Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Divide and rule: మోదీ తరహా ‘విభజించి పాలించు’

Divide and rule: మోదీ తరహా ‘విభజించి పాలించు’

మూడోసారి మేమే అంటున్న మోడీ

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే పద్ధతి ఇది కాదు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సహజ పద్ధతిలో అసాధారణంగా ప్రతిపక్ష కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయ సభల్లో గత వారం ఆయన ప్రసంగించిన తీరు ఆయనలోని దూకుడుకు అద్దం పడుతోంది. అవి రాజకీయ ఉపన్యాసాలు మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన తన హాస్య చతురతను, వక్తృత్వాన్ని, చమత్కారాన్ని, ఆవేశాన్ని, వ్యంగాన్ని జోడించి ప్రసంగించడం ఒక పద్ధతి ప్రకారం జరిగిపోయింది. ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టడంలో ఆయన ప్రదర్శించిన చాతుర్యం ఆ పార్టీని సైతం దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. ఆయన ప్రతి మాటా ఆచితూచి మాట్లాడారు. ఎన్నికల ప్రచారానికి తగ్గట్టుగా ఆయన తన ప్రసంగాన్ని ముందుగా సిద్ధం చేసుకున్నట్టు కనిపించింది. ఆయన ఎప్పటి మాదిరి గానే రామ మందిరం గురించి ప్రస్తావించారు. తాము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిపక్షాలను దుయ్యబట్టడం ప్రారంభించారు. ప్రతిపక్షాలు దాదాపు కుప్పకూలిన పరిస్థితిని ఆయన సభ్యుల కళ్లకు కట్టించారు.

- Advertisement -

మోదీ ప్రసంగమంతా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ చుట్టూనే పరిభ్రమించింది. కాంగ్రెస్ పార్టీ చిక్కి శల్యమవుతున్నప్పటికీ అదొక్కటే తమకు పోటీ ఇవ్వగలిగిన జాతీయ పార్టీ అనే విషయం ఆయనకు బాగా తెలుసు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాబోతోందని, కొన్ని రాష్ట్రాల్లో అది తమ ప్రత్యర్థులకు మిత్రపక్షమనే విషయం కూడా ఆయనకు తెలుసు. లేచి నిలబడడానికి కూడా అవస్థలు పడుతున్న ప్రతిపక్ష కూటమిని, దానిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేయడం, వీలైతే శాశ్వతంగా రూపుమాపడమే లక్ష్యంగా మోదీ తన ఎన్నికల వ్యూహాన్ని రూపొందించారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రశస్త్రాలన్నిటినీ బయటకు తీశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, కుటుంబ పాలన, అవినీతి, అభివృద్ధి లేమి వంటి అస్త్రాలన్నిటినీ సంధించారు. భారతీయులంటే నెహ్రూ, ఇందిరా గాంధీలకు చులకన అనీ, వారంటే చాలా తక్కువ అభిప్రాయం ఉండేదని విమ ర్శించారు. దేశాన్ని విభజించడానికి వీలైన పద్ధతులు, ప్రక్రియలన్నిటికీ వారు ఉపయోగించారని మోదీ ధ్వజమెత్తారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ‘రద్దు సంస్కృతి’నే అనుసరిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము చేసిన అభివృద్ధిని కూడా కాంగ్రెస్ రద్దు చేస్తుందని ఆయన అన్యాపదేశంగా హెచ్చరించారు. మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీని భూత కాల, బలహీన, అభివృద్ధి నిరోధక, సోమరి, ప్రతికూల పార్టీగానూ, తమ పార్టీని భవిష్య కాల, శక్తివంతమైన, చైతన్యవంతమైన, సానుకూల పార్టీగా అభివర్ణించడానికి ఆయన ప్రయత్నించారు.

తమ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన, పొత్తులతో మునిగి తేలుతున్న, సొంత సమస్యల పరిష్కారంలో నిమగ్నమైన ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ స్థాయిలో తమకు పోటీ ఎదురయ్యే అవకాశం లేదని మోదీ భావిస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో తమకు ఇందులో కొన్ని పార్టీల అవసరం ఉందని కూడా ఆయన అర్థం చేసుకున్నారు. అందుకనే, ఆయన తన వ్యాఖ్యలు, విమర్శలు, ఆగ్రహావేశాల నుంచి ఈ ప్రాంతీయ పార్టీలను మినహాయించారు. కాంగ్రెస్ పార్టీ మీదే ఎక్కువగా కారాలు, మిరియాలు నూరారు. ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ చుట్టూ తిరగకుండా ఆయన తన ప్రత్యేక శైలిలో ‘విభజించి, పాలించు’ సూత్రాన్ని అనుసరించారు. తాము మూడవ పర్యాయం కూడా అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాన్ని కూడా మోదీ అందించడం జరిగింది. మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చే పక్షంలో తాము చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన తెలియజేశారు. ప్రపంచంలో దేశం ఏ స్థాయిలో ఉందో తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు, ఎన్.డి.ఎకి 400 స్థానాలు రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మోదీ తన తొడ చరిచారు. ఈ సవాలును ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News