శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం.వీరాంజనేయులు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. శింగనమల మండలం శివపురం పెద్దమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అక్కడి నుంచి టిప్పర్ డ్రైవ్ చేస్తూ వేలాది మందితో ర్యాలీగా బయలు దేరారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గజమాలతో స్వాగతం పలికారు.
తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సమక్షంలో వీరాంజనేయులు ఎన్నికల అధికారి వెన్నుల శ్రీనుకి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యుడికి టిక్కెట్ ఇవ్వడం సంతోషమన్నారు. 2019లో నామినేషన్ వేసిన సమయంలో శింగనమల చెరువు నీరు లేక ఎండిపోయిన విషయం గుర్తు చేశారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక శింగనమల చెరువును లోకలైజేషన్ చేశామని, నియోజకవర్గంలో గత పాలనలో చేయలేని అభివృద్ధిని చేసి చూపించామన్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి పేదవారి గుండెల్లో సుస్థిర స్థానాన్నిసంపాదించుకున్నారన్నారు. ఏ గ్రామాల్లోకి వెళ్లినా జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అందాయని రానున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు చెబుతున్నారన్నారు.
రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ్ముడు వీరాంజనేయులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలనుకోరారు.వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న దీవెనలతో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం, ఈ స్థాయికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.