సుమారు మూడేళ్ల విరామం తర్వాత బౌద్ధ మత గురువు దలైలామా ఇటీవల బుద్ధగయను సందర్శించడం దేశంలో మళ్లీ బౌద్ధమతం వైపు అందరి దృష్టి మళ్లేటట్టు చేసింది. ఈ సందర్భాన్ని ఈ టిబెట్ బౌద్ధ గురువు చైనా మీద మాటల దాడికి చక్కగా ఉపయోగించుకున్నారు. ఆయన ఇంత వాడిగా, వేడిగా దాడి చేయడం మునుపెన్నడూ జరగలేదు. బౌద్ధ మతాన్ని నాశనం చేయడానికి చైనా కంకణం కట్టుకుందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అయితే, ఆయన తీరును చైనా మరో విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. భారత్ మళ్లీ బౌద్ధాన్ని అడ్డం పెట్టుకుని తమ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తోందని అది భావించవచ్చు.
బౌద్ధ మతానికి సంబంధించినంత వరకు బౌద్ధులు నాలుగు ప్రాంతాలను అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా పరిగణిస్తారు. అందులో మహాబోధి ఆలయం ఉన్న బుద్ధ గయ కూడా ఒకటి. సాధారణంగా ప్రపంచంలోని ప్రతి బౌద్ధ మతస్థుడూ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకుంటాడు. ఈ నాలుగు పరమ పవిత్ర క్షేత్రాలలో కూడా బుద్ధ గయకు మరింత ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే ఇక్కడే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందడం జరిగింది. మిగిలిన మూడు ప్రాంతాలు నేపాల్‌లోని లుంబిని, కుశీనగర్, సారనాథ్. ఇందులో లుంబినిలో ఆయన జన్మించారు. కుశీనగర్లో ఆయన మహా పరినిర్వాణం చెందారు. సారనాథ్ ఆయన మొదటి సారిగా ప్రవచనమివ్వడం జరిగింది. భారతదేశానికి బౌద్ధులతో పాటు ఏ పర్యాటకుడు వచ్చినా బుద్ధగయను సందర్శించకుండా ఉండరు. బుద్ధ గయను సందర్శించిన తర్వాతే బౌద్ధులు ఇతర మూడు క్షేత్రాలకు వెళ్లడం జరుగు తుంటుంది.
నిజానికి, బుద్ధ గయ కేంద్రంగా ఈ నాలుగు క్షేత్రాలను సందర్శించడానికి ఒక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయడం, ఈ నాలుగు క్షేత్రాలను ఆధునిక స్థాయిలో అత్యుత్తమ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాసియాలోని ఈ నాలుగు బౌద్ధ మత కేంద్రాలను ఏటా లక్షలాది మంది బౌద్ధులు సందర్శించడానికి అవకాశం ఉన్నప్పటికీ, 0.005 శాతం మంది బౌద్ధులు కూడా వీటిని సందర్శించడం లేదని 2017లో ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో బౌద్ధ మతపరంగా ఈ ప్రాంతాలకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సుమారు అయిదు కోట్ల మంది బౌద్ధ మతస్థులు ఈ ప్రాంతాలను సందర్శించాలని కోరుకుంటున్నప్పటికీ, ఈ నాలుగు ప్రాంతాల మధ్య ఒక సర్క్యూట్‌ను ఇంత వరకూ ఏర్పాటు చేయకపోవడం, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయక పోవడం విచిత్రంగా ఉంది అని ఈ నివేదిక వ్యాఖ్యానించింది.
ప్రాథమిక సౌకర్యాల కల్పన
నిజానికి, ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఈ నాలుగు క్షేత్రాల మధ్య ఒక వలయంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా యోచిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రాథమిక సదుపాయాల కల్పనను చేపట్టింది. ఇవి గనుక నిర్దేశిత గడువులోగా పూర్తయితే, పర్యాటకుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. బుద్ధ గయలోని మహాబోధి ఆలయంలో ఇప్పటికే పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. పర్యాటకుల సంఖ్య కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఆలయ ఆవరణంలో ప్రవచనాలు కూడా ఏర్పాటవుతున్నాయి. మయన్మార్ నుంచి తరచూ వస్తున్న బౌద్ధ బిక్షువులు ఇక్కడ మహాబోధి ఆలయంలో మయన్మార్ అభివృద్ధి కోసం, అక్కడ శాంతి ఏర్పడడం కోసం మొక్కుకోవడం కూడా జరుగుతోంది. తూర్పు, ఆగ్నేయాసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో బౌద్ధ పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. తూర్పు, ఆగ్నేయాసియా దేశాలలోనే బౌద్ధ మతం ఎక్కువగా విస్తరించి ఉంది. అంతేకాదు, ఇటీవల దలైలామా ఇక్కడికి వచ్చి ప్రవచనాలు వెలువరించినప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో ఇక్కడికి బౌద్ధ పర్యాటకులు వచ్చి ఆయన సందేశాన్ని వినడం జరిగింది.
