Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Medaram Jatara: అనిర్వచనీయమైన అపురూప ఘట్టం మేడారం జాతర

Medaram Jatara: అనిర్వచనీయమైన అపురూప ఘట్టం మేడారం జాతర

సృష్టికి మూలం జీవం జీవనానికి మూలం వనం. మన జాతి కోసం పోరాడి వారి ప్రాణా లనే ఫణంగా పెట్టి ప్రజల యోగక్షేమాలే ఊపిరిగా బ్రతికి ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన మహనీయులను గౌరవించడం మన సాంప్రదాయం. గిరిపుత్రుల నిష్కల్మ షత్వానికి అసమాన పోరాట పటిమకు ప్రతిరూపం సమ్మక్క సారలమ్మ మేడారం జాతర.
మనం ఇప్పటి వరకు ఎన్నో జాతరలను చూసి ఉంటాం కానీ ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఇది మన తెలంగాణలోని ఒకప్పటి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఇప్పుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరను చూడ్డానికి రెండు కళ్ళు చాలవు.
అది కాకతీయుల ప్రతాపరుద్రుని పరిపాలనా కాలం. కప్పం చెల్లించలేదని సామంతరాజ్యంపై ఆగ్రహంతో యుద్ధాన్ని ప్రకటించిన ఆ సమయంలో కాకతీయ రాచరి కపు అహంకారాన్ని ఎదిరించి తనను నమ్మిన ప్రజల కోసం జాతి మనగల కోసం రణం చేసి వీర మరణం పొందారు. ప్రాణ త్యాగం చేసిన ఆడపడుచులను మాతృ మూర్తులుగా భావించి భక్తజన కోటి ఆరాధించే పండుగ అరుదైన జాతర మేడారం.
ఒకప్పుడు దండకారణ్యంలో మేడారం అనే కోయ గూడెం ఉండేది. కోయలు వేటకు వెళ్ళగా అక్కడ పెద్ద పులుల మధ్య కేరింతలు కొడుతూ పసిపాప కనిపించింది. అది చూసిన కోయలు అదృష్టంగా భావించి ఏం చేయాలో పాలు పోక కళ్ళు మూసుకొని కొండ దేవరను ప్రార్థించి కనులు తెరిచి చూడగా పులులు మాయమై పసిబిడ్డ ఒం టరిగా బోసి నవ్వులతో కనిపించింది. వెంటనే ఆ బిడ్డను తమ గూడానికి తీసుకొచ్చి వెదురు కర్రలతో పందిళ్లు వేసి గద్దె కట్టి దానిమీద కూర్చుండబెట్టి కొండ దేవత కానుకగా సాదుకున్నారు. అడవిలో పెద్ద పులులు అప్పుడప్పుడు వచ్చి ఆ చిన్నారితో ఆడుకోవడం చూసి గూడెం వాసులు ఆశ్చర్య పోయేవారు. పెరిగి పెద్దయిన తర్వాత కొండ దేవత అవతా రంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు గూడెం లో ఎవరికి ఏ జబ్బు చేసినా సమ్మక్క చేతి మూలిక వైద్యం ఇస్తే ఇట్టే తగ్గిపోయేది.
యుక్త వయసు రాగానే పొలవాసా రాజ్యాన్ని (ఇప్పటి జగిత్యాల) పాలించే మేడారాజు మేనల్లుడు అయిన పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత ఈ దంపతులు మేడారాన్ని సామంతరాజ్యంగా పాలించ సాగారు. కాలక్రమేనా సమ్మక్క పగిడిద్దరాజులకు సార లమ్మ, నాగులమ్మ, జంపన్నత ముగ్గురు సంతానం కలి గారు. కొంతకాలం వీరి జీవితం సజావుగానే సాగింది.ఆ తర్వాత వచ్చిన వరుస కరువుల కారణంగా కాకతీయ రాజులకు కప్పం చెల్లించలేకపోయారు. ఆగ్రహించిన కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు మేడారం పై యుద్ధం ప్రకటించాడు. జంపన్న ఉత్తరం దిక్కు సంపెంగ వాగు సమీపము నుండి గోవిందరాజు దక్షిణ దిక్కు నుండి పగి డిద్దరాజు కాకతీయ సైన్యానికి ఎదురుగా వెళ్లి వారిని ఎదు ర్కొన్నారు. లక్షల్లో ఉన్న కాకతీయ సైన్యంతో భీకరంగా పోరు చేయగా కాకతీయ సైన్యం రెండుగా చీలిపోయింది. కాకతీయ సైన్యం దాటికి నిలువలేక కోయలు ప్రాణ త్యాగం చేశారు ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడి పగిడి ద్దరాజు తుది శ్వాస విడిచాడు. తుడుములు మోగినై లాడా యి ఇంకా ఊపందుకుంది. దక్షిణ దిక్కు నుండి గోవింద రాజు పడమటిదిక్కు నుండి మేడరాజు ముకుమ్మడిగా దాడి చేసి రణంలో వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో వీరమరణం పొందాడు. అప్పటినుండి సంపెంగ వాగును జంపన్న వాగు అని పిలవడం జరిగింది. జంపన్న రక్తం ఏరులై పారిన సంపెంగ వాగు నీరు ఇప్పటికి ఎర్ర గానే ఉంటుందని భక్తుల నమ్మిక. తమ వారి మరణ వార్త విని సమ్మక్క సారలమ్మ కత్తి చేత బట్టి యుద్ధంలో దూకారు.
