Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్General elections: ఎన్నికల సమయాన్ని పెంచక తప్పదా?

General elections: ఎన్నికల సమయాన్ని పెంచక తప్పదా?

ఇన్ని రోజులపాటు ఎన్నికలా?

ఎన్నికల కమిషన్‌ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించడంతో దేశమంతా ఎన్నికల సందడి సంతరించుకుంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1వరకు ఏడు దశల్లో ఎన్నికలుజరపడానికి ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అంటే సుమారు రెండున్నర నెలల పాటు దేశంలో ఎన్నికల హడావిడి, ఆర్భాటం తప్పవన్న మాట. ఎన్నికలనే సరికి రాజకీయాలు, పాలన మాత్రమే కాదు, అనేక అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. పార్టీల ప్రచారాలు కూడా సాధారణంగా జరగవు. ప్రసంగాలు, ప్రకటనలు, ప్రదర్శనలు, నాటకాలు, నాటకీయ పరిణామాలు, బ్యానర్లు, బ్యారికేడ్లు, హోర్డింగులు వగైరాలన్నీ ఎన్నో మిళితమై ఎంతగానో రక్తి కట్టిస్తాయి. పార్టీలు, సిద్ధాంతాలు, ఉద్దేశాలు, ఆశయాలు, ఆర్భాటాలు అందరికీ తెలిసిన విషయాలే. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ అసలు రంగులు, అసలు స్వభావాలు వెలుగులోకి వస్తుంటాయి.
అయితే, ఎన్నికలను ఈసారి ఇంత సుదీర్ఘకాలం నిర్వహించడం అరుదైన విశేషమే. దీని ప్రభావం ప్రచారం మీదే కాకుండా ఫలితాలు మీద కూడా పడే అవకాశం ఉంది. గత ఎన్నికలు కూడా 36 రోజుల పాటు జరిగాయి. ఇవే ఎక్కువ కాలం జరిగాయని అనుకుంటుం డగా ఈసారి ఎన్నికలు ఏకంగా 46 రోజుల పాటు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ 46 రోజుల ఎన్నికల కోసం పార్టీల ప్రచారం ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. వాస్తవానికి అత్యధికంగా వనరులు ఉన్న పార్టీలకు ఈ సుదీర్ఘ కాలపు ఎన్నికలు సానుకూల అవకాశాలు కల్పిస్తాయి. అత్యల్ప వనరులు కలిగిన పార్టీలకు, అంటే చిన్న పార్టీలకు ఇవి చాలా కష్ట నష్టాలు తెచ్చిపెడతాయి. అంటే, పార్టీల మధ్య ఉండాల్సిన సమానావకాశాలు దెబ్బ తింటాయి. పైగా ఇప్పటికే వేసవి ప్రవేశించేసింది. ఫలితంగా వడగాడ్పులు, వేడిగాలుల మధ్య ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇంత వేడి వాతావరణంలో ప్రచారం నిర్వహించడం ఏ పార్టీకైనా, ఏ అభ్యర్థికైనా కష్టమే. ఇందులో చిన్న పార్టీలైతే మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఎన్నికలు సజావుగా, సురక్షితంగా జరగడానికి భద్రతా దళాలను తరలించాల్సి వస్తుందని, అందువల్ల ఎక్కువ కాలం పాటు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఎక్కువ కాలం పాటు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల వ్యయం కూడా తడిసి మోపెడవుతుంది. ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చినందువల్ల ఎన్నికల కమిషన్‌ ఈ నిబంధనావళిని పార్టీలేవీ ఉల్లంఘించకుండా చూడాల్సి ఉంటుంది. అంతేకాక, సుమారు రెండున్నర నెలల పాటు పాలనా యంత్రాంగం స్తంభించిపోవడమంటే మాటలు కాదు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరో రాష్ట్రంలో పాలన స్తంభించిపోవడం ఏమంత సమంజసం కాదు. ఓటర్లు, అభ్యర్థులు ఎక్కువ కాలం పాటు ఎన్నికల ఫలితాల కోసం సహనంతో ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాల కోసం కొన్ని రాష్ట్రాల్లో అయితే అనేక వారాల పాటు ఎదురు చూడాల్సి వస్తుంది.
నిజానికి, భారతదేశంలో ఎన్నికల నిర్వహణ సమయం రాను రానూ పెరుగుతూ వస్తోంది. 2004లో 21 రోజుల పాటు ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2009లో 28 రోజుల పాటు ఎన్నికలు నిర్వహించారు. 2014లో 37 రోజుల పాటు, 2019లో 36 రోజుల పాటు ఎన్నికలను జరపవలసి వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఇందుకు 46 రోజులు పడుతోంది. ఎక్కువ కాలం ఎన్నికలు నిర్వహించడ మనేది ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించడానికి ఒక అవరోధంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు అత్యధిక సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంటుంది. భౌతిక, శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక అంశాలు ఈ మానవ వనరులను ఎంతగానో ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. పైగా, ఇదంతా వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉన్న సమయంలో జరగాల్సి ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్‌ స్వేచ్ఛగా, సజావుగా, సురక్షి తంగా ఎన్నికలను నిర్వహించడానికి పాటుపడాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల కార్యక్రమాన్ని మరింత కుదిస్తే సమంజసంగా ఉండేది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News