సాహిత్యానికి సంబంధించినంత వరకూ బేతవోలు రామబ్రహ్మం స్పృశించని అంశం లేదు. ఆయన సంస్కృతాంధ్ర పండితుడు, పరిశోధకుడు, అభ్యుదయవాది, విమర్శ కుడు, అవధాని, వ్యాఖ్యాత, అధ్యాపకుడు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో 1948 జూన్ 10న జన్మించిన రామబ్రహ్మం చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగిన వ్యక్తి. జీవితం ఏమంత సాఫీగా, హ్యాపీగా సాగిపోలేదు. కొవ్వూరులోని సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎం.ఎ చేశారు. ఆ తర్వాత ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత, ప్రాకృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పిహెచ్.డి చేశారు. మొదట్లో గుంటూరులోని కె.వి.కె సంస్కృత కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేసిన రామబ్రహ్మం ఆ తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేరారు. ఆయన బోధించే పాఠాలు విద్యార్థులనే కాక, అధ్యాపకులను సైతం ఎంతగానో ఆకట్టుకునేవి.
ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఒకసారి నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించి నప్పుడు బేతవోలు రామబ్రహ్మం వాక్పటిమను గమనించి ఆయనను తాము త్వరలో స్థాపించబోయే శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. ఈ విశ్వవిద్యాలయంలో భాగంగా రాజమండ్రి వద్ద బొమ్మూరులో ఏర్పాటు చేసిన సాహిత్య పీఠంలో ఆయన బేతవోలును నియమించారు. అక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పనలోనూ, పరిశోధనల విషయంలోనూ ఆయన పెను మార్పులు తీసుకు వచ్చి, భావి తరాలకు మార్గదర్శకత్వం వహించారు. హైదరాబాద్ లో ప్రారంభమైన ‘వాఙ్మయి’ అనే త్రైమాసిక పత్రికను బొమ్మూరు తీసుకువెళ్లి, ఒక విశిష్టమైన సాహిత్య పత్రికగా అభివృద్ధి చేశారు. దాదాపు పాతిక, ముప్ఫయి మందికి ఆయన పర్యవేక్షణలో పిహెచ్.డిలు ప్రదానం చేశారు. 2005లో హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా పనిచేశారు.
ఆయన 18 ఏళ్ల నుంచే అవధానాలు చేసేవారు. దాదాపు పాతిక సంవత్సరాల కాలంలో 300లకు పైగా అవధానాలు చేసి తెలుగు ప్రజల మనస్సులను దోచుకున్నారు. ఎన్నో అవధాన సభలకు సంచాలకత్వం కూడా నిర్వహించారు. కొవ్వూరు సంస్కృత కళాశాల నుంచి వెలువడే గౌతమి అనే పత్రికకు ఏడాదిపాటు సంపాదకుడుగా వ్యవహరించి, అంత వరకూ గ్రాంథిక భాషలో నడిచిన ఈ పత్రికను పూర్తిగా వ్యావహారికంలోకి మార్చేశారు. ఆ పత్రికలో ఆయన జయసింహ చరిత్ర పేరుతో సరళ పద్యాలతో కల్పిత కథా ప్రబంధం రాశారు. ఆయనకు పద్యాలంటే అమిత ప్రీతి. పద్య రచనకు అనేక విధాలుగా ప్రోత్సాహం కల్పించిన బేతవోలు రామబ్రహ్మం అనేక పద్య కవితా సదస్సులను కూడా నిర్వహించడం జరిగింది. దేవీ భాగవతం వచన రచనకు ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. బౌద్ధ మతానికి సంబంధించిన కథలతో ఆయన ‘సౌందరనందం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. దాన్ని అప్పటి ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, యూజీసీ వైస్ చైర్మన్ సచ్చిదానంద మూర్తితో పాటు భూటాన్ బౌద్ధ పీఠాధిపతి కూడా వీక్షించారు. భూటాన్ బౌద్ధ పీఠం ప్రత్యేక ఆహ్వానంపై ఆయన భూటాన్ లో కూడా దీన్ని ప్రదర్శించడం జరిగింది. నాటకం పూర్తయిన తర్వాత ఆయన చేతిలోని భిక్షా పాత్రను వారు డాలర్లతో నింపి ఆయనకు బహూకరించడం జరిగింది. తొలి రోజుల్లో నాస్తిక భావాలున్న ఈయనకు లక్ష్మణ యతీంద్రులు దిగ్దర్శనం చేశారు. కేంద్ర భాషా సమ్మాన్ పురస్కారాన్ని కూడా అందుకున్న బేతవోలు రామబ్రహ్మం 40కి పైగా గ్రంథాలు రాశారు.
Bethavolu Ramabramham: సాహిత్య కౌముది బేతవోలు రామబ్రహ్మం
నాస్తికుడు ఆస్తికుడై చేసిన గొప్ప రచనలు