సమ్మక్క యుద్ధం చేస్తూ కత్తి గిరగిరా తిప్పుతూ ఉంటే కాకతీయ సైన్యం తలలన్నీ కొబ్బరికాయల వలె నేలరాలా యట. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి ప్రతాప రుద్రుడికి గుండెల్లో గుబులు పుట్టింది. సమ్మక్క రణంలో ఈ విధంగా కత్తి జులిపిస్తే ఈ నేల మీద కాకతీయుల అస్తిత్వమే ఉండదని తలచి ముంచుకొస్తున్న ప్రళయానికి అడ్డుకట్ట వేయాలని సైన్యానికి దొంగ దెబ్బ తీయమని ఆదేశాలు జారీ చేశాడు ప్రతాపరుద్రుడు.యుద్ధ నియమా లను తుంగలో తొక్కి వెనక నుండి సారలమ్మను కత్తితో పొడిచారు సారలమ్మ అక్కడికక్కడే ప్రాణం విడిచింది. కాకతీయుల సైనికులు బల్లెంతో సమ్మక్కను వెన్నుపోటు పొడిచారు సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమిని నిష్క్రమిస్తూ ఈశాన్యం వైపున ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. సమ్మక్కని వెతుక్కుంటూ వెళ్లిన కోయలకు ఒక పెద్ద నమిలినార చెట్టు కింద కుంకుమ భరిణ కనిపిం చింది. ఆ కుంకుమ భరణి సమ్మక్కకు గుర్తుగా భావించి ఆమె రాక కోసం గిరిజనులంతా ఎదురు చూశారు.
యుద్ధం ముగిసింది కాకతీయుల ఇలవేల్పు ఏకవీర దేవి ప్రతాపరుద్రునికి కలలో కనిపించి మేడారంలో జరిగిన సమ్మక్క మరణానికి చింతించి కంటతడి పెట్టిం దట. ప్రతాపరుదుడు పశ్చాత్తాపంతో మేడారం వెళ్లి ప్రజ లకు క్షమాపణ చెప్పి మేడారాన్ని స్వతంత్ర రాజ్యాంగ ప్రకటించాడు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మాగ శుద్ధ పౌర్ణమి సమ్మక్క అదృష్టమైన రోజున ముత్తైదువులందరూ సమ్మక్క జాతర జరుపుకోవాలని ఆదేశించాడు. అప్పటినుండి కుం కుమ భరిణినే సమ్మక్కగా భావించి జాతర రుపుకుంటు న్నారు గిరి పుత్రులు. నాలుగు రోజులపాటు ఈ జాతర ఎంతో వైభవంగా కోలాహలంగా జరుగుతుంది.
