తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగం మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులందరూ లక్షాధికారులుగా ఎదగాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల రవీందర్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో “ప్రకృతి పర్యావరణ సంస్థ” ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్య సహకార సంఘాల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ చొప్పరి రామచంద్రం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పిట్టల రవీందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యరంగం అభివృద్ధి కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగపరచుకొని మత్స్యకారులందరూ ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల భారీ నిధులతో దేశవ్యాప్తంగా అమలు జరుపుతున్న “ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం” లో భాగంగా ప్రాథమిక మత్స్య సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడం కోసం, ఆ సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్న మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు అనేక పథకాలను అమలు జరుపుతున్నదని ఆయన తెలియజేశారు. “ప్రకృతి పర్యావరణ సంస్థ” లాంటి స్వచ్ఛంద సంఘాలు మత్స్యకారులను లక్షాధికారులను చేసే దిశలో కొనసాగిస్తున్న కృషి ప్రశంసనీయమైనదని ఆయన అన్నారు.
తెలంగాణలోని మత్స్యకారులు చేపల పెంపకం విషయంలోనూ, పంపిణీ విషయంలోనూ సాంప్రదాయ పద్ధతులకు బదులుగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక విధానాలను అలవరచుకోవాలని, ముఖ్యంగా విలువల జోడింపు (వ్యాల్యూ ఆడిషన్), చేపల శుద్ధి (ఫిష్ ప్రాసెసింగ్), మార్కెటింగ్ చేపల,రొయ్యలకు సంబంధించిన పచ్చళ్ల తయారీలో అవసరమైన శిక్షణను ఇప్పించేందుకు “ప్రకృతి పర్యావరణ సంస్థ” లాంటి స్వచ్ఛంద సంఘాలు ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన కొనియాడారు. తెలంగాణలో ఉత్పత్తి చేసే చేపలకు ఇతర రాష్ట్రాలతో సహా విదేశాలలోనూ మంచి గిరాకీ ఉన్నదని, ఈ అవకాశాలను గ్రామీణ స్థాయి సహకార సంఘాలు కూడా వినియోగించుకున్నప్పుడే మత్స్యకారులు లక్షాధికారులుగా ఎదగలుగుతారని పిట్టల రవీందర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ చొప్పరి రామచంద్రం మాట్లాడుతూ సాంప్రదాయ నీటి వనరులతో పాటు మిడ్ మానేర్, అన్నపూర్ణ ప్రాజెక్ట్, మల్కపేట రిజర్వాయర్, అప్పర్ మానేరు లాంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగ పరుచుకొని మత్స్యకారులు ఆర్థికంగా మెరుగుపడేందుకు అందుబాటులో ఉన్న డ్యాముల్లో చేపలు పట్టుకుని ఆర్థికంగా ఎదగాలని ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.