భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతల సమక్షంలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అదే దూకుడుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఒడిశా రాష్రానికి చెందిన పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాహారాష్ట్ర లోని నాంధేడ్ జిల్లాలో పలువురు ముఖ్యులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ఆదివారం సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం జరప తలపెట్టిన బీఆర్ఎస్ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షులు, సీయం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేశారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ , ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితర నేతలు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు గత వారం రోజులుగా నాందేడ్ లో మకాం వేసి ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభ ఏర్పాట్లను చూస్తూనే విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరాఠా వీధుల్లో కలియ తిరుగుతూ వృద్దులు, మహిళలు, రైతులు, యువకులను పలకరిస్తూ… తెలంగాణ రాష్ట్రంలో సీయం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కేసీఆర్ చేస్తున్న కృషి గురించి తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణ అవశ్యకతను తెలియజేస్తూ బీఆర్ఎస్ ను ఆదరించాలని కోరుతున్నారు.
మరోవైపు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో మన రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా నాందేడ్ జిల్లా కేంద్రంలో జరగనున్న సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్ & నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు స్వచ్చంద తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.
సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో రేపు (ఆదివారం) కేసీఆర్ సభ నేపథ్యంలో అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సభకు హాజరవుతున్న ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి… సభ ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలినడకన మైదానమంతా కలియతిరిగారు. సభా వేదిక అలంకరణ, అతిధులు, ముఖ్య నేతల సీటింగ్ పై నేతలకు దిశా నిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనపై మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో, వివిధ పార్టీల నాయకుల్లో, మీడియాలో సీరియస్ గా చర్చ జరుగుతోంది.
Nanded Sabha: మహారాష్ట్ర లో BRS భారీ సభ, గులాబీమయమైన నాందేడ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES