Tuesday, February 27, 2024
Homeఓపన్ పేజ్Modi hattrick: హ్యాట్రిక్ ధీమాతో నరేంద్ర మోడీ

Modi hattrick: హ్యాట్రిక్ ధీమాతో నరేంద్ర మోడీ

మోడీ 3.0

లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతామన్న ధీమా ప్రధాని నరేంద్ర మోడీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నరేంద్ర మోడీలో ఈ ధీమా రావడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది అయోధ్య రామమందిర అంశం. అలాగే ఇండియా కూటమిలో విభేదాలు కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే. లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీని ఢీ కొట్టడానికి మొత్తం 28బీజేపీయేతర పార్టీలు కలిసి పెట్టుకున్న ఇండియా కూటమి పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పెత్తందారీ పోకడలే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికతో సన్నద్ధమవుతోంది. ఈసారి 400 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది కమలం పార్టీ. ఇందులో భాగంగా కొత్తమిత్రుల కోసం అన్వేషణలో పడింది. 2019 తరువాత ఎన్డీయే కూటమి నుంచి అనేక రాజకీయ పార్టీలు వైదొలగాయి. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తమిళనాడులో అన్నా డీఎంకే సహా మరికొన్ని పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. బీజేపీ ఈసారి 400 సీట్లు టార్గెట్ పెట్టుకోవడంతో మిత్రపక్షాల సాయం అవసరమైంది. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అన్ని చోట్లా కమలం పార్టీ హవా ఉండదు. అంతేకాదు నరేంద్రుడి జనాకర్షణ శక్తి కూడా పనిచేయదు. దీంతో మిత్రపక్షాల అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. తాజాగా కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా కూడా ఇదే విషయం వెల్లడించారు. ఈ సంగతి ఎలాగున్నా, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతామన్న ధీమా ప్రధాని నరేంద్ర మోడీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నరేంద్ర మోడీలో ఈ ధీమా రావడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది అయోధ్య రామమందిర అంశం.
జాతీయ రాజకీయాల్లో జనాకర్షణ విషయంలో ఇప్పటికీ నెంబర్ వన్ ప్రధాని నరేంద్ర మోడీయే. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయం అంగీకరించాల్సిందే. అయితే అయోధ్య రామమందిర అంశంతో సామాన్య ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ మరింతగా పెరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఐదు వందల ఏళ్ల నుంచి వినిపిస్తున్న హిందువుల డిమాండ్. శ్రీరామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్యలో ఆయనకు అత్యంత సుందరంగా ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల కల. చివరకు నరేంద్ర మోడీ హయాంలో శతాబ్దాల కల సాకారమైంది. రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల లోపే బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి నరేంద్రుడు రికార్డు సృష్టించారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఆకాశాన్ని తాకింది.

ప్రశ్నార్థకంగా ఇండియా కూటమి !
లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీని ఢీ కొట్టడానికి మొత్తం 28బీజేపీయేతర పార్టీలు కలిసి పెట్టుకున్న ఇండియా కూటమి పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీ ( యూ ) అధినేత నితీశ్‌ కుమార్ ఇటీవల ప్లేటు ఫిరాయించారు. ఇండియా అలయన్స్‌ నుంచి నితీశ్ కుమార్ బయటకు వెళ్లారు. బీహార్‌లోని మహాఘట్‌బంధన్ నుంచి జేడీ ( యూ ) వైదొలగింది. బీజేపీ సాయంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. నితీశ్‌ కుమార్ సంగతి ఇలా ఉంటే, ఇండియా కూటమిలో గొడవలు ఇటీవల బయటపడుతున్నాయి. ఇండియా కూటమికి
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్‌, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ వరకు కాంగ్రెస్‌తో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోదని మమత కుండబద్దలు కొట్టారు. లోక్‌సభ ఎన్నికలు తరుముకువస్తున్న తరుణంలో మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం బీజేపీయేతర పార్టీలకు షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి తాను చేసిన ప్రతిపాదనపై కనీసం చర్చించడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపలేదన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో తాము ఒంటరిపోరుకు సిద్దమైనట్లు మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

ఒంటరిపోరుకు టీఎంసీ, ఆప్‌ సిద్ధం !
ఇండియా కూటమిలో ఇన్నాళ్లూ అంతర్గతంగా ఉన్న విభేదాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. కూటమిలోని ప్రముఖ నాయకులు ఒక్కొక్కొరుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ చీఫ్‌, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల శిబిరమైన ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ వరకు కాంగ్రెస్‌తో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోదని మమత తేల్చి చెప్పారు. మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటన, జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. కాంగ్రెస్‌తో పొత్తు వద్దు అనుకోవడానికి దారితీసిన పరిస్థితులను మమతా బెనర్జీ వివరించారు. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ హోదాలో కాంగ్రెస్ కు తాను చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తోసిపుచ్చిందన్నారు. కనీసం ప్రతిపాదనపై చర్చించడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపలేదన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో స్వంత బలంమీదే పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్‌ మమతా బెనర్జీ వివరణ ఇచ్చారు.
మరోవైపు కాంగ్రెస్‌కు దూరమైన మిత్రపక్షాల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌వరకు ఒంటరిగా పోటీ చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము ఎటువంటి పొత్తు పెట్టుకోవడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 నియోజకవర్గాల్లోనూ ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని భగవంత్ మాన్ తేల్చి చెప్పారు. వాస్తవానికి ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆది నుంచి మంచి సంబంధాలు లేవు. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య గతంలో హోరాహోరీ పోరు నడిచిన సంగతి తెలిసిందే. హస్తినలో బలపడటానికి ఒకవైపు బీజేపీ పెద్దలతోనూ మరో వైపు కాంగ్రెస్ సీనియర్లతోనూ కేజ్రీవాల్ పోరాటం చేశారు. ఇదిలా ఉంటే, ఇండియా అలయన్స్‌లోని మరో భాగస్వామ్యపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్‌కు దూరమయ్యిందనే సంకేతాలు అందుతున్నాయి. దీనికి కారణం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడా పోటీ చేసింది. అయితే పొత్తులో భాగంగా తమకు కొన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ కోరినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగింది. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ- రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తు ఖరారు అయిందన్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌధురి నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్ ఇప్పటివరకు బీజేపీకి దూరంగానే ఉంది. చరణ్ సింగ్‌కు తాజాగా భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీయే కూటమిలోకి రాష్ట్రీయ లోక్‌దళ్ ప్రవేశిస్తుందన్న ఊహాగానాలు లక్నో రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని రైతాంగంపై రాష్ట్రీయ లోక్‌దళ్ ప్రభావం ఉంటుంది.

భారతరత్నాల ప్రకటనలోనూ రాజకీయ కోణం ?
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్న పురస్కారానికి ఎంపికైన ఐదుగురు తమతమ రంగాల్లో లబ్దప్రతిష్టులు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నకు కర్పూరీ ఠాకూర్, లాల్‌కృష్ణ అద్వానీ, పీవీ నరసింహారావు, చౌధురి చరణ్ సింగ్, ఎమ్మెస్ విశ్వనాథన్ అందరూ అర్హులే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయమే లేదు. అయితే భారతరత్న పురస్కారాలను కూడా కమలం పార్టీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాలు గెలుచుకుంది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లను కమలం పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఒకవైపు అయోధ్య అంశం మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ ఇంకోవైపు ఇండియా కూటమి బలహీనపడటం….వీటన్నిటిపై కమలం పార్టీ అనేక ఆశలు పెట్టుకుంది.

            -ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News