పిగ్మెంటేషన్ పోగొట్టే ఇంటి డ్రింకు…
పిగ్మెంటేషన్ సమస్యలతో బాధపడుతున్నారా? చర్మంపై ఏర్పడే డార్క్ పిగ్మెంటేషన్ సమస్యను నేచురల్ గా, మరింతో సింపుల్ గా మీ ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఈ సమస్యతో ఎంతోమంది స్త్రీలు, పురుషులు కూడా తరచూ బాధపడుతుంటారు. ఇందుకోసం ఎన్నో కాస్మటిక్స్ వాడుతుంటారు. యాంటాక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఫుడ్స్ తింటే ఈ సమస్య తొందరగా తలెత్తదు. అంతేకాదు మీ చర్మం నునుపుదేలుతుంది. పట్టులా మ్రుదువుగా అవుతుంది. సూర్యకిరణాల బారిన బాగా పడడం వల్ల, హార్మోనల్ మార్పుల వల్ల, ఇన్ఫ్లమేషన్, జన్యుసంబంధమైన కారణాలతో ఈ సమస్య ఎదురవుతుంది. ఏజింగ్, మెనోపాజ్, బిడ్డకు జన్మనివ్వడం వంటివి కూడా శరీరంపై పిగ్మెంటేషన్ తలెత్తడానికి కారణం అవుతుంటాయి. ఈ పిగ్మెంటేషన్ సమస్యకు సహజమైన పరిష్కారం మన వంటింట్లోనే ఉంది.
కీర, దానిమ్మ, కరివేపాకు ఆకులు, నిమ్మరసంతో ఈ ఇంటి డ్రింకు ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింకు లాభాలు ఎన్నో. కీరకాయల్లో యాంటాక్సిడెంట్లు, సిలికా అత్యధికంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ డ్రింకులో ఉపయోగించే దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్లతో పాటు చర్మాన్ని మెరిపించే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పిగ్మెంటేషన్ మచ్చలను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి.
ఈ డ్రింకులో వేసే కరివేపాకుల్లో కూడా యాంటాక్సిడెంట్లతో పాటు విటమిన్ సి బాగా ఉంది. అలా కరివేపాకులు కూడా పిగ్మెటేషన్ ను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక నిమ్మరసంలో విటమిన్ సి ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మరసం చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాదు స్కిన్ టోన్ కూడా సమంగా ఉండేలా తోడ్పడుతుంది.
ఈ డ్రింకు ఎలా చేయాలంటేః
ఈ డ్రింకు తయారీకి చిన్న కీరకాయ ఒకటి, అరకప్పు దానిమ్మ గింజలు, పది పన్నెండు కరివేపాకులు, అరచెక్క నిమ్మరసం రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బాగా కొట్టాలి. ఆ డ్రింకును గ్లాసులో పోసుకుని తాగాలి అంతే. ఈ డ్రింకు వల్ల పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటు ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ఈ డ్రింకు తగ్గిస్తుంది. అంతేకాదు సెల్యులార్ పునరుద్ధరణ కూడా చేస్తుంది.