Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Hyd: సింగరేణి విశ్రాంత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌

Hyd: సింగరేణి విశ్రాంత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి యాజమాన్యం 40,000 రూపాయలు వసూలు చేసి సీపీఆర్‌ ఎంఎస్‌ ఎన్‌.ఇ (కాంట్రిబ్యూటరీ పోస్ట్‌ రిటైర్మెంట్‌ మెడికల్‌ స్కీం నాన్‌-ఎగ్జిక్యూటివ్‌) కార్డ్‌ పంపిణీ చేయడం జరిగింది. వీరందరూ ప్రతి సంవత్సరము నవంబర్‌ మాసంలో కార్డ్‌లను రెన్యూవల్‌ చేసుకోవడం జరుగుతుంది. ఇట్టి మెడికల్‌ కారడ్స్‌ ద్వారా విశ్రాంత ఉద్యోగుల దంపతులకు ఎనిమిది లక్షల రూపాయలు విలువైన అత్యవసర వైద్య సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ఉన్న కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఒప్పందం చేసుకుంది. అధికార దంపతులిద్దరికి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువగల వైద్య సౌకర్యం అందిస్తుంది. అలాగే ఔట్‌ పేషెంట్‌ వైద్యం కొరకు ప్రతి సంవత్సరం 36,000 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. కార్మికులకు ఔట్‌ పేషంట్‌ వైద్య సదుపాయం లేదు. వారి స్వంత డబ్బులతో వైద్యం చేయుంచుకోవాలి. నెలవారీ మందులకు సంస్థకు చెందిన ఏరియా ఆసుపత్రులకు వెళ్ళవలసిన పరిస్థితి. వ్యాధి, వృధ్యాప్యం అధికారులకు, కార్మికులకు సమానమే కదా! మరి ఎందుకు వ్యత్యాసం. ఈ కార్డ్స్‌ తీసుకొని అత్యవసర సమయాల్లో విశ్రాంత ఉద్యోగులు ఒప్పంద ఆసుపత్రులకు వెళ్ళితే అక్కడ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్యం చేసేందుకు నిరాకరించడం జరుగుతుంది. కారణం సింగరేణి యాజమాన్యం ఆసుపత్రులకు చెల్లించ వలసిన సొమ్మును సకాలంలో చెల్లించడం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒప్పంద ఆసుపత్రుల్లో వైద్యం కొరకు వారు వ్యక్తిగతంగా నగదు చెల్లించుకుని అట్టి మెడికల్‌ బిల్లులను సింగరేణి మెడికల్‌ అధికారికి పంపితే రియింబర్స్‌ మెంట్‌కై నెలల కొద్దీ జాప్యం చేస్తూ అందులో కోత విధించడం జరుగుతుంది. ఎనిమిది లక్షల రూపాయల వైద్యం పరిమితం అయినప్పుడు మరి ఎంత మొత్తంలో బిల్లు పంపితే అంతే మొత్తం చెల్లించాలి, కానీ కోత విధించడం చూసి విశ్రాంత కార్మికులు నివ్వెరపోతున్నారు. 21-1-2023న కొత్తగూడెం హెడ్‌ ఆఫీస్‌లో గుర్తింపు సంఘం, అధికారుల మధ్య సీపీఆర్‌ యంఎస్‌ ట్రస్ట్‌ బోర్డ్‌ సమావేశంలో విశ్రాంత ఉద్యోగులకు కొరియర్‌ ద్వార ప్రతినెలా మందులు ఇంటికి పంపిణీ చేస్తారని వివిధ దిన పత్రికల్లో వార్త వచ్చింది. కానీ ఈ ప్రకటనలో ఏ వైద్యున్ని ఏ ఆసుపత్రిలో ఎక్కడ సంప్రదించాలి అని ప్రకటించలేదు. అలాగే ప్రతి నెల విశ్రాంత ఉద్యోగి శారీరక ఆరోగ్య స్థితి మార్పు చెందుతుంది. ప్రతి నెల వైద్య సలహా మేరకు మందులు ఇవ్వాలి తప్ప ఒకసారి ఇచ్చిన మందులు ప్రతి నెల ఎలా వాడుతాం, విశ్రాంత ఎంతోకాలం నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ , కరీంనగర్‌ ఖమ్మం లాంటి నగరాల్లో సింగరేణి సంస్థనే ప్రత్యేక వైద్య శాలలు నిర్మించి ఉచితంగా అన్ని రకాల వైద్య సేవలు అందించాలని, దేశ వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం ఇవ్వాలని కోరుతుంటే తూ తూ మంత్రంగా ట్రస్ట్‌ సమావేశాలు ఏర్పాటు చేసి కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితం అవుతుంది. దాదాపు 30, 40 సంవత్సరాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగు నిచ్చిన చీకటి సూర్యుల పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ పెంపుదలకై కనికరించుట లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు, వృద్ధులు, మహిళలకు వికలాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడం చేస్తుంది. సింగరేణి లాభాల నుంచి సిఎస్‌ఆర్‌ , డిఎచ్‌ఎఫ్‌, కోల్‌ సెస్‌ ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి. చాలా మంది విశ్రాంత కార్మికులకు స్వంత ఇల్లు లేక, చాలీ చాలని పెన్షన్‌తో దీర్ఘకాలికవ్యాధులతో సరిగా వైద్యం అందక బాధ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వారి ఆరోగ్య భద్రతకై అసెంబ్లీ సాక్షిగా నగదు రహిత వైద్యం కొరకు 700 కోట్ల రూపాయలు కేటాయించి 6.50 లక్షల రాష్ట్ర ప్రభుత్వ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అభినందనీయులు. ఇదే బడ్జెట్లో సింగరేణి విశ్రాంతీయులకు కూడా కొద్దో, గొప్పో వారికి కూడా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి మెరుగైన అపరిమిత వైద్య సదుపాయాలు అందిస్తే సింగరేణి విశ్రాంతీయుల కుటుంబాల్లో ఆనందం కలుగుతుంది.
– ఆళవందార్‌ వేణు మాధవ్‌
8686051752

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News