Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Priority to South increased: దక్షిణాదికి పెరిగిన ప్రాధాన్యం

Priority to South increased: దక్షిణాదికి పెరిగిన ప్రాధాన్యం

కాగ్రెస్, బీజేపీల స్పెషల్ ఫోకస్ మనపైనే

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశం హాట్‌టాపిక్‌గా మారింది. అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ రెండూ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. దక్షిణాది మొదట్నుంచీ భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉంది. నిన్నమొన్నటివరకు దక్షిణాదిన ఒక్క కర్ణాటకలోనే బీజేపీ ప్రభుత్వం ఉండేది. అయితే కిందటేడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకను కూడా కోల్పోయింది బీజేపీ. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని సీట్లు తెచ్చుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. ఇదిలాఉంటే దక్షిణాదిపై హస్తం పార్టీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉత్తరాదిన ఏర్పడే లోటును దక్షిణాదిలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ద్వారా భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దక్షిణాదిన రెండు రాష్ట్రాలు … కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇది కలిసొచ్చే అంశంగా హస్తం పార్టీ భావిస్తోంది.

- Advertisement -

దక్షిణాదిన మొత్తం ఐదు రాష్ట్రాలు పుదుచ్చేరి పేరుతో ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నాయి. ఈసారి 400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణాదిపై కొన్ని సీట్లు తెచ్చుకుని 400 సీట్ల టార్గెట్‌కు చేరుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీకి గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాగా పేరున్న కర్ణాటకలో ఇప్పటికీ ఆ పార్టీ బలంగా ఉంది. దాదాపుగా రెండు దశాబ్దాల కిందటే మిత్రపక్షాలతో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. దీంతో కర్ణాటకలో కమలం పార్టీ బ‌ల‌మైన క్యాడర్‌ త‌యారైంది. ఈ క్రెడిట్ బీజేపీ అధిష్టానానిది కాదు. క‌చ్చితంగా బీఎస్ య‌డ్యూర‌ప్పదే. కర్ణాటకలో బీజేపీకి ప‌క్కాగా పునాదులు వేసిన నాయకుడు య‌డ్యూరప్ప. కర్ణాటకలో య‌డ్యూర‌ప్ప నాయకత్వ ప్రతిభ, లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గం అండ‌దండ‌ల వ‌ల్లే బీజేపీ బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రించింది. కిందటేడాది మేనెలలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. అయినప్పటికీ కన్నడనాట బీజేపీకి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ నాయకత్వంలోని జేడీ ( ఎస్‌) తో కమలం పార్టీ పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ 25కు తగ్గేదేలేదంటోంది భారతీయ జనతా పార్టీ. ఒక్క కర్ణాటక మినహాయిస్తే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఎదగలేకపోయింది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. స్వంత బలం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో ఎప్పటికప్పుడు పొత్తులు పెట్టుకుని నాలుగో ఐదో సీట్లు తెచ్చుకోవడానికే ఇన్నేళ్లుగా బీజేపీ పరిమితమైంది. తమిళనాడులో 1999లో డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ తరువాత పొత్తులపై బీజేపీ వైఖరి మారింది. ఈసారి పన్నీర్ సెల్వం నాయకత్వంలోని అన్నా డీఎంకే చీలికవర్గం, సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళిగ వెట్రి కళగం, ప్రేమలత నాయకత్వంలోని డీఎండీకే, బలహీనవర్గాల పార్టీగా పేరున్న పీఎంకేతో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ అలయన్స్ పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కేర‌ళ విష‌యానికి వ‌స్తే ఇక్కడ మొద‌టి నుంచి వామపక్ష పార్టీల ఆధిప‌త్యం ఎక్కువ‌. వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న కేర‌ళ ప్రజలు హిందూత్వ అజెండాతో వ‌చ్చిన బీజేపీ ని స‌హ‌జంగానే దూరం పెట్టారు. వామపక్షాలను కేరళీయులు కాదనుకుంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉండనే ఉంది. మరో విషయం, కేరళలో బీజేపీకి మిత్రపక్షం అంటూ ఒక్కటీ లేదు. కేరళలో బీజేపీ ఎదగకపోవడానికి ఇదో కారణం. ఈ నేపథ్యంలో దక్షిణాదిన గల ప్రతి రాష్ట్రంలోనూ సినీ తారలను, క్రికెటర్లను, సెలబ్రిటీలను, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను ఎన్నికల బరిలో దించాలని కమలం పార్టీ భావిస్తోంది. తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కేరళ నుంచి సినీ నటుడు సురేష్ గోపి పేరు ఉండటం విశేషం.

సౌతిండియాపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి !
బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సౌతిండియాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయి చాలా కాలమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే హిందీ మాట్లాడే ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయమే దీనికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఉత్తరాదికి ప్రత్యామ్నాయంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది హస్తం పార్టీ. దక్షిణాదిన రెండు రాష్ట్రాలు…కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కిందటేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశాయి. అప్పటివరకు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. తృణమూల్ కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకునేవి కాదు. అయితే కర్ణాటక ఎన్నికల్లో విజయంతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ మళ్లీ లేచి నిలబడింది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ప్రాధాన్యాన్ని మిగతా బీజేపీయేతర పార్టీలు గుర్తించడం మొదలెట్టాయి. అలాగే కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇమేజ్ మరింతగా పెరిగింది. ఇతర బీజేపీయేతర పార్టీలు విస్మరించలేని స్థాయికి కాంగ్రెస్ ఎదిగిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 45 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. స్వంత ప్రభుత్వాలు ఉండటంతో కర్ణాటక, తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఆ ప్రభావంతో మిగతా లోక్‌సభ సెగ్మెంట్లలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన డీఎంకేనే అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమిలో డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానంతో డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కూడా కొన్ని సీట్లు సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక కేరళ విషయానికొస్తే ఇక్కడ మొత్తం 20 లోక్‌సభ సీట్లున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 19 సీట్లను గెలుచుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఆలిండియా కాంగ్రెస్ కమిటీలో చక్రం తిప్పుతున్న రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందిన వారే. దీంతో ఈసారి కూడా కేరళలో 19 సీట్లు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్ అధిష్టానానికి ఎటువంటి భ్రమలు లేవు. మొత్తంమీద దక్షిణాదిన సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని భారతీయ జనతా పార్టీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశానికి గతంలో ఎన్నడూలేనంతగా ప్రాధాన్యం పెరిగింది.

       - ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్‌ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News