Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Musharraf: నియంతృత్వానికి మారు పేరు

Musharraf: నియంతృత్వానికి మారు పేరు

అధికారంలో ఉన్నా లేకపోయినా పర్వేజ్‌ ముషరఫ్‌ ఒక సంచలనం. గత 5వ తేదీన దుబాయ్‌లో కన్నుమూసిన ముషరఫ్‌ కొన్నేళ్ల పాటు పాకిస్థాన్‌ను ఓ నియంతలా ఏలడం జరిగింది. ఆయన జీవితంలో అనేక చిత్ర విచిత్ర విజయాలతో పాటు కొన్ని అధ్వాన, దుర్భర పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. భూమికి 35 వేల కిలోమీటర్ల ఎత్తున ఆకాశంలో విహరించిన ముషరఫ్‌ చివరికి భూమి మీదకు రాక తప్పలేదు. పాకిస్థాన్‌ను గడగడలాడించిన ముషరఫ్‌ చివరికి దుబాయ్‌లో ప్రవాసంలో ఒక సాధారణ వ్యక్తిలా కన్నుమూయడం అనేది విధి విలాసానికి అద్దం పడుతోంది.
ఆయన 1999 అక్టోబర్‌లో అధికార పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్లారు. తనకు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఉద్వాసన చెప్పబోతోందని ఆయనకు అక్కడ ఉండగా తెలిసింది. వెంటనే ఆయన కరాచీకి బయలుదేరి వచ్చేశారు. సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని దించేశారు. నిజానికి, ఆయనను సైనిక దళాల ప్రధానాధికారిగా నియమించింది నవాజ్‌ షరీఫే. ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులను పక్కన పెట్టి ముషరఫు సర్వసైన్యాధికారిని చేశారు. పాకిస్థాన్‌లో సైనిక తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. అంతకు ముందు జుల్ఫీకర్‌ అలీ భుట్టోను జియా ఉల్‌ హక్‌ ఇదే విధంగా సైనిక కుట్ర ద్వారా పదవి నుంచి దించేశారు. అయితే, ముషరఫ్‌ను సైన్యాధ్యక్షుడుగా నియమించడం ద్వారా నవాజ్‌ షరీఫ్‌ తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టయింది. షరీఫ్‌ను ముషరఫ్‌ ప్రాణాలతో వదిలిపెట్టడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.
పాక్‌ అధ్యక్షుడుగా అధికారం చేపట్టిన తర్వాత ముషరఫ్‌ ఒక చక్రవర్తిలా వ్యవహరించారు. సాధారణం పస్థూన్‌లు, పంజాబీలు మాత్రమే దేశాధినేతలయ్యే దేశానికి భారతదేశం నుంచి వలస వచ్చిన ముషరఫ్‌ అధ్యక్షుడు కావడం ఒక రికార్డేనని చెప్పాలి. అందరి కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలన్న తపనతో పాటు, భారత్‌ కంటే పది అడుగులు ముందే ఉండాలన్న తపన కూడా ఆయనకు చాలా ఎక్కువ. భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య మొదటిసారిగా 1965లో యుద్ధం జరిగినప్పుడు ఆయన ఒక యువ సైన్యాధికారి. 1971లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయన ఒక కమాండోగా ఉన్నారు. అయితే, 1984లో ఓటమిని ఎదుర్కోవడం మాత్రం ఆయన మనసులో చెరగని ముద్ర వేసింది. సియాచిన్‌ వద్ద ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ చెలరేగినప్పుడు భారత్‌ ఆపరేషన్‌ మేఘదూత్‌ పేరుతో దాడి చేసి పాకిస్థాన్‌ సైన్యాన్ని తరిమి కొట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధానికి కూడా రూపకర్త ఆయనే.
