ఒక హగ్ మనుషులకు ఇచ్చే సాంత్వన, ప్రేమానుభూతి, వాత్సల్యాలు, మరెన్నో మాటలకందని భావాలు ఎన్నో. రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుని కలవనక్కర్లేదంటారు. కానీ ఒక హగ్ ఒక మానసిక రోగికి అందించే భరోసా, మద్దతు, అందించే మానసిక ఆరోగ్యం మాటలకు అందనిదని మానసిక నిపుణులు అంటారు. అంతేకాదు పలు అధ్యయనాల్లో కూడా రోజూ తమ సన్నిహితులకు, దగ్గరవారికి ఇచ్చే ఒక ప్రేమాస్పదమైన కౌగిలింత మనుషుల బంధాలను ఎంతో బలీయం చేస్తుందని వెల్లడైంది కూడా. తాము ఎంతో ఇష్టపడే వ్యక్తులను హగ్ చేసుకుని వారి పట్ల తమకు ఉన్న ప్రేమను, ఇష్టాన్ని చాలామంది తెలియజేస్తుంటారు. తమ వారి పట్ల తమలోని భావాద్వేగాలను మాటలలో పంచుకోలేకపోయినపుడు చాలామంది ఆ ఫీలింగును ప్రేమాస్పదమైన తమ కౌగిలింత ద్వారా తెలియజేస్తుండడం నిత్య జీవితంలో చాలా సందర్భాలలో మనం చూస్తుంటాం.
ఒక భౌతిక స్పర్శ మనిషికి ఇచ్చే శక్తి, మానసిక బలం అద్భుతమైంది. అది ఎన్ని అద్భుతాలనైనా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మానసికంగా తగిలిన గాయాలను కూడా ప్రేమాస్పద కౌగిలింత చిటికెలో మాన్పుతుంది. ఎంతటి సంక్లిష్టమైన సమస్యనైనా ఇది క్షణాలల్లో తీరుస్తుంది. భవిష్యత్తు గురించి మనకు ఉండే ఒకరకమైన యాంగ్జయిటీ, డిప్రషన్ వంటి వాటికి కూడా ఒక కౌగిలింత గొప్ప ఆరోగ్య మంత్ర. సంతోషం వచ్చినా, దుఖం వచ్చినా కూడా దగ్గరివారిని కౌగిలించుకుంటాం. మనకు వ్యక్తులతో ఉండే సన్నిహితమైన అనుబంధాన్ని, వారిపై ఉండే ప్రేమానురాగాలను కౌగిలింతలు ప్రతిఫలిస్తాయి. ఒక అధ్యయనంలో అయితే జంటల ఆరోగ్యమైన వైవాహిక సంబంధానికి సెక్సు కన్నా కూడా భార్యాభర్తలు ఒకరికొకరు రోజూ ఇచ్చుకునే ఒక ప్రేమాస్పదమైన కౌగిలింత ఎక్కువ పటిష్టం చేస్తుందంటారు మానసికనిపుణులు. జంటల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం, ప్రేమ, ఆప్యాయతలను హగ్ ఎంతో పెంచుతుంది. కౌగిలింత కేవలం లైంగికపరమైన ఆనందాన్నే కాదు జంటలో ఒకరకమైన భద్రతను, సౌఖ్యాన్ని, ఒకరికొకరం అన్న భావనను కలిగిస్తుంది.
జంటల రిలేషన్ షిప్ లో సెక్సు ఎంత ముఖ్యమో ప్రేమాస్పదమైన హగ్ కూడా అంతే ప్రభావవంతమైందని రిలేషన్షిప్ నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడికి గురయి అనారోగ్యం పాలయిన వారికి ఆత్మీయతతో కూడిన హగ్ ఇచ్చే ఆరోగ్యం అనూహ్యం అంటారు మానసిక నిపుణులు. హగ్ ఇలాంటి వారి అనారోగ్య తీవ్రతను , లక్షణాలను బాగా తగ్గిస్తుందని కూడా అధ్యయనాల్లో వెల్లడైంది. సమాజంలో రకరకాల ఒత్తిడిల వల్ల తలెత్తే పలు విషపరిణామాలకు మనుషులు పరస్పరం ఇచ్చుకునే హగ్ ఎంతో మంచి చేస్తుందని సామాజికశాస్త్ర నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజలు స్నేహంగా మెలగడానికి ఇదొక మంచి కమ్యూనికేషన్ యాక్ట్’ అంటున్నారు. హగ్స్ లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయని మానసిక విశ్లేషకులు చెప్తున్నారు.
