ఇటీవల కాలంలో వచ్చిన ఎన్నదగిన బాలల నవల “వీటో” అని చెప్పాలి.ఒకవైపు పిల్లల మనసుల్లో ఆలోచనలు రేకెత్తిస్తూ మరోవైపు వినోదాన్ని పంచే ముచ్చటైన రచన ఇది. రచయిత్రి డా.హారిక చెరుకుపల్లి. ఓ వైపు డెంటిస్ట్ గా రాణిస్తూ ఇంకోవైపు బాలల కోసం రాసే చక్కని రచయిత్రి గా పేరుతెచ్చుకున్నారు. ఇంచుమించు అన్ని ప్రముఖ పత్రికల్లో ఈమె కథలు ప్రచురింపబడ్డాయి.
గతంలో ఆమె రాసిన కథల కంటే ఇతివృత్తం పరంగా భిన్నమైనదని చెప్పకతప్పదు. ఇంట్లో పెద్దలు ఎంత చెప్పినా పోషకాహార విలువలున్న ఆహారం తీసుకోకుండా జంక్ ఫుడ్ తో కాలం గడిపే పిల్లలకి నూతన లోకాన్ని చూపి కళ్ళు తెరిపించే నవల ఇది.
బాలల స్థాయికి దిగి వారి మనోప్రపంచాన్ని అర్థం చేసుకుని రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అది కథ కావచ్చు,నవల కావచ్చు…నిజంగా అసిధార వ్రతమే. పిల్లల్ని ఎంతో ప్రేమించే వ్యక్తిత్వం ఉన్నవారికే అది సాధ్యం. అందుకే ఏ భాషలో తీసుకున్నా పిల్లల కోసం రాసేవారు చాలా తక్కువ గా ఉంటారు. ఈ నవల వీటో పిల్లలతో బాటు పెద్దలు కూడా హాయిగా చదువుకోవచ్చు.
అధ్యాయాల వారీగా నవలని విభజించడం వల్ల చదువరికి పాత్రలు, కథా సంవిధానం చక్కగా అర్థమవుతుంది. రవి,హేమ, నానీ, చంటి అనే పిల్లలు మీనత్త అనే దుఖాణదారు వల్ల ఏ విధం గా మరో లోకంలోకి చేరిందీ కన్విన్సింగ్ గా రాశారు. అక్కడ మనకంటే పురోగమించిన విజ్ఞానం ఉండటం, అక్కడ నలుగురూ పొందిన అనుభవాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటాయి. అచటి రోబోలు ప్రవర్తించే, బోధించే విశేషాలు ఆకట్టుకుంటాయి.
సస్పెన్స్, నాటకీయత ఊపిరిబిగబట్టి చదివేలా చేస్తాయి. పిల్లలు మళ్ళీ మన లోకంలోకి వచ్చేంత వరకు ఆసక్తిని తగ్గనివ్వకుండా ఇతివృత్తాన్ని మంచి వేగంగా నడిపారు. నవలలోని బొమ్మలు మరో ఎసెట్ గా చెప్పాలి. ఎందుకంటే అవి కథనంలో వాతావరణాన్ని కళ్ళకి కట్టాయి. చిత్రకారులు ఆ మేరకు అభినందనీయులు. ఈ రచయిత్రి డా.హారిక చెరుకుపల్లి ఇంకా మరిన్ని విన్నుత్నమైన రచనలు చేయాలని ఆకాంక్షిస్తూన్నాను.
పుస్తకం కావలసినవారు 90005 59913 కి ఫోన్ చేయవచ్చు.
–— మూర్తి కెవివిఎస్ (7893541003)