ఒక్క ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న పురస్కారాలను ప్రకటించి ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యతను గుర్తుచేసుకుంది. విభిన్న రంగాల్లో మహోన్నత సేవలందించిన మహనీయులకు ఇచ్చే అత్యుతన్నత పురస్కారాలు కొందరికి సకాలంలో అందినా మరికొందరికి ఆలశ్యంగా అయినా అందిందనే చెప్పాలి. లోహపురుష్, బిజెపి వ్యవస్థాపకుల్లో ఒకరయిన లాల్ కృష్ణ అధ్వానితో పాటు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాంతం కృషిచేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూరుకు తొలివిడతగా పురస్కారాలు ప్రకటించిన కేంద్రం తాజాగా మరో ముగ్గురు మహనీయులకు ప్రకటించింది. వారే సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆహారోత్పత్తుల్లో స్వయం సమృద్దికి కృషిచేసిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ మరొకరు కాగా కర్షకపక్షపాతిగా ఎనలేని సేవలందించిన ఐదో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ లను అత్యున్నత పురస్కారాల తో గౌరవించింది. వ్యవసాయ రంగ సంస్కరణలపై ధీరోదాత్తుడిగా పోరాడిన లోక్ దళ్ నేతగా చరణ్ సింగ్ పేరు పొందారు.
ఆపద్దర్మ ప్రధానిగా కూడా తనదైన ముద్రవేసుకుని తనజీవితాన్ని భావితరానికి స్ఫూర్తిగా నిలిపారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి హరిత విప్లవానికి ఆద్యునిగా గణుతికెక్కిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. బెంగాల్ కరువును కళ్లారా చూసి ‘చలించిపోయిన ఆయన ఆకలినుంచి దేశాన్ని రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో వైద్యరంగం నుంచి వ్యవసాయ పరిశోధ నలవైపు తనదృష్టిని మళ్లించి ఆహారధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో అవిరళ కృషిచేసిన శాస్త్రజ్ఞుడు. ఆహార ఉత్పత్తుల్లో స్వయసమృద్ధిని భారత్ సాధించేం దుకు విశేష కృషిచేసిన విజ్ఞానవేత్త స్వామినాధన్. వివిధరరంగాల్లో సమున్నతసేవలందించిన వీరికి అత్యు న్నత పురస్కారంతో గౌరవించుకోవడం మన పాలకుల ప్రధాన బాధ్యత కర్తవ్యం కూడా. వీరందరిలోను మనకు పీవీ చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయనే చెప్పాలి. సంక్షోభం ఊబిలో కూరుకుపోతున్న భారతావనికి కొత్త రెక్కలు తొడిగి సంస్కరణల శర వేగంగా అమలుచేసి ప్రపంచ వ్యాప్తంగా భారత కీర్తిప తాకను ఎగురవేసిన వ్యక్తికి ఆలశ్యంగా అయినా భారత ప్రభుత్వం స్పందించింది. మహోన్నత రాజకీయ కోవిదుడికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించి తన గౌరవాన్ని ఇప్పటికయినా చాటుకుంది.
