Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: అందరికీ అవసరం అమ్మ చెక్కిన శిల్పం

Telugu literature: అందరికీ అవసరం అమ్మ చెక్కిన శిల్పం

ఆసక్తికరమైన పుస్తకం

ప్రతి జీవి జన్మకు తల్లి ఎలా ప్రధాన భూమిక అవుతుందో..! ఆ శిశువు మనుగడకు అమ్మ పాత్ర మరింత ముఖ్యం, ప్రతి మగాడి విజయానికి ఆడది ఎలా ఆధారం అవుతుందో అలాగే ప్రతి ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తి పరిశ్రమకు ఆ వ్యక్తి మాతృమూర్తి శ్రమ ఎంతగానో ఉంటుంది అన్నది అక్షర సత్యం, అందుకే అవనిలో అమ్మ స్థానం ఎప్పటికీ సర్వోత్తమం. వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన మన దేశ వాసుల వెనుక వారి వారి తల్లుల పాత్రల గురించి తెలిసినప్పుడు కలిగే ప్రేరణ ఆదర్శ భావనల ద్వారా నేటితరం యువత తమను తాము తీర్చిదిద్దుకోవడంతోపాటు వారి ఆధునిక అమ్మల చేయూత కూడా తప్పక లభిస్తుంది అనే భావనతో వెలువడిన వ్యాస సంపుటి “అమ్మ చెక్కిన శిల్పం ” రచయిత “జాలాది రత్న సుధీర్” రంగస్థలం నటుడైన రచయిత, మాత్రమే కాదు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం పెంపు కోసం కృషి చేస్తున్న శిక్షకుడు కూడా కావడం విశేషం. బహుకాల కృషి ఫలితంగా వెలువడ్డ ఈ పుస్తకం ప్రక్రియా పరంగా చదవకుండా కేవలం విషయ సంగ్రహణ కోసం విధిగా చదవాలి, చత్రపతి శివాజీ మొదలు మన ప్రధాని మెచ్చిన మాతృమూర్తి వరంగల్ కు చెందిన కోడిపాక అరుణ అనే నిరుపేద తల్లి తన ఐదుగురు పిల్లలను తన పేదరికం ఎదిరించి ఎలా ప్రయోజకులుగా తీర్చి దిద్దిందో ఇందులో సవివరంగా వ్రాశారు వ్యాస రచయిత రత్న సుధీర్.

- Advertisement -

ఇందులో చారిత్రక సామాజిక వైజ్ఞానిక సాహిత్య కళా రంగాలతో పాటు రాజకీయ రంగాలలో సైతం ఉన్నత స్థానంలో నిలిచిన వ్యక్తుల విజయ గాథలు, అందుకు దోహదపడిన వారి తల్లుల గురించి మనం చదవవచ్చు. చావు అంటే ఏమిటో తెలియని వయస్సులో చావక తప్పని జబ్బు బ్రెయిన్ ట్యూమర్ మహమ్మారి సోకిన బాలుడికి రోజు రోజుకి శరీరం చచ్చు బడిపోతుంది, జీవిత బీమా కంపెనీలో చిరు ఉద్యోగి అయిన తండ్రి, సాధారణ గృహిణి అయిన తల్లి, ఆ బాలుడి అమ్మానాన్నలు. తల్లికి తన కొడుకు లోని ప్రతిభ మీద అపరిమితమైన నమ్మకంవుంది, అతడి జబ్బు నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం వ్యాయామం చేయించడానికి బదులు ఆ కుర్రాడినికి ఇష్టమైన డ్యాన్సును ప్రోత్సహించింది. పిల్లాడు వేసే కుప్పిగంతుల్లో కొత్తదనం గమనించింది బిడ్డ జబ్బు నయం చేయించడానికి కూలి పనులు సైతం చేసింది, కొడుకును మద్రాసు నగరం పంపించింది, అతని ప్రతిభ ప్రదర్శనకు సరైన వేదిక సినీ రంగమని చెప్పింది చిత్రంగా ప్రమాదకరమైన “బ్రెయిన్ ట్యూమర్” జబ్బు కూడా నయం కావడం మొదలుపెట్టింది. పట్టువదలని సాధనతో నృత్యంలో పట్టు సాధించాడు ప్రస్తుతానికన్నా భిన్నంగా ఆలోచించాడు మహామహులైన అప్పటి పెద్దలను సైతం మెప్పించి చలనచిత్ర నృత్య విభాగంలో విభిన్న నృత్య కళాకారుడుగా మారాడు దర్శకుడిగా నటుడిగా తనదైన ప్రత్యేక ప్రతిభాపాఠవాలను నిరూపించి ప్రముఖ నృత్య దర్శకుడుగా నిలిచిన ఆ బాలుడే “లారెన్స్” అతనిని అంతగా ప్రోత్సహించిన తన తల్లి లారెన్స్ పాలిట దేవత అందుకే ఆమెకు అతడు సాక్షాత్తు గుడినే కట్టాడు.

