ఇక్కడ కనిపిస్తున్న యువతి పేరు ప్రియా విజన్. పాతిక సంవత్సరాల ప్రియా చిన్నతనం నుంచీ రకరకాల ఎలర్జీలతో, సైనసైటిస్, మైగ్రేన్, ఛాతీ నొప్పి, జలుబు, జీర్ణసంబంధమైన సమస్యలతో బాధపడుతుండేది. చివరకు సహజసిద్ధమైన ప్లాంట్ బేస్డ్ డైట్ ఆమె ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టింది. అదే ఆమెను హెల్త్ ఎంటర్ ప్రెన్యూర్ గా, యాక్టివస్టుగా మార్చింది. అదెలాగంటే..
ప్రియా బెంగళూరులో ఉంటోంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె పలు ఈవెంట్ ప్రొడక్షన్ కంపెనీల్లో కొంతకాలం పనిచేసింది. కానీ ఆ పని ఆమె మనసుకు నచ్చలేదు. 2011 లో ఆ ఉద్యోగం వదిలేసింది. తర్వాత స్నేహితురాలి సలహాతో 2012 లో ‘మెల్ట్ ఇట్ డౌన్’ పేరుతో ఇంటి నుంచి బేకింగ్ బిజినెస్ కు శ్రీకారం చుట్టింది. అందులో ఎంతో నైపుణ్యం సాధించింది. సంవత్సరంలోపే ఆమెకు బయట నుంచి ఆర్డర్లు రావడం ప్రారంభమైంది. 2019లో తన బిజినెస్ కు బ్రేక్ ఇచ్చి న్యూట్రిషన్ కోర్సు చేసింది. అక్కడే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ యొక్క ప్రాధాన్యాన్ని ప్రియ తెలుసుకుంది. యానిమల్ ఉత్పత్తులు ముఖ్యంగా డయిరీ ఉత్పత్తుల వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి తెలుసుకుంది. ఆహారం నాలుక రుచిని సంత్రుప్తి పరిచేది మాత్రమే కాదనే సత్యం ఆమెకు బోధపడింది. తినే ఆహారం పోషకాల నిధిగా ఉండాలని అర్థం చేసుకుంది. దాదాపు పది సంవత్సరాలుగా తాను నిరంతరాయంగా, మైగ్రైన్, సైనసైటిస్, జీర్ణవ్యవస్థ సమస్యలు, కడుపునొప్పి, ఇంకా రకరకాల ఎలర్జీల బారిన పడడానికి మూల కారణాలను గ్రహించింది. న్యూట్రిషన్ కోర్సు చేసిన తర్వాత నుంచి డయిరీ ఉత్పత్తుల వినియోగాన్ని ఆపేసింది. ప్లాంట్ ఆధారిత డైట్ పై ద్రుష్టిపెట్టింది.
పంజాబీ కుటుంబానికి చెందిన ప్రియ ఆహారంలో డయిరీ ఉత్పత్తుల వాడకం సర్వసాధారణం. అయితే న్యూట్రిషన్ కోర్సు చేసిన తర్వాత 21 రోజుల పాటు తన ఆహార విహారాదులను పూర్తిగా మార్చే డైట్ ను ప్రయోగాత్మకంగా తీసుకోవడం ప్రారంభించింది. దాంతో గతంలో ఆమెకు ఉన్న పలు అనారోగ్య సమస్యలు తగ్గాయి. దీంతో ఇంతవరకూ తను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు ఇకపై మందులతో పనిలేదనే సత్యాన్ని ప్రియ అనుభవపూర్వకంగా గ్రహించింది. అంతటితో ప్రియ ఊరుకోలేదు. తన ఈ ప్రయోగ ఫలితాల్లోని సత్యాసత్యాలను మరింత స్పష్టంగా తెలుసుకోగోరిన ప్రియ మళ్లా కొన్ని రోజుల పాటు డయిరీ ఉత్పత్తులతో కూడిన ఆహారాన్ని తీసుకుంది. జీర్ణవ్యవస్థ పరంగా పలు సమస్యలు తిరిగి ప్రియకు తలెత్తాయి. ఆమెకు మళ్లా మందుల వాడకం తప్పలేదు. ఈ అనుభవంతో తనకు డయిరీ ఉత్పత్తులు పడవనే సత్యాన్ని ప్రియ గ్రహించింది.
