న్యాయ వ్యవస్థ ద్వారా వెలువడుతున్న కొన్ని తీర్పులు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వ సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. మహిళల పట్ల రాజకీయంగా, సామాజికం ప్రస్ఫుటమవుతున్న వివక్షనే అవి కూడా ప్రతిబింబిస్తున్నాయి. తమ తీర్పుల ద్వారా, రూలింగులు, అభిప్రాయాల ద్వారా వివక్షను తగ్గించి సమానత్వాన్ని పెంపొందించవలసింది పోయి, మహిళలకు సంబంధించినంత వరకూ సమాజాన్ని తిరోగమన పంథాను పట్టిస్తున్నాయి. కోల్ కత్తా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును సుప్రీంకోర్టును కూడా నిర్ఘాంతపరచింది. ఈ తీర్సులోని ప్రతిపేరా వివక్షకు అనుకూలంగానూ, సమానత్వానికి వ్యతిరేకంగానూ ఉండడం చూసి సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి, హైకోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని చెడు కారణాలపై పతాక శీర్షికలకు ఎక్కింది. ఒక కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులో, ‘‘మహిళలు తమ లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంది. సమాజం దృష్టిలో చివరికి దెబ్బతినేది మహిళలే అన్న విషయం గుర్తుంచుకోవాలి. రెండు నిమిషాల శారీరక సుఖం కోసం ఇతరులకు లొంగిపోతే దెబ్బ తినేది మహిళలే’’ అంటూ వ్యాఖ్యానాలు చేసింది.
ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. న్యాయమూర్తి ఈ కేసులో తీర్పు ఇస్తూ, తన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బాలికలు లేదా మహిళల మీదే ఉందని స్పష్టం చేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకన్నా దారుణమైన తీర్పు మరొకటి ఉండదని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు తమ తీర్పులో వ్యక్తిగత అభిప్రాయాలను జొప్పించకూడదని, బోధనలు, ప్రవచనాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు సుతిమెత్తగా మందలించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 కింద యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు లభించిన హక్కులకు ఇది పూర్తిగా విరుద్ధమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక్క కోల్ కతా హైకోర్టు మాత్రమే ఇటువంటి తీర్పు ఇచ్చిందని అనుకోవడానికి, తేలికగా తీసుకోవడానికి అవకాశం లేదు.
దుస్తులను బట్టి తీర్సులు?
కేరళలోని కోళికోడ్ జిల్లా, సెషన్స్ జడ్జి గత 2022 ఆగస్టులో దాదాపు ఇదే విధమైన తీర్పు వెలువరించడం జరిగింది. తాను నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రధాన కారణం బాధిత యువతి ‘‘శరీరం కనిపించేటట్టు, రెచ్చగొట్టేటట్లు దుస్తులు ధరించడమే’’నని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిందితుడు ఒక రచయిత, సామాజిక ఉద్యమకర్త. అతను ఆ యువతిపై అత్యాచారం జరిపినట్టు కేసు నమోదై, విచారణ జరిగింది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్ మీద న్యాయమూర్తి స్పందించిన తీరు సమానత్వానికి వ్యతిరేకంగా ఉంది. దీనిపై రాష్ట్రంలోని మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్న ఆ నిందితుడు తన పిటిషన్ తో పాటు ఆ యువతి దుస్తులు ధరించిన తీరుకు సంబంధించిన ఫోటోలు కూడా జత చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఆ సెషన్స్ న్యాయమూర్తి తన తీర్పు నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించడం జరిగింది.
ఇక 2022 నవంబర్ లో కూడా ఇటువంటి సంఘటన మరొకటి జరిగింది. సుమారు 22 ఏళ్ల యువకుడు 15ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు బాంబే హైకోర్టు విచార ణకు వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇస్తూ, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడి ఉందని, ఆ బాలికకు పరిణామాలు, పర్యవసానాలు పూర్తిగా తెలిసే అతనితో సంబంధం ఏర్పరచుకుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, నిజానికి అతను కూడా చిన్నవాడేనని, ఆ యువతితో వ్యామోహంలో పడి ఇటువంటి అక్రమానికి ఒడిగట్టాడని కూడా ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. పోక్సో చట్టం కింద విచారణలో ఉన్న వ్యక్తిని విడుదల చేస్తూ బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు అటార్నీ జనరల్ 2021 నవంబర్ లో సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. వారి మధ్య లోతైన శారీరక సంబంధమేమీ ఏర్పడలేదంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును కొట్టివేస్తూ, లైంగిక భావనలతో ఒక వ్యక్తి ఆ బాలికను టచ్ చేయడం కూడా నేరమేనని వ్యాఖ్యానించింది.
ఆచితూచి నిర్ణయాలు
వైవాహిక అత్యాచారం విషయంలో ఢిల్లీ హైకోర్టు 2022 మే నెలలో ఒక తీర్పు ఇచ్చి ఇదే విధంగా సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైంది. వైవాహిక జీవితంలో చోటు చేసుకునే అత్యాచారాన్నిహైకోర్టు న్యాయమూర్తి కొట్టి వేయడం జరిగింది. భార్యకు భర్తతో లైంగికంగా సుఖపడడం ఇష్టం లేకపోయినా భర్త ఆమెతో సుఖపడడాన్ని అత్యాచారంగా పరిగణించకూడదు. ఇతరుల అత్యాచారంతో దీన్ని పోల్చకూడదు. ఈ రెండూ ఒకటి కాదు’’ అని న్యాయమూర్తి తీర్పు చెప్పడాన్ని ప్రాథమిక హక్కులకు భంగకరంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం మీద న్యాయమూర్తుల్లో కొందరు గత కాలం నాటి భావజాలంతో తమ తీర్పుల్లో వ్యక్తిగత అభిప్రాయాలను జొప్పిస్తున్న విషయం తేటతెల్లంఅ వుతూనే ఉంది. నిజానికి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ, సమానత్వాన్ని పెంపొదిస్తూ, ప్రాథమిక హక్కులను కాపాడవలసిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది.
అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు పదే పదే ఈ విషయాన్ని హైకోర్టులు, కింది కోర్టుల దృష్టికి తీసుకు వస్తూనే ఉన్నప్పటికీ, కొందరు న్యాయమూర్తులు తరచూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. అయితే, సుప్రీంకోర్టు ఈసారి కోల్ కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలే జారీ చేసింది. న్యాయమూర్తులు తమ భాష విషయంలోనూ, తాము చెబుతున్న కారణాల విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు ప్రకటించాల్సి ఉంటుందని, తమ వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ అవకాశం లేదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని అది ప్రత్యేకంగా రూలింగ్ ఇవ్వడం జరిగింది.
– వి. వెంకట రమణ, న్యాయవాది