వాస్తవానికి ఏనాడో రావాల్సిన భారతరత్న పివి నరసింహారావుకు ఆలశ్యంగానే అందిందని చెప్పాలి. అంతర్గత భద్రతనుంచి ఆర్థికరంగం, భారత విదేశాంగ విధానం వరకూ అన్నింటిపైనా తనదైన ముద్రవేసిన తెలుగు బిడ్డ రాజకీయ కోవిదుడు, సాహిత్యాభిమాని, బహుముఖ ప్రజ్ఞాకోవిదుడుగా పీవీ గణుతికెక్కిన సంగతి తెలియనిది కాదు. ప్రధాని పదవిని చేపట్టిన తొలి దక్షిణాది ఏకైక తెలుగు వ్యక్తిగా నరసింహారావు ఘనతను సాధించారు. నెహ్రూ గాంధీయేతర నేతగా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి అందులోనూ తెలంగాణకు చెందిన మహనీయుడు పీవి కావడం విశేషం.దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసిన వ్యక్తి మన పీవీ. ప్రపంచంలోనే అత్యంత అప్పులున్న మూడో దేశంగా నిలిచిన భారత్ ను ఆదుకునేందుకు ఆసమయంలో ప్రధాని అయిన పీవీ నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ ను తోడుగా చేసుకుని సంస్కరణలను పరుగులుపెట్టించారు. లైసెన్స్ రాజ్ ను బ్రేకిచేసి విశ్వవిపణికి భారత్ ను అను సంధానం చేసారు. 92నాటికి ఆర్థికసంక్షోభం అదుపుచేసి తాను పదవినుంచి దిగిపోయేనాటికి జిడిపి వృద్ధిని 7.6 శాతానికి చేర్చిన ఆర్థికరంగ నిపుణుడు పీవి అని చెప్పు కోవాల్సిందే. సంస్కరణల దార్శనికత, ధైర్యం పీవి చూపించడం వల్లనే భారత్ ఒడ్డునపడిందని అప్పటి విదేశీ రంగ నిపుణులు సైతం అంగీకరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టేనాటికి భారత స్థూల దేశీయోత్పత్తి విలువ 26వేల కోట్ల డాలర్లు అయితే 2021నాటికి సుమారు మూడు లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.
యుపిఎ పాలనలో అమలుకు వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకానికి రూపశిల్పి మన పీవీ వల్లనే పదేళ్ల తర్వాత అయినా ఆ పథకం అమలుకు వచ్చింది. విదేశాంగ విధానం లో తూర్పువైపుచూపు విధానానికి మన పీవీయే ప్రాణం పోసారు. అంతర్గత భద్రతకు పెనుసవాళ్లు ఎదురవుతున్న తరుణంలో జమ్ముకాశ్మీర్ లో శాంతిభద్రతలు, ఈశాన్య రాష్ట్రాల్లో సామరస్య వాతావరణానికి పీవీ విశేష కృషి చేసారని నిస్సందేహంగా చెప్పాలి. సంస్కరణలతో భారత్ అభివృద్ధిని పరుగులు పెట్టించినా తర్వాత వచ్చిన ఎన్నికల్లో పరాజయం చూసి విదేశాలు సైతం విస్తుపోయాయి. పీవీ వల్ల జరిగిన మేలును భారత ఓటర్లు విస్మరించారని విదేశీ దౌత్యనిపుణులు సైతం ఆనాడు చేసిన వ్యాఖ్యలు పీవీ దౌత్యనీతికి నిదర్శనంగా నిలుస్తాయి. పదవినుంచి దిగి పోయిన తర్వాత వెంటాడిన కేసుల్లో తన తరపు వాదించిన న్యాయవాదులకు చెల్లించేందుకు తనసొంత ఇంటిని సైతం అమ్మకానికి పెట్టి చిత్తశుద్ధి, నిజాయితీని నిరూపించుకున్నారు.
మహానుభావులు ఎందరో చెప్పినట్లు రాజకీయ వ్యవస్థకన్నా దేశం గొప్పదని విశ్వసించే దేశభక్తుడయిన రాజకీయ వేత్త పీవీ మనవాడు కావడం మనకెంతో గర్వకారణం. అటు ఆర్థికవ్యవస్థను చక్కదిద్దిన నిపుణుడిగాను, ఎలాంటి సవాళ్లను అయినా సరే ఎదురొడ్డి నిలబడి సుస్థిర ప్రభుత్వాన్ని నడిపించిన మహనీయుడిగా పీవీ పేరు చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. భారతప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’కు పీవీ అర్హుడని చెప్పడంకంటే పీవీకి భారతరత్న ప్రధానంతో ఆ పురస్కారానికే గౌరవం వచ్చిందని భావించాలి.
సభావట్.కళ్యాణ్
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
90143 22572