యానిమల్ ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల నుంచి బయటపడడానికి ప్రియకు ఆరు నెలలపైనే పట్టింది. వెన్నతో నిండిన పరాటాలు, పన్నీరు వదిలేసింది. వాటికి బదులు ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు పండ్లు వంటివి తినడం మొదలెట్టింది. గతంలో రెండు మూడు రకాల దాల్ ఐటమ్స్ ప్రియ ఫుడ్ లో ఉండేవి. ఇప్పుడు ఆమె ఆహారంలో పదిహేను రకాల గింజలు, ఆహారధాన్యాలు ఉంటున్నాయి. ఆమె తీసుకునే డైట్ లో మిల్లెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫుడ్ ఎంపిక ప్రియకు అంత సులభంగా ఏమీ జరగలేదు. ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రయత్నంలో చివరకు తనకు సరిపడే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోగలిగింది ప్రియ. ‘ ఈ ఆహారంతో బహిష్టు సమయంలో నొప్పికి మందులు వాడాల్సిన అవసరం నాకు తలెత్త లేదు. మైగ్రేన్, ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గాయి. రక్తంలో హిమోగ్లోబిన్ ప్రమాణం పెరిగింది’ అని ప్రియ అంటుంది. ప్లాంట్ ఆధారిత ఫుడ్ మనం ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని స్వానుభవంతో చెబుతున్నానంటుంది ప్రియ.
ప్లాంట్ ఆధారిత ఫుడ్ లో కాయగూరలు, సాధారణ పదార్థాలు మాత్రమే ఉంటాయి. యానిమల్ ఫుడ్ లో లేని పీచుపదార్థాలు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో పుష్కలంగా ఉంటాయని ప్రియ అంటుంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులతో పాటు మధుమేహం, ఊబకాయం, రక్తపోటు వంటి జీవనశైలి జబ్బుల బారిన పడకుండా సంరక్షించుకోగలమంటుంది ప్రియ. ఇంకా తన ఎంతో సింపుల్.. ఆరోగ్యవంతమైన ప్లాంట్ బేస్డ్ రెసిపీలతో మాస్టర్ చెఫ్ ఇండియాలో ప్రియ ప్రత్యేక స్థానం పొందింది. ప్లాంట్ ఆధారిత ఫుడ్, ఫిట్ నెస్, హెల్త్ విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉన్న ప్రియ ఈ మూడింటి వల్లే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారంటుంది. జంక్ ఫుడ్ మనిషి ఆరోగ్యానికి చేసే హాని అంతా ఇంతా కాదని ప్రియ అంటుంది. తన ఫుడ్ ప్రయోగాల అనుభవాన్ని, ఆరోగ్యకరమైన ప్లాంట్ బేస్డ్ ఆహారం గురించి గ్లోబల్ గా తెలియజేసే ఉద్దేశంతోనే మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొన్నానంటుంది. సీజన్ 7 మాస్టర్ చెఫ్ ఇండియా పోటీలో పాల్గొన్న ఒకే ఒక వేగాన్ కంటెస్టెంట్ ప్రియ. తను చేసే ప్రతి రెసిపీలోనూ ప్లాంట్ బేస్డ్ పదార్థాలు తప్పనిసరిగా ఉంటాయి.