ఓ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం మామూలే. అయితే, ఈ దేశాలు అణ్యస్త్రాలను కూడా కలిగి ఉన్నప్పుడు కయ్యానికి కాలు దువ్వడం ఒక విధంగా సాహసమే అవుతుంది. నిజానికి దాదాపు ఆ సమయంలోనే అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్పేయీ భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. తాను స్వయంగా లాహోర్‌కు ప్రయాణించి వచ్చారు. లాహోర్‌ ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ సౌహార్ద్రం ముషరఫ్‌కు ఏమాత్రం పట్టలేదు. ఒప్పందం మీద సంతకాలు పూర్తయ్యాయో లేదో ఆయన యుద్ధానికి పథక రచన చేశారు. ఈ దాడిని భారత్‌ తిప్పికొట్టడం, అమెరికా అందుకు సహాయం కూడా చేయడం ఆయనను అన్ని విధాలా దెబ్బతీసింది.
కార్గిల్‌ చొరబాటు జరగకపోయి ఉంటే ముషరఫు భారత్‌లో ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదు. ఆయన సంగతి పూర్తిగా అవగతమై ఉండి కూడా వాజ్‌పైయీ ఆయనను శాంతి చర్చలకు ఆహ్వానించారు. 2001 జూలైలో ఆగ్రాలో శిఖరాగ్ర చర్చలు జరిగాయి. అయితే, ఈసారి కూడా శాంతి చర్చలు, పర్యవసనాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. పాకిస్థాన్‌ విధానం స్పష్టంగా తెలిసిపోయింది. అక్కడ ముషరఫ్‌ ఒక దౌత్యవేత్తలా వ్యవహరించారు కానీ, నిజానికి ఆయన సైనిక తత్వం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తి. సైనిక తత్వం కాగితాలకు, ఒప్పందాలకు పరిమితం కాదు. ఆగ్రాలో పని పూర్తయిన తర్వాత ఆయన ఢిల్లీలో హురియత్‌ కాన్ఫరెన్స్‌ నాయకులతో చర్చలు జరిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని తన స్వగృహానికి వెళ్లివచ్చా రు. ఆ తర్వాత 2001 డిసెంబర్లో పార్లమెంట్‌ మీద లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపారు. వారికి పాకిస్థాన్‌ ప్రభుత్వ అండదండలున్నాయన్న సంగతి ప్రపంచానికి వెల్లడైంది. అల్‌ ఖైదా, ఒసామా బిన్‌ లాడెన్లను చూపెట్టుకుని ముషరఫ్‌ చెలరేగిపోయారు.
ఉగ్రవాదంపై పోరాటం జరపాలన్న అమెరికా పిలుపునకు ముషరఫ్‌ మద్దతు నిచ్చారు. వాస్తవానికి, ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు, చివరికి లాడెన్‌కు కూడా ఆశ్రయం ఇచ్చింది ఆయనే. పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తీకర్‌ మహమ్మద్‌ చౌధురి రాజీనామాను డిమాండ్‌ చేయడం ద్వారా చివరికి ఆయన తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోకు తగినంత భద్రతను కల్పించనందువల్లే ఆమె హత్యకు గురయిందని, దీనితో ముషరఫ్‌కు సంబంధం ఉందని తేలడంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు. దుబాయ్లో తలదాచుకున్నాడు. బేనజీర్‌ కుమారుడు బిలావల్‌ పాక్‌ ప్రభుత్వంలో మంత్రి కావడంతో ఆయన మళ్లీ పాక్‌ వచ్చే అవకాశమే లేకుండా పోయింది. విచిత్ర మేమిటంటే, 2008లో ముషరఫ్‌ పారిపోయిన తర్వాత 2013లో షరీఫ్‌ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. మొత్తానికి పాకిస్థాన్ చరిత్రనే ఒక మలుపు తిప్పిన ముషరఫ్‌ చివరికి దుబాయ్‌ లో సాధారణ వ్యక్తిలా మరణించడం విధి విలాసమేనని చెప్పవచ్చు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News