కేరళ తిరువనంతపురం సమరాగ్ని సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ, అవినీతిమయ విధానాలు దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని కలుషితం చేసినట్టు రేవంత్ మండిప్డడారు. దేశానికి లౌకిక, ప్రజాస్వామిక, అవినీతి రహిత పాలన అందించడం కాంగ్రెస్ తోనే సాధ్యమంటూ ప్రసంగించారు.
దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాలను తుంగలో తొక్కి… బీజేపీ అవినీతిని ప్రోత్సహిస్తోందని రేవంత్ అన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్న రేవంత్, దేశం మొత్తం మోదీపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే కాదు.. మోదీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధమన్నారు.
ఈ యుద్ధంలో మనం గెలవాలి… ఇండియా కూటమిని గెలిపించుకోవాలంటూ ప్రసంగించిన రేవంత్ కు కేరళలో మంచి ప్రజాదరణ లభించింది. ఇండియా కూటమిని బలహీన పరిచేందుకు మూడో ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జరిగే కుట్రలకు కేసీఆర్ సహకరిస్తున్నారన్నారు. ఈ కుట్రలకు సహకరిస్తున్న కేసీఆర్ ను… ఆయనకు కేరళలో సహకరిస్తున్న స్థానిక శక్తులను ఓడించాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారానే ప్రజాస్వామిక, లౌకిక శక్తులకు బలం చేకూరుతుందని రేవంత్ అన్నారు.