మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి పచ్చని కుటుంబాల్లో అశాంతిని నెలకొల్పుకోవద్దని సీఐ రవికుమార్ ఎస్ఐ జీనత్ కుమార్ లు అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గార్ల మండల పరిధిలోని చిన్న బంజర గ్రామంలో రాత్రి జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులతో సైబర్ నేరాలు మూఢనమ్మకాలు రోడ్డు భద్రత గుడుంబా నియంత్రణ, గంజాయి నిర్మూలనపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేలా పాటలు, నాటకాల ద్వారా మూఢనమ్మకాలను పారద్రోలుతూ నాటికల ద్వారా కళ్లకు కట్టినట్టు ప్రదర్శించి వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ ఎస్ఐ జీనత్ కుమార్ లు మాట్లాడుతూ.. గ్రామంలో మంత్రాల నెపంతో మూఢనమ్మకాలను నమ్మి జీవితాలను దుర్బరం చేసుకోవద్దన్నారు. పిల్లలు చిన్నతనం నుంచే గుట్కాలకు మద్యానికి బానిసలు అవుతున్నారని, ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ తమ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను పోగొట్టుకుంటున్నారని యువత మద్యం మత్తుకు చిత్తుకాకుండా గ్రామానికి ఆదర్శంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.