మాంసం, బటర్ లతో చేసే గలూటీని వేగాన్ మఖానీతో అద్భుతంగా చేసి మాస్టర్ చెఫ్ ఇండియా పోటీలో జడ్జీలను మెప్పించింది. అలా వేగాన్ ఫుడ్ రుచిగా ఉండదనే దురభిప్రాయాన్ని పోగొట్టింది కూడా. ఈ పోటీలో కాశ్మీరీ పులావ్, వంకాయతో చేసిన సుఖ వాంగన్ రెసిపీలను వాల్నట్, కిస్మిస్ చట్నీతో జడ్జీలకు రుచి చూపించి వారి మనసును దోచుకుంది. ప్రియ రకరకాల ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మీద ప్రయోగాలు చేసింది. వాటిపై ఎంతో అధ్యయనం చేసింది. అందులోని ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలను శోధించింది. ఆ తర్వాత తన ప్రయోగ ఫలితాలను, అనుభవాలను వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలిపే పనికి పూనుకుంది. 2020 నుంచి ప్లాంట్ ఆధారిత ఆహారంపై ప్రసంగాలు ఇవ్వడం మొదలెట్టింది. యానిమల్ ఉత్పత్తులకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను కూడా పాఠకుల ముందు ఉంచుతోంది. యానిమల్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ప్లాంట్ బేస్డ్, గ్లూటన్ ఫ్రీ ప్రత్యామ్నాయాలపై పలు వర్క్ షాపులను కూడా నిర్వహిస్తోంది. టోఫు, నట్ కర్డ్, డయరీ ఫ్రీ చీజ్, గ్లూటన్ ఫ్రీ బ్రెడ్, పాస్తా వంటి ఎన్నో ప్రత్యామ్నాయాలను ఎందరికో సూచిస్తూ చైతన్యపరుస్తోంది. అంతేకాదు ప్లాంట్ బేస్డ్ రెసిపీలతో కూడిన ‘స్లిక్ బెల్లీ’ అనే ఇ – బుక్ ను కూడా తీసుకువచ్చింది. ప్లాంట్ బేస్డ్ డైట్ తో ఆరోగ్యకరమైన జీవనాన్ని ఎలా సాగించవచ్చో ఎందరికో తెలియజేస్తున్న ప్రియ హెల్తీ ఫుడ్ ప్రియులకు ఒక స్ఫూర్తి అని చెప్పాలి.
ఫుడ్ నా ఎమోషన్…
‘‘మాది కాశ్మీర్. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నా. నాకు స్కూల్ లో చదివే రోజుల నుంచీ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవి. ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించి సమస్యలు బాగా ఎదుర్కొనేదాన్ని. లాక్టోజ్ ఇంటాలరెన్స్ బాగా ఉండేది. ఎన్నో మందులు వాడాను. కానీ వేటికీ అది తగ్గలేదు. చివరకు హెర్బ్స్, ప్లాంట్ బేస్డ్ ఆహారం తీసుకోవడం మొదలెట్టా. దాంతో అప్పటివరకూ నన్ను పీడిస్తూ వచ్చిన చాలా అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు తగ్గాయి. నా స్వానుభవంతో ఆరోగ్యమే ప్రధాన సూత్రంగా ప్లాంట్ బేస్డ్ ఆహారం అందించే ఆరోగ్యం గురించి ప్రచారం చేయడానికి పూనుకున్నా. దీన్ని సాధించాలన్నది నా కల. దాన్ని నేను నిజం చేసుకోగలుగుతున్నా. మాస్టర్ చెఫ్ ఇండియా టాప్ 36లో నేను ఉండడం నిజంగా నాకు ఎంతో గర్వం కలిగిస్తోంది. ఉదాహరణకు నా మూలాలు కశ్మీర్ తో ముడిపడి ఉండడంతో కాశ్మీరీ సువాసనలు చిందించే వేగాన్ రెసిపీని ఈ పోటీలో చేశాను. ఇది అందరి జడ్జీలకు నచ్చింది.
నేను ప్లాంట్ బేస్డ్, వేగాన్, గ్లూటన్ ఫ్రీ కన్ఫెక్షనరీని ఇంటి నుంచి నడుపుతున్నా. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మీద ఎంతోకాలం అధ్యయనాలు చేశాను. ప్లాంట్ బేస్డ్ ఫుడీ, చెఫ్ అయిన నేను ‘వెల్ క్యూర్’ అనే బ్రాండును తెస్తున్నా. ప్రక్రుతి సిద్ధమైన ఆహారపు అలవాట్లతో ఇండియా ఆరోగ్య విజన్ ని మార్చే విస్త్రుతమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించా. ఈ ఆహార విధానాన్ని అనుసరిస్తూ ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే క్రమబద్ధీకరించుకునేలా చేయాలన్నదే నా ఆశయం. ఆహారం అనేది శరీరానికి సాంత్వననిచ్చేది. పదేళ్లకు పైగా ఫుడ్, హెల్త్, ఫిట్నెస్ లపై నేను చేసిన అధ్యయనమే నన్ను ప్లాంట్ బేస్డ్ ఆహారం దిశగా అడుగులు వేసేలా చేసింది. నా పేషన్, ప్రొఫెషన్ వేగాన్ ఫుడ్. నా ఎమోషన్ ఫుడ్..’’