ఇటువంటి ఆసక్తికరమైన స్ఫూర్తి కథనాలు ఇందులో మనం అనేకం చదువుకోవచ్చు అందరికీ తెలిసిన ప్రముఖులే కాదు ఎవరికి తెలియని అందరూ తెలుసుకోవాల్సిన మరికొందరు మరుగునపడిన ఆదర్శ మాతృమూర్తుల వివరాలను కూడా ఒడిసిపట్టి అక్షరీకరించారు రచయిత. ఈ విధమైన రచయిత పరిశీలనాత్మకతను అందరం అభినందించాలి, స్వామి వివేకానంద, భగత్ సింగ్, చార్లీ చాప్లిన్, చేగువేరా, ఎడిసిన్, గ్రహం బెల్, మదర్ థెిరిసా, సర్వేపల్లి, వంటి సుపరిచితులతో పాటు డాక్టర్ దశరథ రామరెడ్డి, అంధుడైన సుచేతన్ రెడ్డి, శాంతాబయోటిక్స్ వరప్రసాదరెడ్డి, ఆర్థికవేత్త అభిషేక్ బెనర్జీ, వంటి సుపరిచితులు కానీ ప్రముఖులు ఆయా రంగాలకు చేరుకోవడానికి వారి వారి మాతృమూర్తులు చేసిన కృషి గురించి ఆసక్తికరమైన కథనాలతో ఇందులో మనం చదవవచ్చు.

గాయకుడు బాలసుబ్రమణ్యం, రాజకీయ వేత్త బండారు దత్తాత్రేయ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, పి.వి సింధు, తదితర ప్రముఖ వ్యక్తులు ఆయా స్థానాలకు చేరుకోవడానికి వారి వారి అమ్మలు పడ్డ శ్రమ గురించి నేటి తరం ప్రతి అమ్మ తప్పక చదివి తీరాలి. అమ్మతనం, అమ్మ పాత్ర, మారుతుంది ఆధునిక సమాజంలో ప్రతి చదువరి తప్పక చదవాల్సిన ఈ చక్కని పుస్తకంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 26 మంది విజయ గాధలు స్ఫూర్తివంతంగా అక్షరీకరించబడ్డాయి.

ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ఆ సమాజ యువత ఎలా నిర్మించబడాలో అన్న తపన ఈ వ్యాస రచయిత అక్షర కృషిలో అడుగడుగునా కనిపిస్తుంది. ప్రయత్నం చాలా బాగుంది, ఆశయం మరీ బాగుంది అలాగే అందరూ చదివి ఆచరణాత్మకంగా నడుచుకుంటే మరెంతో బాగుంటుంది. జీవితంలో ఏమి సాధించలేము అనే పూర్తి నిరాశ నాకు అంతటి గొప్ప అవకాశం వస్తుందా అనే అనాసక్తిగల సాధారణ వ్యక్తులందరికీ ఒక నిడైన గుండె ధైర్యంతో పాటు సాధించగలం అనే ప్రోత్సాహం అందించడంలో జాలాది రత్న సుధీర్ తీర్చిదిద్దిన ఈ “అమ్మ చెక్కిన శిల్పం ” ఎంతగానో దోహదపడుతుంది అనడంలో సందేహం లేదు.

పుస్తకం పేరు:- అమ్మ చెక్కిన శిల్పం (స్ఫూర్తి వ్యాసాలు),

రచన:-జాలాది రత్న సుధీర్,

పేజీలు:-144,

వెల:200/- రూ,

సమీక్షకుడు:- డా: అమ్మిన శ్రీనివాసరాజు,

సెల్: 77298 83223.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News