వ్యవసాయమేప్రధాన వృత్తిగా రాజకీయాలు ప్రవృత్తిగా జీవనం కొనసాగిస్తున్న ఒక రైతుకు డబ్బే ప్రధానంగా అధికారమే లక్ష్యంగా ఉన్న ఒక జమీందారుకు జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆయన బేతంచెర్ల మండలంలోని రంగాపురం తదితరా గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ తాను ఒక రైతు బిడ్డని స్వయంగా వ్యవసాయం చేస్తున్న వ్యక్తినని అందువల్ల రైతుల, రైతు కూలీల కష్టాలు ఏంటో తనకు ప్రత్యక్షంగా తెలుసునని వెల్లడించారు. తన కుటుంబం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉందని, ఎలాంటి వ్యాపారాలు లేవని ఆయన అన్నారు. నిజాయితీకి ప్రాణమిచ్చే వ్యక్తిగా ప్రజల ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. వ్యాపారాలు చేసి, లేదంటే రాజకీయాల్లో అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించిన కుటుంబం మాది కాదని ఆయన ప్రజలతో అన్నారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎన్ని ఉన్నత పదవులు అనుభవించినా నిజాయితీగా పనిచేసి ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేశానని వెల్లడించారు. తన తండ్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా ఒక రూపాయి అవినీతికి పాల్పడటం, దౌర్జన్యాలు చేయటం, బెదిరింపులకు దిగటం లాంటి చెత్త పనులు తన కుటుంబంలో ఎవ్వరూ చేయలేదని తెలిపారు.
తన ప్రత్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా తనను తన వర్గీయులను దూషించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. పదేళ్లుగా శాసనసభ సభ్యునిగా, గత ఐదేళ్ల నుంచి మంత్రిగా పనిచేసిన బుగ్గన ఆయన చేసిన అభివృద్ధి గురించి గానీ కోట్లకి కుటుంబాలు చేసిన అభివృద్ధి గురించి గానీ మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి అన్నారు. అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకుంటున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్ల-డోన్-ప్యాపిలి మండలాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాత రోడ్లపై తమలపాకు మందంలో తారు రోడ్డు వేసినంత మాత్రాన అది రోడ్డు వేసినట్లు కాదని అనుచరుల అవినీతి సంపాదన కోసం వేసిన రోడ్లని ఆయన ఎద్దేవా చేశారు. బేతంచెర్ల సమీపంలో కొత్త భవనాలు నిర్మాణ దశలో ఉండగా ప్రారంభించి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పడం ప్రజలు గుర్తిస్తున్నారని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాతలు చేసిన దానాన్ని కూడా తిరిగి తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని వాటికి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లోకి విద్యాసంస్థలు వెళ్లిపోతే తాతలు దానంగా ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అది నిజమా కాదా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని కోట్ల సూర్య అన్నారు.
నేటి హైదరాబాద్ నగరం తరహాలో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే డోన్ శాసనసభ్యునిగా తనను లోక్ సభ సభ్యురాలిగా డాక్టర్ శబరిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మాజీ జడ్పీటిసి ప్రసన్నలక్ష్మి, మాజీ ఎంపీపీ సోమశేఖర రెడ్డి, మండల కన్వీనర్ ఏళ్ల నాగయ్య, మాజీ ఎంపిటిసి బుగ్గన ప్రభాకర రెడ్డి, భీమేశ్వర రెడ్డి, బజాజ్ రామిరెడ్డి, ఎమ్మార్పీఎస్, జానసేనా, టీడీపి నేతలు పాల్గొన్నారు.