చాలామంది రైట్ సైడెడ్ హగ్స్ ను ఇవ్వడానికి ఇష్టపడతారట. లెఫ్ట్ సైడెడ్ హగ్స్ మటుకు పాజిటివ్, నెగిటివ్ రెండు సందర్భాలలోనూ ఇవ్వడం కనిపిస్తుందిట. లెఫ్ట్ హ్యాండెడ్ వారి కన్నా కూడా రైట్ హ్యాండెడ్ వాళ్లు ఎదుటివాళ్లని సహజంగా కుడివైపు నుంచి హగ్ చేస్తారుట. అయితే తటస్థ సమయాలలో కూడా ఇద్దరు పురుషులు ఎక్కువగా ఎడమవైపు నుంచి హగ్ చేసుకోవడం జరగుతుంటుందిట. రైట్ హెమెస్ఫియర్ ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్ తో ఉండడం వల్ల కదలిక ఎడమవైపు నుంచి వుంటుందిట.
పరిశోధనల్లో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇద్దరు పురుషులు హగ్ చేసుకోవడాన్ని నెగిటివ్ గా చాలామంది పురుషులు చూస్తారట. సైడ్ హగ్స్ ను అంతగా క్లోజ్ గా లేని వాళ్లు ఇచ్చుకునే ఫ్రెండ్లీ యాక్టుగా చెప్తారు. అలా కాకుండా సన్నిహిత వ్యక్తి, లేదా రొమాంటిక్ పార్టనర్ సైడ్ హగ్ ఇస్తే ఆ స్పర్శ ఆ వ్యక్తి పట్ల అతను లేదా ఆమెకు ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఇష్టం, సౌఖ్యం, ఒక పాజిటివ్ ఎనర్జీని, ప్రోత్సాహాన్ని అందించిన భావోద్వేగాన్ని వారికి ఇస్తుంది. కొందరు బ్యాక్ హగ్ చేస్తారు. ఇది సర్ ప్రైజింగ్ హగ్ అనమాట. ‘నిన్ను దొరికించుకున్నా ’ అన్న ప్రేమాస్పదమైన సన్నిహిత భావం ఈ హగ్ లో దాగుంది. ఇది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సన్నిహితత్వం, ప్రేమ, ఇష్టాలను, భౌతిక సాన్నిహిత్యాన్ని అద్దంపడుతుంది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో కూడా ఈ హగ్ చెబుతుంది.
నడుం చుట్టూ చేయి వేసి హగ్ చేసుకుంటే అది రొమాంటిక్ హగ్ అని చెప్పాలి. వారిద్దరిలోని ‘టుగెదర్నెస్’ని అది తెలుపుతుంది. ఎన్నిగంటలైనా సమయం తెలియకుండా గడపగలిగే సాన్నిహిత్యం వారిమధ్యన ఉందన్నది అర్థమవుతుంది. ఇంగ్లీష్ లో ‘బియర్ హగ్ ’ అంటారే దాన్ని తెలుగులో ఎలుగుబంటు కౌగిలి అంటారు. అంటే అంత గట్టిగా ఆ హగ్ ఉంటుందనమాట. ఈ హగ్ వారిలోని విపరీతమైన దగ్గరితనాన్ని, అందులో వారు పొందే సౌఖ్యాన్ని తెలుపుతుంది. ఎంతో ఆనందమైన అనుభూతిని పంచుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇలా ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటారు. ఉదాహరణకు మీరెంతో ఇష్టపడే, ప్రేమించే వ్యక్తులను చాలాకాలం తర్వాత కలుసుకున్నప్పుడు వారిద్దరూ గట్టిగా కౌగిలించుకుని ఒకరిపట్ల ఒకరుకున్న ప్రేమను ఎంతో బలీయంగా వ్యక్తంచేసుకుంటారు. భుజం మీద తడుతూ చేసుకునే హగ్ కూడా ఉంది. దీనిని ప్యాటింగ్ హగ్ లేదా బ్రో లేదా బడ్డీ హగ్ అని కూడా అంటారు.
ఇది పూర్తిగా వారిరువురి మధ్య ఉన్న స్నేహాన్ని తెలిపే హగ్. అయితే సన్నిహితమైన మిత్రులే ఇంటిమేట్ హగ్ చేసుకుంటారు. పిక్ పాకెట్ హగ్ అని కూడా ఉంది. ఇది స్వీట్ అండ్ రొమాంటిక్ హగ్. ఇది ఒకరిపట్ల ఒకరికి ఉన్న నమ్మకం, విశ్వాసం, వాత్సల్యం వంటి భావోద్వేగాలను తెలుపుతుంది. అలాగే ఒకరికి ఒకరు అన్న భద్రతా భావాన్ని కూడా ఈ హగ్ పంచుతుంది. అందుకే మీ ప్రేమ, ఇష్టాలను మీకు నచ్చిన వ్యక్తులకు మాటలకు మించి వ్యక్తంచేసే కౌగిలింతల పవర్ ఏమిటో తెలిసిందా మరి…