Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Morarji Desai: భారత దేశ తొలి సంకీర్ణ ప్రభుత్వ సారథి మొరార్జీ దేశాయ్

Morarji Desai: భారత దేశ తొలి సంకీర్ణ ప్రభుత్వ సారథి మొరార్జీ దేశాయ్

తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు

15 ఆగష్టు 1947న దేశానికి స్వాతంత్రం సిద్ధించి స్వతంత్ర భారత ప్రప్రథమ ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు 14 మంది ఈ పీఠాన్ని అధిరోహించారు. అయితే 24 మార్చ్ 1977 నుండి 28 జూలై 1979 వరకు 2 సంవత్సరాల 126 రోజులు దేశ నాల్గవ ప్రధానమంత్రిగా కొనసాగిన మొరార్జీ దేశాయికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. దేశ స్వాతంత్ర్యం తరువాత దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏకచ్చత్రాధిపత్యంగా పాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపి తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. అంతే కాదు అత్యధిక వయసులో (81 సంవత్సరాలు) ఆ పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి కూడా ఆయనే. మరో విశేషమేమిటంటే అందరి లాగా కాకుండా ఆయన జయంతి మాత్రం నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి 29న వస్తుంది. ఆయన ఫిబ్రవరి 29, 1896న (లీపు సంవత్సరం) ప్రస్తుతం గుజ‌రాత్‌లోని బల్సర్ జిల్లాలోని భ‌డేలీ గ్రామంలో జన్మించారు.
బాల్యం మరియు విద్యాభ్యాసం:
ఒక సాధారణ గ్రామ ఉపాధ్యాయుడు రంఛోడ్ జి దేశాయి కుమారుడైన మొరార్జీ దేశాయి ప్రాథమిక విద్య ది కుండ్లా స్కూల్, (ఇప్పుడు జె వి మోడీ స్కూల్) సావర్ కుండ్లాలో, హై స్కూల్ విద్య, బాయి ఆవా బాయి, వల్సాడ్ లో ఆ తరువాత బొంబాయి విశ్వవిద్యాలయంలో కొనసాగింది. 15వ యేట మెట్రిక్యులేషన్ చదువుతుండగా తండ్రి మృతి చెందడంతో, ఆయన కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే 1911లో గజ్రాబెన్ ను పెళ్ళి చేసుకున్నారు. ప్రతిభ ఆధారంగా బొంబాయి లోని విల్సన్ కాలేజ్ లో సైన్స్ చదివేందుకు భావ్ నగర్ మహారాజ వారినుండి స్కాలర్షిప్ అందుకున్నాడు. గోకుల్ దాస్ తేజ్ పాల్ బోర్డింగ్ హౌస్ లో ఉచిత వసతి మరియు భోజన సదుపాయం పొందే ఆయన తన స్కాలర్షిప్ తో పాటు ట్యూషన్స్ చెప్పడం ద్వారా సమకూరే డబ్బును కూడా తల్లికి పంపేవారు. 1917లో పట్టభద్రుడైన తరువాత 1918లో బొంబాయి ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ లో చేరి అహ్మదాబాద్ డిప్యూటి కలెక్టర్ గా నియమితులయ్యారు.
స్వాతంత్రోద్యమంలో పాత్ర:
మే 1930లో గోధ్రా డిప్యూటి కలెక్టర్ పదవికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్రోద్యమంలో పాల్గొని దాదాపు 10 సంవత్సరాలు బ్రిటిష్ జైళ్లలో గడిపారు. గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితుడై భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలలో పాల్గొంటూ 1931లో గుజరాత్ ప్రోవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఆ తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఎంపికయ్యారు. 1937లో బొంబాయి శాసన సభకు ఎన్నికై రెవెన్యూ, వ్యవసాయం, అడవులు మరియు సహకార శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1939లో “శాసనోల్లంఘన” ఉద్యమంలో చేరేందుకు పదవిని త్యజించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు దాదాపు మూడేళ్ళు జైలు శిక్ష అనుభవించి, 1946 నుండి 1956 వరకు బొంబాయి శాసన సభ సభ్యునిగానే కాక 1946 నుండి 1952 వరకు హోం, రెవెన్యూ మంత్రిగా మరియు 1952 నుండి 1956 వరకు బొంబాయి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన పరిపాలనా నైపుణ్యంతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా కూడా పేరు పొందారు. పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల ప్రజ‌ల జీవ‌న ప్రమాణాలు మెరుగుప‌డ‌నంత వ‌ర‌కు సామ్యవాదానికి త‌గిన అర్థం ఉండ‌ద‌ని భావించే ఆయన రైతులు, కౌలుదారుల క‌ష్టాలు తొల‌గించే అనేక అభ్యుద‌య‌ చ‌ట్టాల‌ను రూపొందించి ఈ విష‌యంలో యావత్ దేశానికి ఆద‌ర్శంగా నిలిచారు. దేశం లోని అనేక కులాలు మరియు తెగలను పుట్టుకతోనే నేరస్థులుగా పరిగణించి, వారి రోజువారీ కదలికలపై ఆంక్షలు విధించే “క్రిమినల్ ట్రైబ్స్” చట్టాన్ని రద్దు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు.
అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి:
భారతదేశ చరిత్రలో 1959 నుండి 1970 వరకు అత్యధికంగా పది (ఎనిమిది పూర్తి మరియు రెండు మధ్యంతర) కేంద్ర బడ్జెట్‌లను సమర్పించి రికార్డు సృష్టించారు. ఆయన వరుసగా ఆరు బడ్జెట్‌లను (ఐదు పూర్తి మరియు ఒక మధ్యంతర) సమర్పించిన తొలి ఆర్థిక మంత్రి కాగా ఫిబ్రవరి 1, 2024న కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆ ఘనత సాధించిన రెండవ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆయన ఆర్థిక క్రమశిక్షణ, వాణిజ్య విధానాల సరళీకరణ, స్వావలంబనను ప్రోత్సహించే అంశాలపై దృష్టి సారించే వారని గుర్తింపు పొందారు. రాష్ట్రాల పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ త‌రువాత 1956 న‌వంబ‌ర్ 14న ఆయన కేంద్ర మంత్రివ‌ర్గంలో వాణిజ్య, ప‌రిశ్రమ‌ల శాఖ‌ను, 1958 మార్చి 22న ఆర్థిక మంత్రిత్వ శాఖలను చేప‌ట్టారు. ర‌క్షణ‌, అభివృద్ధి అవ‌స‌రాల‌కు ప్రాధాన్యతనిస్తూ భారీ ఆదాయాన్ని స‌మ‌కూర్చడంతో పాటు వృధా వ్యయాన్ని త‌గ్గించి, పాల‌న‌లో పొదుపును ప్రోత్సహించారు. ద్రవ్య లోటును కనిష్ట స్థాయిలో ఉంచేందుకు కృషి చేయడంతో పాటు సంప‌న్నవ‌ర్గాల విలాసాల‌పై ఆంక్షలు కొనసాగించారు. నిష్పక్ష, స్వతంత్ర సివిల్ సర్వీసెస్ వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసించిన ఆయన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమీషన్ ఛైర్మన్‌గా, పరిపాలనా వ్యవస్థ పునర్నిర్మాణానికి విలువైన సూచనలు మరియు సంస్కరణలను రూపొందించారు. 1967లో ఆయన ఇందిరాగాంధీ మంత్రివ‌ర్గంలో ఉప ప్రధాని పదవితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ను చేపట్టినప్పటికీ, 1969 జులైలో ఆమె ఆయ‌నను ఆర్థిక శాఖ‌ నుండి తప్పించారు. శాఖ‌ల‌ను మార్చే విచ‌క్షణాధికారం ప్రధాన‌మంత్రికి ఉన్నప్పటికీ, త‌నను సంప్రదించాల‌న్న క‌నీస మ‌ర్యాద‌ను పాటించ‌కుండా తన ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగించార‌న్న అభిప్రాయంతో ఉప ప్రధాని ప‌ద‌వికి రాజీనామా చేశారు. 12 జూన్ 1975న అలహాబాద్ హై కోర్టు ప్రధానమంత్రి ఇందిరా గాంధి లోక్ సభ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వడంతో 25 జూన్ 1975న ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించి మరుసటి రోజు ఇతర నాయకులతో పాటు ఆయనను ఏకాంతవాసంలో నిర్బంధించి, 18 జనవరి 1977 న లోక్ సభ కు ఎన్నికలు ప్రకటించే కొన్ని రోజుల ముందు విడుదల చేసారు.
ప్రధానమంత్రిగా:
1977 జనవరిలో ఇందిరా గాంధీ లోక్ సభ రద్దు చేసి ఎన్నికలు ప్రకటించి, నిర్బంధంలో ఉన్న నాయకులందరినీ విడుదల చేయడంతో, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్, కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) సభ్యులతో కలిసి జనతా పార్టీ ఏర్పాటయ్యింది. ఇందిరా గాంధీ నియంతృత్వ పోకడలు మరియు ఎమర్జెన్సీ కాలంలో అనుభవించిన కష్టాలతో విసిగి వేసారిన ప్రజలు జనతా పార్టీకి దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసారు. మార్చ్ 1977 లో 6వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో జనతా పార్టీకి అద్భుతమైన విజయం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన మొరార్జీ గుజరాత్ లోని సూరత్ లోక్ సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి 24 మార్చ్ 1977 న భారత నాల్గవ మరియు తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలంలోనే చౌదరి చరణ్ సింగ్ మరియు బాబూ జగ్జీవన్ రాం ఇద్దరు ఉప ప్రధానులుగా ఉన్నారు. నెహ్రూ మరణానంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి 18 నెలల పాటు పదవిలో కొనసాగి 1966లో ఊహించని విధంగా తాష్కెంట్ లో మరణించిన తరువాత మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్న నాయకునిగా ప్రధాని రేసులో ఉన్నప్పటికీ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ ఆ పీఠం దక్కించుకున్నారు.
జనతా పార్టీలో చీలిక:
మొరార్జీ దేశాయి నేతృత్వంలోని ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వాలు చేపట్టిన ఎన్నో రాజ్యాంగ సవరణలను రద్దు చేయడమే కాక మున్ముందు వచ్చే ప్రభుత్వాలు ఎమర్జెన్సీ విధించడానికి అవకాశాలు తక్కువగా ఉండేలా సవరణలు చేపట్టారు. దురదృష్టవశాత్తూ జనతా పార్టీ కూటమి సభ్యుల మధ్య వ్యక్తిగత పట్టింపులు, భేషజాల కారణంగా ఆశించిన స్థాయిలో సుస్థిర పాలన అందించలేకపోయింది. జనతా పార్టీ పై కూటమి లోని ఏ ఒక్క నాయకునికి పూర్తి పట్టు లేకుండా పోవడంతో ఆయనను పదవీచ్యుతుడిని చేయడానికి లోపాయకారీగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి తోడు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ మరియు ఇతర ముఖ్య నాయకులు చేపట్టిన నిర్ణయాలపై చేపట్టిన విచారణ విషయమై కూడా కూటమి సభ్యుల మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో 1979లో రాజ్ నారాయణ్ మరియు చౌదరి చరణ్ సింగ్ జనతా పార్టీకి మద్దతు ఉపసంహరించడంతో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేసారు. 1980 సాధారణ ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఎన్నికలలో పోటీ చేయలేదు. రాజకేయాల నుండి వైదొలిగిన తరువాత బొంబాయిలో స్థిరపడిన ఆయన 10 ఏప్రిల్ 1995న 99వ యేట మరణించారు.
దౌత్య సంబంధాలు:
1962 యుద్ధం తరువాత మొదటిసారిగా మొరార్జీ దేశాయి చైనా తో సాధారణ సుహృద్భావ సంబంధాలకు తెరలేపారు. అంతే కాకుండా ఆయన నాటి పాకిస్తాన్ మిలటరీ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హఖ్ తో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. సాధారణంగా శాంతికాముక వైఖరి పట్ల మొగ్గు చూపే ఆయన అమెరికా ప్రతిపాదించిన అణుపరీక్షలు చేపట్టబోమనే ఒప్పందం పై సంతకం చేయడానికి నిరాకరించారు. ఈ విషయంలో భారత్ తన సమ్మతి తెలియచేయకపోతే దేశంలోని విద్యుత్ కేంద్రాలకు యురేనియం సరఫరాను నిలిపేస్తామని అమెరికా బెదిరించినప్పటికీ ఆయన ఏమాత్రం వెనుకంజ వేయలేదు. భారతదేశ గూఢచార సంస్థ – “రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్” ఇందిరా గాంధీకి వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయంతో తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థకు నిధులు ఇవ్వకుండా, కార్యకలాపాలను కట్టడి చేసి దాని ఉనికిని విచ్ఛిన్నం చేసారన్న అపవాదు ఆయనపై ఉంది.
పురస్కారాలు:
భారత్ మరియు పాకిస్తాన్ ల నుండి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న ఏకైక భారతీయుడు మొరార్జీ దేశాయ్. ఆయన 1990లో పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం “నిషాన్-ఎ-పాకిస్తాన్” ను మరియు 1991లో భారత దేశ అత్యన్నత పౌర పురస్కారం “భారతరత్న” ను అందుకున్నారు. అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు అతనికి గౌరవ డిగ్రీలను ప్రదానం చేసాయి. సుదీర్ఘకాలం పాటు ఆయన గుజరాత్ విద్యాపీఠం కులపతి ఛాన్సలర్‌గానే కాక అనేక ఇతర సామాజిక, సాంస్కృతిక మరియు విద్యా సంస్థల అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.

- Advertisement -

యేచన్ చంద్ర శేఖర్, మాజీ రాష్ట్ర కార్యదర్శి
డి భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News