Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Mallapur: కీలక నేతలు కాంగ్రెస్ లోకి!

Mallapur: కీలక నేతలు కాంగ్రెస్ లోకి!

వర్గ పోరాటాల మాటేంటో?

కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. ఇప్పటికే చాలామంది నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారనే టాక్ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో రైతులు, గల్ఫ్ కార్మికుల మద్దతుతో ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి డాక్టర్ జెఎన్ వెంకట్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షిల సమక్షంలో, ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిల ఆధ్వర్యంలో వారి అనుచరగణంతో పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

చెన్నమనేని శ్రీనివాసరావు (సి యస్ ఆర్ )

సి యస్ ఆర్ ఫౌండేషన్ అధినేత, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం, గల్ఫ్ కార్మికుల కోసం పోరాడి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని శ్రీనివాసరావు చేరికతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుందని … ఆయనకు మద్దతిచ్చిన రైతులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాల మద్దతు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని, ఆయన రాకను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుండటం విశేషం.

డా.జె యన్ వెంకట్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి అయిన వెంకట్, ఆయన సతీమణి సునీత తన అనుచర వర్గంతో కాంగ్రెస్ లో చేరనున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం, బీజేపీలో ఉన్న తన క్యాడర్ తో అనుబంధం వెరసి.. ఇదంతా కాంగ్రెస్ కి మరింత బలం చేకూరేలా చేస్తుందని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

వర్గపోరు సమసిపోయేనా?

ఇప్పటికే వర్గ పోరుతో సతమతం అవుతున్న కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు నియోజకవర్గ నేతల రాకతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుందని కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే… వీరి రాకతో నియోజకవర్గంలో వర్గ పోరు సమస్య ఎక్కువ అవుతుందని, వర్గ పోరు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూడాలని ఇంకొందరు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వీరి చేరికతో కాంగ్రెస్ కు ఏమేరకు లాభం చేకూరుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News