బుద్ధ గయలో ఉన్న 52 బౌద్ధ మందిరాలలో రెండు మాత్రమే భారతీయుల అజమాయిషీలో ఉన్నాయి. మిగిలిన ఆలయాలన్నిటినీ విదేశాల్లోని బౌద్ధ భిక్షువులే నిర్వహించడం జరుగుతోంది. పైగా, విదేశీ భిక్షువులు వారి వారి ఆలయాల ఎదుట తమ దేశాలకు సంబంధించిన సైన్ బోర్డులనే ఏర్పాటు చేశారు. జపాన్ భిక్షువుల ఆలయం బయట నిప్పోన్జీ అని రాసి ఉంటుంది. బంగ్లాదేశ్ ఆలయం బయట వాట్ తాయి ఆలయమని రాసి ఉం టుంది. వియత్నాం బౌద్ధ బిక్షువు నిర్వహిస్తున్న వియత్నాం ఆలయాన్ని సందర్శించడానికి వియత్నాం నుంచి కమ్యూనిస్టు నాయకులు కూడా వస్తుంటారు. ఇక థాయిలాండ్ బౌద్ధులు ఇచ్చిన విరాళాలతో మహాబోధి ఆలయానికి బంగారంతో తాపడం వేశారు. ఇక్కడ అనేక థాయిలాండ్ జపాన్ రెస్టారెంట్లున్నాయి. భూటాన్, టిబెట్ దేశాల పలహారశాలలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చూస్తే బుద్ధ గయ ఒక అంతర్జాతీయ స్థాయి పట్టణంగా కొంత వరకూ అభివృద్ధి చెందింది.
రాష్ట్రాల సహాయ సహకారాలు
తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాల నుంచి ఈ నాలుగు ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు తప్పని సరిగా పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచే ఈ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక విధంగా బీహార్ ఆర్థిక వ్యవస్థకు, కొద్దిగా పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాంతాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయితే, ప్రయాణ కాలం సగానికి సగం తగ్గిపోతుంది. ఈ నిర్మాణాలు పూర్తి కాగానే వందే భారత్ సర్య్యూట్ రైలును కూడా ప్రారంభించడం జరుగుతుంది. అయితే, ఇవి త్వరగా పూర్తి కావడానికి పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రభుత్వాలు కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. బిమల్ తిష్య భిక్కూసో అనే బౌద్ధ బిక్షువు సారథ్యంలో ఏర్పడిన బోధిచరియా అనే బౌద్ధ ట్రస్టుకు కొద్దిగా భూమిని ఇవ్వడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. రాజర్కోట్లో ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని, ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడానికి కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహకరించాల్సి ఉంది. ఎక్కువ రోజులు ఈ బౌద్ధ క్షేత్రాలలో గడపాలనుకునేవారు కోల్‌కత్తాలో బస చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయడం వల్ల కూడా పర్యా టకులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో తిరగడానికి వీలుంటుంది.
దేశంలో బౌద్ధ క్షేత్రాలను, ఆరామాలను అభివృద్ధి చేయడం, సర్క్యూట్ రైలు మార్గం వేయడం వల్ల భారత ప్రభుత్వానికి మరొక ప్రయోజనం కూడా ఉంటుంది. తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో మరింత పటిష్ఠమైన సంబంధాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడి బౌద్ధ క్షేత్రాల నిర్వహణలో విదేశాల్లో ఉన్న బౌద్ధ భిక్షువులకు కూడా భాగస్వామ్యం కల్పించడం లేదా వారి ప్రతినిధులకు అవకాశం కల్పించడం వంటి చర్యల వల్ల సంబంధిత దేశాలతో విదేశాంగ విధానం కూడా మెరుగు పడుతుంది.
ఇక బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ద గయలో అంతర్జాతీయ స్థాయి ఉత్సవాలను ఏర్పాటు చేయడం కూడా మంచిది. అసలు దలైలామా ఈ ప్రాంతానికి రావడాన్నే ఒక అంతర్జాతీయ కార్యక్రమంగా తీర్చిదిద్దడం వల్ల దేశానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఉంటుంది. గయను వాటికన్గా మార్చడం వల్ల దేశ సార్వభౌమాధికారానికి వచ్చే ముప్పేమీ ఉండదు. కాశ్మీర్లో జి-20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తున్న సందర్భంలో భారత ప్రభుత్వ శాంతి దౌత్యాన్ని ఇది పరిపుష్ఠం చేసినట్టు అవుతుంది.