రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై డి.సుధాకర్ ప్రజలను కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న మండల కేంద్రంలో, తాడూరు, మండేపల్లి గ్రామాలలో ఎస్సై తమ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించి ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో మొత్తం 35 పోలింగ్ ప్రదేశాల్లో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో పార్టీల నాయకులు గాని, ప్రజలు గాని, యువకులు గాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ప్రచారాలు నిర్వహించుకోవచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలలో కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు రావని, విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కు ఇబ్బంది ఉంటుందని, అందరూ జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సై చంద్రమౌళి, హెడ్ కానిస్టేబుల్ లు సాంబశివరావు, సుధాకర్, మల్లేశం, కానిస్టేబుల్ లు నరేందర్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రామ్మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు.