ఎన్నికల కమిషనర్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఇరకాటంలో పడింది. సుప్రీంకోర్టుతో మాటలు పడాల్సి వచ్చింది. అయితే, తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా నియామకాలు జరపాల్సి వచ్చిందని సమర్థించుకుంది. గత వారం ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఈ నియామకాలను చేపట్టడాన్ని మాత్రం సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆదరాబాదరాగా ఈ నియామకాలు చేపట్టడం అనవసరమని, ఇలా చేయకుండా ఉండాల్సిందని అది వ్యాఖ్యానించింది.
నిజానికి కేంద్ర ప్రభుత్వం దీనికి ముందుగానే సమాధానం ఇచ్చింది. ఈ నియామకాలు సాధారణంగా జరిగేవేనని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నియామకాలు చేపట్టాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి ఒక రోజు ముందు, అంటే మార్చి 14న ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సాంధులను నియమించింది. ఈ నియామకాల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన సమావేశాన్ని వాయిదా వేసి ఉంటే బాగుండేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మినహా సుప్రీం కోర్టు ఈ విషయాన్ని మరింతగా
సాగదీయడం జరగలేదు. పైగా ఈ నియామకాలకు ఆమోద ముద్ర వేసింది.
ఈ నియామకాలు 2023 నాటి చట్టం ప్రకారమే జరిగాయి. చట్టం ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి కూడా సభ్యులుగా ఉన్న ఒక నియమకాల కమిటీ సమావేశమై ఈ నియామకాలను జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసి, నియామకాలు జరుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తాము ఈ నియామకాల జోలికిపోవడం జరగదని, దీనివల్ల లేనిపోని సంక్షోభాన్ని, సమస్యల్ని సృష్టించినట్టవుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కొద్ది రోజుల క్రితం ఒక ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయడంతో ఈ నియామ కాలు చేయాల్సి వచ్చింది. అందువల్ల ప్రభుత్వం ఈ ఖాళీని భర్తీ చేయడం జరిగింది. ఈ నియామకాల విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోకుండా ఉండడానికే ప్రభుత్వం ఆదరాబాదరా ఈ నియామకాలు జరపిందని, నిజానికి ఈ నియామకాల కమిటీకి ప్రభుత్వం మరికొంత సమయం ఇచ్చి ఉండాల్సిందని కొందరు ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు న్యాయస్థానం కూడా ఈ నియా మకాలను సమర్థించినందువల్ల ప్రతిపక్షాలు ఎక్కువగా వ్యాఖ్యానించడానికి, విమర్శిం చడానికి అవకాశం లేకుండా పోయింది.
ఎలక్షన్ కమిషనర్లుగా నియమితులైన అధికారుల మీద ఎటువంటి ఫిర్యాదులూ లేనందువల్ల, వారు నిష్పాక్షికంగా, నిజాయతీగా వ్యవహరించే అధికారులే అయినందువల్ల తాము ఈ నియామకాలను సమర్థిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. అయితే, ఇక్కడ సమస్య ఈ ఎలక్షన్ కమిషనర్లు సమర్థులా, కాదా అన్నది కాదు. చట్టం ప్రకారం, న్యాయ వ్యవస్థతో కూడా సంప్రదించాల్సిన కేంద్ర ప్రభుత్వం
స్వయంగా నిర్ణయం తీసుకుని అమలు చేయడమన్నది వివాదాస్సందంగా కనిపిస్తోంది. న్యాయ స్థానం కేంద్ర ప్రభుత్వం తొందరపాటుతనంతో వ్యవహరించడాన్ని మాత్రమే తప్పు బట్టింది. నిజానికి ఇది మధ్యంతర రూలింగ్ మాత్రమే. న్యాయస్థానం పూర్తి స్థాయిలో తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంది. అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నందు వల్లే తాము ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చిందని న్యాయస్థానం వివరించింది. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కనిపించడం కూడా ముఖ్యం. ఇదే సూత్రం నియామకాల్లో కూడా కనిపించాల్సి ఉంటుంది.
ఇటువంటి నియామకాలు నిష్పక్షపాతంగా, నిజాయతీగా, సజావుగా జరగాలన్న ఉద్దేశంతోనే సుప్రీం కోర్టు ఈ కమిటీలో ప్రధాన న్యాయమూర్తిని కూడా ఒక సభ్యుడుగా చేర్చడం జరిగింది. అయితే, ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించకుండానే ఎలక్షన్ కమిషనర్ల నియామకాన్ని ఏక పక్షంగా చేపట్టడం ఈ చట్టం ఉద్దేశాన్ని పరిహాసం చేస్తోంది. పైగా ఈ కమిటీలో సభ్యుడైన ప్రధానమంత్రి ఒక్కరి నిర్ణయంతోనే నియామకాలు జరపడం సమంజసంగా కనిపించడం లేదనేది న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా కేవలం కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే సొంత నిర్ణయంతో నియామకాలు జరపడం అనేది ఏ విధంగా చూసినా అభ్యంతరకరమైన వ్యవహారమేనని వారు భావిస్తున్నారు. ఇది ఒక లోపంగానే, పొరపాటు వ్యవహారంగానే చరిత్రలో ఉండిపోతుంది.