జాతరకు వారం రోజుల ముందుగానే యువకు లంతా ప్రాతఃకాలమున మూడు గంటలకు లేచి శుచి శుభ్రంగా మేడారం దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కంకవణా నికి పూజలు చేసి సూర్యోదయాని కల్లా వెదురు కంకణు గద్దెల మీదికి తెచ్చి పందిర్లు వేస్తారు దీన్నే మండమెలిగే పండుగ అంటారు. మొదటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పూజలు చేసి కన్నేపల్లి నుండి సారమ్మ ను, కొండాయి నుండి గోవిందరాజును, పూనుగుండ్ల నుండి పగిడిద్దరాజును మేడారం గద్దమీదికి తరలిస్తారు. రెండవ రోజు సమ్మక్క రాకకు గుర్తుగా అనేక జంతువులను బలి ఇస్తారు మధ్యాహ్నం (పూజారులు) వడ్డేలు ప్రత్యేక పూజలు జరిపి చిలకలగుట్ట పైన కుంకుమ భరిణె రూపం లో ఉన్న ఆ తల్లి రూపాన్ని తీసుకొని తన్మయత్వంతో పరుగు పరుగున చిలకలగుట్ట నుండి మేడారం వైపు బయలుదేరుతారు. అమ్మను తెచ్చేటప్పుడు వడ్డెల కాళ్ళ మీద పడితే కోరికలు తీరి జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మిక. సమ్మక్క రాకను సాదరంగా ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతారు. మూడవరోజు సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజులు గోవిందరాజులు కొలువై ఉండగా భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ఆదివాసీలు సమ్మక్క సారలమ్మకు చెల్లించే మొక్కులు మిగతా దెవుళ్ల మొక్కుల కంటే భిన్నంగా ఉంటాయి. వీరికి ఉప్పు తీపి అంటే చాలా ఇష్టం ఇది వీరికి చాలా విలువైన వస్తువులు అమ్మవారికి ఇప్ప సారను సమ ర్పించి కోళ్లు యాటలు బలిచ్చి బెల్లం నైవేద్యంగా సమర్పి స్తారు. దీన్నే బంగారం అంటారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు పేరులో పగిడి అంటే బంగారం అని అర్థం. అందుకే సమ్మక్కకు బంగారం అంటే ఇష్టం అని అమ్మ వారికి బంగారం బుట్టలు సమర్పిస్తారు. వనదేవతలను వారి ఇంటి ఆడపడుచు గా భావించి పసుపు కుంకుమలు చీర సారెలు సమర్పిస్తారు. భక్తుల మొక్కుల్లో చాలా ఆసక్తికరమైనది ఎదుర్కోళ్ల మొక్కు. కోరికలు తీరిన భక్తులు అమ్మల గద్దెల ముందు కోళ్లను ఎగరేస్తారు. బియ్యం లో పసుపు కలిపి ఒక బట్టలో కట్టి నడుముకు చుట్టుకుని వచ్చి జాతరలో అమ్మలకు సమర్పిస్తారు. ఇప్పుడు భక్తులు కోరికలు తీరితే తలనీలాలు కూడా సమర్పిస్తున్నారు ఇంతకుముందు ఈ ఆచారం లేకుండే. సంతానం లేని వారు తడిబట్ట స్నానం చేసి పొర్లు దండాలు పెడతారు. సంతానం కలిగిన వాళ్లు వెండి తొట్టెలు కట్టి మొక్కలు చెల్లిస్తారు. పట్టణ ప్రాంత భక్తులు పెరిగిన తర్వాత మొక్కలు చెల్లించడంలో కొంత మార్పు వచ్చిందని ఆది వాసీలు చెబుతున్నారు. శివశక్తుల పూనకాలతో అమ్మవారి నామస్మరణతో వనమంతా మారుమోగిపోతుంది. శివ సత్తులు జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులకు భవిష్యత్తు చెబుతారు. అమ్మలు ఏమనుకుంటున్నారో కూడా వివరిస్తారు. సమ్మక్కకు సారలమ్మకు జంపన్నకు పగిడిద్దరాజు శివసత్తులు వేరువేరుగా ఉంటారు. మేడారం లో చిలకలగుట్ట వద్ద జలకంబావి ఉంది ఆ జలకం బావిలోనే సమ్మక్క స్నానం చేసేదని ఆ నీరు ఎంతో మహి మాన్వితమైందని, పూనకాలతో ఊగి పోతున్న భక్తులపై ఆ నీటిని చల్లి శాంతింప చేస్తారు ఆ నీటిని కేవలం సొరకాయ బుర్రలో మాత్రమే తెస్తారట. నాల్గవ రోజు సాయంత్రం మొక్కులు అందుకున్న సమ్మక్కను చిలకలగుట్టకు, సారల మ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగడిద్ద రాజును పూనుగొండకు కాలినడకన పోలీసుల కట్టుదిట్ట మైన ఏర్పాట్ల మధ్య వన ప్రవేశం చేపిస్తారు. ఈ నాలుగవ రోజుతో జాతర ముగుస్తుంది. జాతర ముగిసిన తర్వాత 16 రోజులకు తిరుగువారం పండుగ చేస్తారు. అమ్మ వార్లకు కోళ్లు యాటలు ఎత్తు బంగారాలు సమర్పించి మొక్కలు తీర్చుకుంటారు.
ఇంత విశిష్టమైన జాతర కాబట్టే 1944లోనే నిజాం ప్రభుత్వం ఈ వేడుకను జరిపినట్లు చరిత్రకారులు చెబుతు న్నారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకొని రాష్ట్ర పండుగ గుర్తించింది.ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ జాతరకు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరింది. జాతీయ హోదా లభిస్తే కుంభమేళా లాగానే యునెస్కో గుర్తింపు తో పాటు అంతర్జాతీయ గుర్తింపు లభించాలని ఆశిద్దాం.
– కొమ్మాల సంధ్య
తెలుగు అధ్యాపకురాలు
9154068272

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News