పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు కూడా వాయిదా బాట పట్టక తప్పలేదు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేసి, దర్యాప్తు జరపించాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టడంతో రాజ్యసభ, లోక్ సభ స్థంభించిపోయాయి. ఎటువంటి సభా కార్యకలాపాలను తాము కొనసాగనివ్వమని 16 ప్రతిపక్ష పార్టీలు భీష్మించుకున్నాయి. దీంతో ఈరోజు మధ్యహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
నినాదాలు, నిరనసలతో ప్రతిపక్షాలు ఉభయ సభలను దద్దరిల్లేలా చేస్తూ, సభాపతి పోడియంను చుట్టిముట్టి గందరగోళం సృష్టించాయి. అదానీ అంశంపై రెండు సభల్లోనూ లోతైన చర్చ జరగాలని, దర్యాప్తుకు ఆదేశించాలని వీరు పట్టుబడుతున్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈరోజు ఉభయసభల్లో చర్చ ప్రారంభంకావాల్సి ఉండగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అదానీ గ్రూప్ ఆగడాలపై విచారణ జరిపించేవరకూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటామని విపక్షాలు సర్కారుకు అల్టిమేటం ఇచ్చాయి.
ఈమేరకు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో జరిగిన భేటీలో.. భారీ వ్యూహాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధంచేసాయి. ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, బీఆర్ఎస్, జేడీయూ, సీపీఐఎం, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, కేరళా కాంగ్రెస్ (జోస్ మణి), జేఎంఎం, ఆర్ఎస్పీ, ఆర్ఎల్డీ, ఏఏపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, శివసేన పార్టీలు పాల్గొన్నాయి.