Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్Climate change: ప్రమాదం అంచులో ప్రపంచ దేశాలు

Climate change: ప్రమాదం అంచులో ప్రపంచ దేశాలు

మామూలు స్థితికి అంటే అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు దారుణంగా దెబ్బతినే సమయం ఎంతో దూరంలో లేదు. సమీప భవిష్యత్తులో చాలా దేశాలు ప్రపంచ పటం నుంచి మటు మాయం కాబోతున్నాయి. గత మంగళవారం ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యు.ఎం.ఓ) విడుదల చేసిన ‘ప్రపంచ వాతావరణ స్థితిగతులు’ అనే నివేదిక వాతావరణ మార్పులు, వాటి పరిణామాలకు సంబంధించి ప్రపంచ ప్రజలను గట్టిగా హెచ్చరించింది. ప్రపంచ వాతావరణ పరిస్థితులు నానాటికీ అతి భయానకంగా, ప్రమాదకరంగా మారుతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2023 సంవత్సరం ఈ దశాబ్ద కాలంలోనే అతి వేడి సంవత్సరంగా, అతి చల్లని సంవత్సరంగా నమోదయిందని, దీన్ని బట్టి ప్రపంచ వాతావరణ పరిస్థితి ఏ విధంగా మారుతోందో అంచనా వేయవచ్చని అది పేర్కొంది. నిజానికి, 2024 సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని అది తెలిపింది. 2023లో పారిశ్రామిక దేశాల్లో ఉష్ణోగ్రత 1.45 డిగ్రీల సెల్షియస్‌ ఉందని, అది పారిశ్రామిక దేశాలకు నిర్దేశించిన 1.50 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతకు బాగా దగ్గరగా ఉందని కూడా అది తెలిపింది. ప్యారిస్‌ వాతావరణ సదస్సులో ఈ 1.50 డిగ్రీల సెల్షియస్‌ను నిర్ధారించడం జరిగింది. వివిధ దేశాలు నిర్దేశించుకున్న వాతావరణ పరిమితిని వాతావరణ మార్పులు మించిపోతున్నాయని, ఏ విధంగా చూసినా వాతావరణానికి సంబంధించినంత వరకూ ప్రపంచ దేశాలన్నీ ప్రమాదం అంచున నిలబడి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.
వాతావరణంలోకి అత్యంత ప్రమాదకరమైన విషవాయువులు విడుదల కావడం ఎక్కువైందని, భూమి పైనా, జలాల పైనా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని, సముద్రాల్లో కూడా మంచు గడ్డలు కరిగిపోతున్నాయని ఈ నివేదిక తెలిపింది. సముద్ర మట్టాలకు సంబంధించి గత 30 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయగా, గత మూడేళ్ల కాలంలో సముద్ర మట్టాలు బాగా పెరుగు తున్నట్టు, ఇవి ప్రమాదకర స్థాయికి చేరు బకుంటున్నట్టు వెల్లడైంది. 2023 సంవత్సర అధ్యయానాన్ని బట్టి, సముద్ర జలాల మీద వేడి గాలులు ఉధృతమవుతున్నట్టు, వీటి దుష్ప్రభావం చుట్టు పక్కల దేశాల మీదే కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశం మీదా పడుతు న్నట్టు తెలిసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా హిమనదాలు అతి వేగంగా కరిగిపోతున్నాయి. స్విట్జర్లాండులోని ఆల్ప్‌ పర్వతాల వద్ద ఉన్న హిమనదాలు సైతం గత రెండేళ్ల కాలంలో పది శాతం వరకూ కరిగిపోవడం జరిగింది.
అంతేకాక, అంటార్కిటికా వద్ద కూడా మంచు సముద్రం, మంచు పర్వతాలు అతి వేగంగా కరిగిపోతున్నాయి. ఏటా 15 కోట్ల టన్నుల మంచు గడ్డలు కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ, అతివృష్టి, అనావృష్టి, ఉష్ణోగ్రతల భారీ పెరుగుదల, భారీ తగ్గుదల, వరదలు, కరువులు సర్వ సాధారణ పరిణా మాలై పోతున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల దాదాపు ప్రతి దేశంలోనూ భారీగా వలసలు, జీవ వైవిధ్యం, ఆహార భద్రత క్షీణత, సరికొత్త వ్యాధులు రానురానూ పెరిగిపోతు న్నాయి. సాధారణంగా మానవ జీవితం వాతావరణం మీదా, భూ భౌగోళిక పరిస్థితుల మీదా, పర్యావరణం మీదా, భూమి స్థితిగతుల మీదా ఆధారపడి ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా జీవితాలు మారిపోతాయి. స్థితిగతులు మారిపోతాయి. ఈ భూగోళం మీద జీవించడం అన్నది దుర్భరం అయి పోతుంది. హిమనదాలు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగడం, వాతావరణంలో అతి వేగంగా మార్పులు చోటు చేసుకోవడం వంటివి మున్ముందు మరింత ఎక్కువగా సంభవించబోతున్నాయి. ఇప్పటికే ఇవి మానవ జీవితాల్లో ఉత్పాతాలు సృష్టించడం జరుగుతోంది. ఒకసారి వాతావరణం మారిపోవడం ప్రారంభమైతే, దీన్ని మామూలు స్థితికి తీసుకు రావడమన్నది అసాధ్యాల్లోకెల్లా అసాధ్యమైన విషయం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు.
వాతావరణంలో వస్తున్న మార్పుల మీదా, వాటి ద్వారా చోటు చేసుకోబోయే పరిణా మాల మీదా అనేక అంతర్జాతీయ సదస్సులు, చర్చలు, గోష్టులు జరిగాయి. అనేక వాగ్దానాలు, హామీలు ఇవ్వడం జరిగింది. అయితే, అందులో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ప్రపంచ పరిస్థితులు రానురానూ దిగజారుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తల ప్రమాద సంకేతాలను ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రపంచ వాతావరణ సంస్థ తన నివేదికలో వాతావరణ మార్పులకు సంబం ధించిన ప్రమాదాలను వివరంగా తెలియజేయడంతో పాటు, కొన్ని ఆశాకిరణాలను కూడా ప్రపంచ దేశాల ముందుంచింది. రిన్యూవబుల్‌ ఎనర్జీ ఉత్పత్తి వల్ల పరిస్థితిలో కొంత సానుకూల మార్పును తీసుకు రావచ్చని, ఈ విషయంలో కొన్ని దేశాలు తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే కొంత మార్పును తీసుకు వచ్చాయని అది తెలిపింది. వాతావరణ మార్పులను నిలువరించడానికి మనిషి ఏ కొద్ది ప్రయత్నం చేసినా అది తప్పకుండా సత్ఫలితాలనిస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News