Tuesday, February 27, 2024
Homeఓపన్ పేజ్World pulses day: ఆరోగ్యకర సమాజ స్థాపనలో పోషకాహార పప్పు ధాన్యాలు

World pulses day: ఆరోగ్యకర సమాజ స్థాపనలో పోషకాహార పప్పు ధాన్యాలు

10 ఫిబ్రవరి ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం సందర్భంగా

అధిక ఫ్రోటీన్లను కలిగిన ఆహార పదార్థాల్లో పప్పు ధాన్యాలు ముఖ్యమైనవి. పప్పు ధాన్యాల ఆహారాన్ని తీసుకున్నపుడు కడుపు నిండిన భావన, త్వరగా ఆకలి వేయకపోవడం లాంటివి మన అనుభవంలోకి వస్తాయి. పప్పు కూరలు, పిండి వంటలు, ఆకుకూర పప్పు, ముద్ద పప్పు లాంటి వంటలు లేకుండా మన భోజనాలు పరిపూర్ణం కావడం లేదు. మనం తీసుకునే సాధారణ ఆహారంలో అత్యంత పోషక విలువలు కలిగిన పప్పు వంటలు తప్పనిసరిగా అవసరం అవుతున్నాయి. పది వేలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన పప్పు ధాన్యాల చరిత్ర మానవ, జంతు పోషకాహార జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. అందరికీ పోషకాహార భద్రత కల్పించడంలో పప్పు ధాన్యాల అవసరం వెలకట్టలేనిది.

- Advertisement -

ప్రపంచ పప్పు ధాన్యాల దినం-2024 నినాదం:
మానవాళి ఆరోగ్య పరిరక్షణతో పాటు నేల సారం పెంచడానికి పప్పు ధాన్య పంటలు (లెగ్యూమ్స్‌) అనాదిగా ఉపయోగపడుతున్నాయని మనకు తెలుసు. పోషకాహార లోపం, శారీరక పెరుగుదల ఆగిపోవడం, రక్తహీనత, వ్యాధుల వ్యాప్తి లాంటి ప్రతికూలతలను అధిగమించడానికి సరైన సమాధానంగా పప్పు ధాన్యాల వినియోగ ఉద్యమం రావలసిన సమయం ఆసన్నమైంది. ఆర్థిక, సామాజిక, పర్యావరణ పరిరక్షణలను దృష్టిలో పెట్టుకొని పప్పు ధాన్యాల పోషక విలువలు, పప్పు ధాన్యాల సాగు లాంటి అంశాలను సామాన్య ప్రపంచ మానవాళికి వివరించడానికి 2019 నుంచి ప్రతి ఏట 10 ఫిబ్రవరి రోజున “ప్రపంచ పప్పు ధాన్యాల దినం (వరల్డ్‌ పల్సెస్‌ డే)” నిర్వహించుకోవాలని ఐరాస సూచిస్తున్నది. పప్పు ధాన్యాల ప్రాధాన్యాన్ని ఏకరువు పెట్టడానికి 2016 సంవత్సరాన్ని “అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం”గా ఐరాస కూడా పాటించడం చూసాం. ప్రపంచ పప్పు ధాన్యాల దినం – 2024 నినాదంగా “నేల, మానవాళి పోషణలో పప్పు ధాన్యాలు (పల్సెస్‌ : నరిషింగ్‌ సాయిల్‌ అండ్‌ పీపుల్‌)” అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఐరాస అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల పప్పు ధాన్యాల దిగుబడులను 2050 నాటికి రెట్టింపు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కూడా ప్రణాళికలు వేస్తున్నది. ఆకలి, పేదరికం, ఆహార కొరతలను తగ్గించడానికి, సంపూర్ణ పోషకాహారం అందించడానికి పప్పు ధాన్యాల ప్రస్తావన తప్పనిసరిగా చర్చించవలసి వస్తున్నది.

పప్పు ధాన్యాల పోషక విలువలు:
భారత్‌లో పప్పు ధాన్యాలు లేని గృహాలు ఉండవు. కంది, పెసర, మినుము, శనగ, సోయా చిక్కుడు, అలసందలు లాంటి పప్పు ధాన్యాలు మన వంటల్లో విరివిగా కనిపిస్తాయి. పప్పు కూరలు, మొలకలు (స్రౌట్స్‌), చిరుధాన్యాలు కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. పలు రకాలైన పప్పు వంటలను విధిగా తీసుకోవాలి. పప్పు ధాన్యాల్లో మాంసకృత్తులు, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్‌ ఏ), ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు(ఫైబర్‌), ఆంటీ ఆక్సిడెంట్స్‌ మెండుగా ఉంటాయి. అదే విధంగా కొలెస్టరాల్‌, సంతృప్త కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. మధుమేహం/గుండెపోటు/పక్షవాతాలకు అడ్డుకట్ట వేయడం, జీర్ణ క్రియ మెరుగుపడడం, శక్తి విడుదల, రక్తనాళాలను శుద్ధి చేయడం, ఎముకల పటిష్టత పెరగడం, రోగనిరోధకశక్తి పెరగడం, క్యాన్సర్‌ నివారించబడడం, చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడం, వెన్నుపూసను బలోపేతం చేయడం లాంటి అనేక ప్రయోజనాలు పప్పు ధాన్యాలతో ఒనగూడుతాయి. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరి శారీరక పెరుగుదలకు అవసరమైన మాంసకృత్తులను పప్పు ధాన్యాలు మనకు అందిస్తున్నాయి. నిస్సారం అవుతున్న సాగు భూములను బలోపేతం చేయడంలో పప్పు ధాన్య పంటలు దోహదపడుతున్నాయి. గాలిలోని నత్రజనిని గ్రహించి నెలకు, మొక్కలకు అందించడంలో పప్పు ధాన్యాల పంటలు ఉపకరిస్తున్నాయి. పర్యావరణహిత సూక్ష్మజీవుల అభివృద్ధి, నేలను గుల్లగా మార్చడం, తేమను నిల్వ ఉంచడం, పోషకాలను మొక్కలు స్వీకరించే స్థితికి చేర్చడం, పప్పు పంటల ద్వారా పశుగ్రాసం అందడం, కలుపు తగ్గడం, నేల కోత అదుపు చేయబడడం లాంటి పలు ప్రయోజనాలు పప్పు ధాన్యాల సాగులో ఇమిడి ఉన్నాయి.
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 సాధనలో భాగంగా పోషకాహార భద్రత, ఆకలిపై పోరు, ప్రపంచ శాంతి, ఆరోగ్యకర సమాజ స్థాపన, పేదరిక నిర్మూలన లాంటి అంశాలకు ఏకైక మార్గంగా పప్పు ధాన్యాల వినియోగం దోహదపడుతున్నది. సుస్థిర వ్యవసాయం, చవకైన పోషకాహారం,శరీరంలో చక్కరల నియంత్రణ, ఆరోగ్యకర జీర్ణ వ్యవస్థ, సమతుల ఆహారం, రైతులకు సాగు ఆదాయం, పలు రకాల పిండి వంటలు/కూరలు/సూపులు/బియ్యంతో కలిపిన వంటలు/ఆకు కూరలతో వంటలు/స్నాక్స్‌ లాంటి బహుముఖీల ప్రయోజనాలు కలిగిన పప్పులను మన నిత్య భోజనంలో భాగం చేసుకుందాం, ప్రజారోగ్యానికి పట్టం కడదాం.

     డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
              9949700037
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News