Google Layoffs: కంపెనీ ఏదైనా, సంస్థ ఎంత పెద్దదైన ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో తమ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగులపై వేటు పడుతుంది. ఇప్పటికే ట్విటర్, అమెజాన్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా వంటి పెద్ద పెద్ద సంస్థలు లే ఆఫ్స్ ట్రెండ్ ను ఫాలో అయ్యాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తరువాత 50శాతం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాడు. మరో 4వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేశారు. అమెజాన్‌సైతం ట్విటర్ బాటలో నడిచింది. ప్రపంచ వ్యాప్తంగా 10వేల మంది ఉద్యోగులపై వేటే వేసేందుకు సిద్ధమైంది. అంతేకాక వచ్చే ఏడాదికూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఆ సంస్థ సీఈవో స్పష్టం చేశాడు.
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా సైతం ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో ఐటీ రంగంలో లే -ఆఫ్స్ ట్రెండ్ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తోంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ఫ్రెషర్స్ వరకూ అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. తాజాగా.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న కంపెనీల జాబితాలో నిలిచింది.
పనితీరు సరిగా లేని 10 వేల మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించాలని గూగుల్ నిర్ణయించినట్లు తెలిసింది. గూగుల్ మేనేజర్స్ ప్రస్తుతం విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీగా వేతనాలు చెల్లించే కంపెనీల్లో గూగుల్ అందరి కంటే ముందుంది. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ కంపెనీగా పేరున్న గూగుల్ సైతం లేఆఫ్స్ బాటను ఎంచుకోవటం ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది.