ఫోటోగ్రాఫర్ కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. పైగా అండర్ వాటర్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఎంతో ఖరీదుతో కూడిన వర్కు మాత్రమే కాదు ఎంతో టైము పట్టే వ్యవహారం. బాగా అలసిపోతారు. దీనికి చాలా సాధన, ఓర్పు ఉండాలి అంటారు క్రితి.

క్రితి అండర్ వాటర్ ఫోటోల్లో కనిపించే అద్భుతమైన ఫ్లూయిడిటీ కదలికల వెనుక దశాబ్ద కాలం శిక్షణ, మరెన్నో సవాళ్లు, శ్రమ దాగున్నాయి. ఈ ఫోటోగ్రఫీలో అనుక్షణం ప్రమాదకర సవాళ్లు ఎదురవుతుంటాయి. అంతేకాదు నీటి అడుగున ఫ్యాషన్ ఫోటోగ్రఫీ క్రియేటివిటీని ఆవిష్కరించడం అంటే ఆ ఫోటోగ్రాఫర్లు సాంకేతికంగా, స్రుజనాత్మకంగా బెస్ట్ ఇవ్వగలిగిన వారై ఉండాలి. అందుకు బాగా ప్రిపేర్ అవాలి. ఈ లక్షణాలు క్రితిలో పుష్కలంగా ఉన్నాయి. క్రితికి 2018లో రేంజ్ ఫైండర్ పోర్ట్రైయిట్ అవార్డు వచ్చింది. రాల్ఫ్ లారెన్, ఫ్లైయింగ్ సోలో వంటి పెద్ద పెద్ద ఫ్యాషన్ హౌసుల్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఫ్యాషన్ మ్యాగజైన్లు, హెరిటేజ్ ప్లాట్ఫామ్స్, పలు ప్రఖ్యాత ఫ్యాషన్ హౌసులకు, డిజిటల్ మీడియా, రిటైల్ బ్రాండులకు కూడా క్రితి పనిచేశారు.

ప్రపంచంలోని పలు దేశాల సెలబ్రిటీలకు, యాక్టర్లకు, కళాకారులకు, ఫిలిమ్ మేకర్స్, రచయితలకు కూడా ఆమె పనిచేశారు. అండర్ వాటర్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీనే కాకుండా బ్యూటీ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, పోర్ట్రైయిట్స్, వీడియో ఎడిటింగ్ లలో కూడా క్రితిది అందెవేసిన చేయి. క్రితి ఫోటోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంతేకాదు మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కూడా చేశారు. ఫేషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ కోర్సు చేశారు. న్యూయార్కు స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ నుంచి ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు.

ప్రస్తుతం రెబెక్కా మింక్ ఆఫ్ అనే గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండుకు డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా సేవలందిస్తున్నారు. ప్రపంచంలోని పలు సంస్క్రుతులు, ఫ్యాషన్లు, సాహిత్యం, కళలు అడ్వంచర్ స్పోర్ట్స్ తెలుసుకోవడంలోనూ క్రితి ముందుంటారు. ఈ క్రియేటివ్ అండర్ వాటర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మన భారతీయురాలు కావడం మరింత గర్వకారణం…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News