కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లడమంటే ఆర్థిక పరిస్థితి తారుమారు కావడమనే చాలా మంది భావిస్తుంటారు. కార్పొరేట్ ఆస్పత్రుల మీద నమ్మకం లేకుండానే, విముఖం గానే చికిత్స కోసం వాటి దగ్గరకు వెళ్లాల్సి వస్తుంటుంది. ప్రజల ఆవేదనను, ఆక్రోశాలు, ఆందోళనలు ప్రభుత్వాలకు పట్టడం లేదు. న్యాయస్థానాలు ఎన్ని సార్లు చెప్పినా పాలకుల ధోరణిలో మార్పు రావడం లేదు. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు మళ్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అది ఎంత వరకూ పనిచేస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అవసరమైన వారికి ఆస్పత్రి ఫీజులు అందుబాటులో ఉండే విధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (కేంద్ర ప్రభుత్వం) నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల క్రితం రూపొందించి అమలు చేస్తోంది. వివిధ వైద్య చికిత్సలు, పద్ధతులు, ప్రక్రియ లకు నిర్దిష్ట ఫీజులను నిర్ధారించాలని, ఫీజులను నిర్ణయించే ముందు ప్రజల జీవన ప్రమా ణాలను, ఇతర స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రం అప్పట్లో ఈ నిబంధనలను రూపొందించడం జరిగింది. అయితే, దేశంలోని కార్పొరేట్ ఆస్పత్రులేవీ ఈ నిబంధనలను పాటించడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్సా సౌకర్యాల విషయంలో ఫీజులు ఒక్కొక్క విధంగా ఉంటు న్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు తమకు తోచిన విధంగా ఫీజులు వసూలు చేయడం జరుగు తోంది. అంతేకాదు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు చెల్లించాల్సిన ఫీజులు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో ఉండడం లేదనే విషయం కూడా అందరికీ తెలిసిందే.
కాగా, ఈ నియమ నిబంధనలను అమలు చేసే విషయంలో తమకు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు కూడా అవసరమవుతాయని, తాము రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నియమ నిబంధనల విషయాన్ని తెలియజేసినప్పటికీ, వాటి నుంచి తమకు ఎటు వంటి స్పందనా రాలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వాలు సరైన సమయంలో, సరైన విధంగా స్పందించని పక్షంలో తాము కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి.జి.హె.ఎస్) లో సూచించిన విధంగా ఆ ఫీజులనే ప్రామాణికం చేయడం జరుగుతుందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ ప్రామాణిక రేట్లను తెలియజేయడానికి వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్య దర్శుల సమావేశం ఏర్పాటు చేయాలని, ఇందుకు నెల రోజుల గడువు విధిస్తున్నా మని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది.
రోగులకు వీలుగా ఆస్పత్రుల్లో ఫీజు వ్యవస్థను ఒకదాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. మధ్యంతర చర్యగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో పేర్కొన్న ప్రామాణిక ఫీజు లను అమలు చేయాలని కూడా ఆ పిల్‌లో కోరడం జరిగింది. దేశంలో ఆస్పత్రి ఖర్చులను, వైద్య ఖర్చులను బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యయం నానాటికీ పెరిగిపోతోంది. 2023లో ఇది 9.6 శాతం వరకూ పెరగ్గా, 2024 నాటికి ఇది 11 శాతాన్ని దాటిపోయింది. దేశంలోని ద్రవ్యో ల్బణ రేటు కంటే ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణ రేటు బాగా ఎక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. దేశంలో మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యయంలో ప్రజలు 47 శాతం వరకూ చెల్లించడం జరుగుతోంది. ఆరోగ్య బీమా అతి తక్కువ స్థాయిలో అమలు జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కూడా లోపభూయిష్ఠంగా ఉన్నందువల్ల, అత్యధిక సంఖ్యాక ప్రజలకు ఇది ఉపయోగకరంగా లేదు.
ఇటీవల జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థ దేశంలో పెద్ద ఎత్తున ఒక నగదురహిత ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులకూ వర్తిస్తుంది. అయితే, దేశంలో ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో విధమైన ఫీజుల వ్యవస్థ ఉన్నందువల్ల ఆస్పత్రులు ఈ బీమాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఫలితంగా ఈ పథకం అమలు కాకుండా నిలిచిపోయింది. దేశంలో ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ రంగం శక్తిమంతంగా వేళ్లు పాదుకు పోయి ఉంది. ఈ రంగంలో స్వార్థ ప్రయోజనాలే రాజ్యమేలుతున్నాయి. ఈ రంగానికి అటు రాజకీయ పార్టీల తోనూ, ఇటు ప్రభుత్వాలతోనూ బలమైన సంబంధ బాంధవ్యాలున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులకు వైద్య విద్యతోనూ, ఆరోగ్య సంరక్షణ రంగంతోనూ ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయి. దాదాపు 14 ఏళ్ల క్రితం ఆస్పత్రుల ఫీజుల విషయంలో రూపొందించిన నిబంధనలు అమలు కాకపోవడం, ఈ విషయంలో ప్రభుత్వాలు తమ నిస్సహాయతను వ్యక్తం చేయడం వగైరాలను బట్టి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ రంగం ఎంత బలీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ ఆస్పత్రులోని ఆధునిక ప్రాథమిక సదుపాయాలకు, ఆధు నిక చికిత్స, రోగ నిర్ధారణ సౌకర్యాలకు తాము భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. అయితే, ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు ఎంత వరకూ అమలు జరుగుతాయన్నది కూడా సందేహమే.
SC on CGHS bills: వైద్య వ్యయంపై తీవ్ర ఆందోళన
ప్రజారోగ్యంపై కేంద్రానికి కీలక ఆదేశాలిచ్చిన సుప్రీం