జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కుమురంభీం స్ఫూర్తిగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మరి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి, పీప్పల్ ధరి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నిర్వహిస్తున్న ప్రచారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి సీతక్కకు ఆదివాసి సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాల మధ్య, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డోలు వాయిద్యాల చప్పుడు మధ్య సీతక్క, సుగుణక్క ఆదివాసి సాంప్రదాయ నృత్యాలు చేశారు.
అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రసంగించారు. పేద వర్గాల ప్రజలకు భూములు, ఇందిరమ్మ ఇళ్లు, పోడు భూములకు పట్టాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇంచార్జీ మంత్రిగా కృషి చేస్తానని, రెండు పంటలకు నీళ్లు అందేలా కాలువులు ఏర్పాటు చేస్తామని, గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపించుకోవాలని కోరారు.
అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బంగారుగూడ ,యాపల్ గూడ గ్రామాల్లోని ప్రధాన విడుదల గుండా భారీ రోడ్డు షో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.