సాహిత్యానికి సంబంధించినంత వరకూ అపర సవ్యసాచి పురిపండ అప్పలస్వామి. విజయనగరం జిల్లా సాలూరులో 1904 నవంబర్ 13న జన్మించిన పురిపండ అప్పలస్వామి సాహిత్యంలో పండించని ప్రయోగం లేదు. చేయని పరిశోధన లేదు. అనేక భాషలను అనర్గళంగా మాట్లాడడంతో పాటు, అనేక సాహితీ అంశాలను అలవోకగా పండించిన అపూర్వ, అద్వితీయ సాహితీవేత్త పురిపండ. ఆయన బహుభాషావేత్త, పత్రికా రచయిత, పత్రికా సంపాదకుడు, అనువాదకుడు, రచయిత. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మరుక్షణం నుంచి ఆయన సాహితీ తీర్థాన్ని ఔపోశన పట్టడం ప్రారంభించారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో చేయి తిరిగిన రచయితగా ప్రసిద్ధి చెందడమే కాకుండా, బెంగాలీ, ఒరియా, హిందీ భాషలను కూడా పూర్తి స్థాయిలో ఒంటబట్టించుకున్నారు. పరాయి భాషల్లో కూడా సాహిత్యాన్ని మదింపు చేయడం ఆ కాలంలో ఆయనకే చెల్లింది. ఆయన అతి తక్కువ కాలంలోనే సాటి లేని మేటి సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నారు.
ఒక పక్క రచయితగా పఠనాలు, పరిశోధనలు, ప్రయోగాల్లో మునిగి తేలుతూనే మరోపక్క స్వాతంత్య్ర పోరాటంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు, హరిజనోద్ధరణ, ఖాదీ ప్రచారోద్యమాల్లో కూడా దూసుకుపోయారు. కల ప్రయోగంలోనే కాక, కరవాల ప్రయోగంలోనూ సాటి లేని మేటినని నిరూపించుకున్నారు. విశాఖపట్నంలో అఖిల భారత చరక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్ర పోరాటం అనేసరికి ఆయన పత్రికా రచనను కూడా ఒక అస్త్రంగా చేసుకున్నారు. జర్నలిజం ద్వారా కూడా ఆయన స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించారు. ‘స్వశక్తి’ అనే జాతీయ దినపత్రికకు ఆయన సహ సంపాదకుడుగా వ్యవహరించారు. ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఆయన ఆంధ్ర పత్రిక దినపత్రికకు 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా వ్యాసాలు రాశారు. ఇందులో ఎక్కువ భాగం దేశ భక్తిని ప్రేరేపించేవి, స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చేవే.
ఆ తర్వాత ఆయన ‘సత్యవాణి’ పేరుతో ఒక మేగజైన్ ను కూడా నిర్వహించారు. ఇందులో అనేక పరిశోధనాత్మక వ్యాసాలతో పాటు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన వ్యాసాలు కూడా రాసేవారు. ఒకపక్క దీన్ని నిర్వహిస్తూనే మరొక పక్క ‘వైశాఖి’ పేరుతో ఒక మాస పత్రికను కూడా నిర్వహించారు. ఇది ఆ తరువాతి కాలంలో సాహితీవేత్తలకు, సాహిత్య అభిమానులకు ఒక రిఫరెన్స్ గా కూడా ఉపయోగపడింది. అప్పట్లో దీన్ని చదవని సాహితీవేత్త లేరంటే అందులో అతిశయోక్తేమీ లేదు. మహాకవి శ్రీశ్రీలోని ప్రతిభా పాటవాలను గుర్తించి, ఆయనను వెలుగులోకి తీసుకు వచ్చిన వారిలో ఆయన అగ్రభాగాన ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించిన వారిలో కూడా పురిపండ ముందు వరుసలో ఉంటారు. శ్రీరామవరం, పార్వతీపురంలలో ఆయన గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. మరకం అనే చిన్న గ్రామంలో కూడా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజలందరితోనూ పుస్తకాలు చదివించేవారు. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సొసైటీలో ఆయన శాశ్వత సభ్యుడుగా ఉండేవారు.
ఆయన విశాఖ రచయితల సంఘానికి అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీల్లో సభ్యుడు. భారతీయ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1973లో ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి గౌరవించింది. విశాఖ పట్నం బీచ్ రోడ్డులో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ద్వానా శాస్త్రి, బండి సత్య నారాయణ కలిసి ఆయన జీవిత కథను రాశారు. ఆయన తెలుగులో రాసిన మహాభారతం, శ్రీదేవి భాగవతం, శ్రీమద్భాగవతం, వాల్మీకి రామాయణం, ఒరియా సాహిత్య చరిత్ర, హిస్టరీ ఆఫ్ బెంగాలీ లిటరేచర్, రత్నపతకం, మహమ్మద్ చరిత్ర, సౌదామిని, ఒరియా సాంగ్స్, జగద్గురు శంకరాచార్య, విశ్వ కళా వీధి, హంగరీ విప్లవం వంటివి సాహితీవనంలో కొన్ని ముఖ్యమైన తులసి మొక్కలు. ఇంకా ఆయన అనేక అనువాధ గ్రంథాలను కూడా రాయడం జరిగింది. 1982లో ఆయన కాలధర్మం చెందారు.