Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుBhupalapalli: వన్యప్రాణుల మాంసం@కేజీ 500/-

Bhupalapalli: వన్యప్రాణుల మాంసం@కేజీ 500/-

సాక్షాలు దొరక్కుండా వేటగాళ్ల..

పక్షుల కిలకిల రాగాలు.. వయ్యారంగా వంపులు తిరుగుతూ గలగల పారే సెలయేళ్ళు..వాటి నడుమ పచ్చని దట్టమైన అడవుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూన్న జింకలు, దుప్పులు, మెకాలు కొండగొర్రెలు ప్రకృతి శోభకే వన్నెతెస్తుంటాయి. చంగు చంగున ఎగురుతూ, అడవితల్లికి అత్యంత శోభను, అందాన్ని, చూపరులకు సైతం ఆనందాన్ని తెచ్చిపెట్టే వన్య ప్రాణి సంపద, దినదినం వేటగాళ్ల ధన దాహానికి, అధికారుల అలసత్వానికి తమ ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. వన్యప్రాణి సంరక్షణ కోసం 1972 ఆగస్టు 7న తెచ్చిన చట్టం కాకితాలకే పరిమితమైంది. ఫలితంగా అటవీ సంపదకు నిలయాలుగా అరుదైన పశు పక్షాదులు, వివిధ రకాలైన జంతువులు, వన్యప్రాణులకు నిలయమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అడవుల్లో ప్రస్తుతం నిరంతరం వన్యప్రాణుల మృత్యు ఘోష వినపడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు ఒకరోజు ముందు కాటారం మండలం నస్తురుపల్లి అటవీ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లలో భాగంగా గాలింపు చర్యలు చేపడుతున్న కానిస్టేబుల్ ఒకరు వన్య ప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు బలై చనిపోయిన విషయం వేటగాళ్ల వికృత చేష్టలకు అద్దం పడుతుంది. జిల్లా అడవులు మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాలకు ఆనుకొని దట్టంగా విస్తారంగా అలుముకుని ఉన్నా కారణంగా వన్య ప్రాణుల సంతతి ఎక్కువగానే ఉంటుంది. దీంతో వేటగాళ్లు అడవుల్లో నిరంతరం వన్యప్రాణుల వేట కొనసాగిస్తున్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. అడవులనే భద్రతగా భావించి అడవులనే ఆవాసాలుగా మలుచుకుని జీవిస్తున్న మూగజీవాలకు వేటగాళ్లు సవాల్ గా మారారు. అన్యం పుణ్యం ఎరుగని వన్యప్రాణులు ప్రకృతి ప్రసాదించిన పచ్చని గడ్డిని ఆహారంగా తీసుకొని తన జీవనం కొన సాగిస్తుంటాయి. దట్టమైన అడవుల్లో చెంగు చెంగున ఎగురుకుంటూ సహజత్వంగా జీవించే వన్య ప్రాణులపై వేటగాళ్ల కన్ను పడుతోంది. ఫలితంగా వేటగాళ్లు వన్యప్రాణి సంపదను అనునిత్యం కొల్లగొడుతున్నారు.

- Advertisement -

వేటగాళ్లు నిత్యం ప్రధానంగా మూడు పద్ధతులతో వన్య ప్రాణులను కిరాతకంగా హతమర్చి పచ్చి మాంసం పట్ట పగలు విక్రయించి వేటగాళ్లు తమ ధన దాహాన్ని తీర్చుకుంటున్నారు.వేటగాళ్లు విద్యుత్ తీగల అమర్చి వన్య ప్రాణులను హతమార్చడం ఒక విధానం అయితే, మరో విధానంలో దట్టమైన అడవుల్లో బ్యాటరీ లైట్లు వేసి ఆ బ్యాటరీ లైట్ వెలుతురులను చూస్తూ తమను తామే మరిచి నిలిచి ఉన్న వన్యప్రాణులను వెనక భాగము నుండి వెళ్లి బర్షలతో పొడిచి చంపడం మరో విధానం. ఇక మూడో విధానం వన్యప్రాణులు నీటి వాసన పసిగట్టి దాహం తీర్చుకోవడానికి వచ్చే ప్రాంతాలను ఎంచుకొని ఆ ప్రాంతాల్లో ఉర్లను అమర్చి ఉర్లతో హత మారుస్తుంటారు. ఈ మూడు విధానాలు వన్యప్రాణి సంపద పెరుగుదలకు సవాలుగా నిలిచి అభం శుభం తెలియని మన్యప్రాణుల మృత్యువాతకు బలవుతున్నాయి. వేటగాళ్ల వికృత చేష్టలకు మూగజీవాలు విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి. వన్యప్రాణులను వేటాడం నేరమని తెలిసిన వేటగాళ్లు చట్టాలకు విరవకుండా అక్రమార్జనకు ఆశపడి వన్య ప్రాణులను హతమార్చడమే వృత్తిగా పెట్టుకుంటున్నారు. ఈ విషయంలో నేరం రుజువైతే మాత్రం కఠిన శిక్షలు పడతాయి. వన్యప్రాణులు ప్రజలకు నేస్తాలు. వాటితో ఎలాంటి నష్టం వాటిల్లదుకూడా, వాటి రక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలను అమలుచేస్తోంది. అయినప్పటికీ, ఎలాంటి సాక్షాలు దొరకకుండా వేటగాళ్లు యదేచ్చగా వన్యప్రాణులను హతమార్చి సొమ్ము చేసుకుంటున్నారు. కిలోపు ఐదు వందలకు కు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణి సంరక్షణ కోసం 1972 ఆగస్టు 7న తెచ్చిన చట్టం కాగితాలకే పరిమితమైందన్న ఆరోపణలు వినబడుతున్నాయి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News