IND vs NZ 3rd T20 : నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచులో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బ్యాటర్లలో కాన్వే(59; 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్స్(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఆలెన్ ఫిన్, కాన్వేలు శుభారంభాన్ని అందివ్వలేకపోయారు. మూడు పరుగులు చేసిన ఫిన్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఓ చక్కని ఇన్‌స్వింగర్‌తో ఎల్‌బీగా పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన చాప్‌మన్ 12 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 44 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కాన్వేకు ఫిలిప్స్ జత కలిసాడు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పోటాపోటీగా బౌండరీలు బాదారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సిరాజ్ విడదీశాడు. మరికాసేపటికే జట్టు స్కోరు 146 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో కాన్వే కూడా పెవిలియన్ చేరాడు.
ఈ దశలో భారత బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సిరాజ్, అర్ష్‌దీప్‌లు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్ల పండుగ చేసుకున్నారు. చెరో నాలుగు వికెట్లు తీసి కివీస్‌ను ఆలౌట్ చేశారు.