Friday, October 18, 2024
Homeహెల్త్Dark Elbows: మోచేతులు తెల్లగా, మృదువుగా..

Dark Elbows: మోచేతులు తెల్లగా, మృదువుగా..

చాలామందికి మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉంటాయి. అక్కడి చర్మం నలుపును ఎలా పోగొట్టుకోవాలో, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అందులోనూ చలికాలంలో, చల్లటి వాతావరణంలో మోచేతి దగ్గర చర్మం నల్లగా, పొడిగా, దురదగా, చర్మం మందంగా ఉండి చిరాకుపెడుతుంటుంది. అక్కడ చర్మాన్ని ఎక్స్ ఫోయిలేట్ చేసుకోకపోవడం వల్ల చాలాకాలం నుంచి మ్రుతకణాలు చేరి చర్మం నల్లగా తయారవుతుంది. సూర్యకాంతికి మోచేతులు ఎక్కువగా గురికావడం వల్ల కూడా ఆ ప్రాంతంలో చర్మం నల్లగా అవుతుంది. పిగ్మెంటేషన్ తలెత్తుత్తుంది.

- Advertisement -

అంతేకాదు హోర్మోనల్ మార్పులు, శరీరంలో ఏవైనా రియాక్షన్లు తలెత్తినా కూడా మోచేతుల దగ్గర చర్మం నల్లగా అవుతుంది. అలాగే వయసు మీద పడ్డం వల్ల కూడా ఆ ప్రాంతంలో పిగ్మేంటేషన్ ఏర్పడుతుంది. సొరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నా, చర్మానికి సరిపడని ఫ్యాబ్రిక్ ఏదైనా వాడినా కూడా ముఖ్యంగా మోచేతులు నల్లగా అవుతాయి. మోచేతులు, మోకాళ్ల దగ్గర గాయాలు అయి ఆరిన తర్వాత కూడా ఆప్రాంతంలో చర్మం నల్లబడుతుంటుంది. మోచేతి చర్మంపై తలెత్తే ఈ సమస్యల నివారణకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి:

 మోచేతుల దగ్గర దురద పెడుతుంటే 3:1 నిష్పత్తిలో నీరు, వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని మోచేతుల మీదున్న చర్మంపై దూదితో మెల్లగా తడుతూ రాసుకోవాలి. చలికాలంలో సోపులేని బాత్ జెల్స్ తో మోచేతుల మీద రుద్దుకుంటే కూడా దురద తగ్గుతుంది. చలికాలంలో స్నానానికి వేడి నీళ్లు ఉపయోగిస్తుంటాం. దీంతో చర్మంపై రంధ్రాలు తెరుచుకుని అందులోకి సబ్బులోని రసాయనాలు వెళతాయి. దీంతో చర్మంపై దురద పెరుగుతుంది. దీని నివారణకు గ్లిజరిన్ సోపులను కూడా వాడొచ్చు. గ్లిజరిన్ సబ్బు మోచేతులకు, మోకాళ్లకు తగినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఆ ప్రదేశంలోని చర్మం పొడారిపోకుండా కాపాడుతుంది.

 స్నానం చేసిన తర్వాత బాడీ లోషన్స్ లేదా క్రీములను మోచేతుల మీదున్న చర్మంపై రాస్తే మంచి ఫలితాన్ని చూబిస్తుంది. ఇలా చేయడం వల్ల మోచేతి మీదున్న చర్మం నలుపు తగ్గి అక్కడి చర్మం కాంతివంతం అవడమే కాకుండా దురద బాధ కూడా తగ్గుతుంది. ఇందుకు మార్కెట్ లో దొరికే బాడీ లోషన్లను వాడొచ్చు. హైడ్రేషన్ అందించే లోషన్స్ ను , క్రీములను వాడితే మంచిది.

 మోచేతులకు నువ్వుల నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని దాన్ని మోచేతులపై రాసి సున్నితంగా రుద్దండి. స్నానం చేసేటప్పుడు మోచేతుల దగ్గర చర్మాన్ని వాష్ టవల్ తో బాగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో రక్త ప్రవాహం బాగా జరుగుతుంది. మోచేతులు మ్రుదువుగా తయారవుతాయి. ఆ ప్రదేశంలో పిగ్మెంటేషన్ తలెత్తదు. మోచేతులకు బాదం లేదా ఆలివ్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు. మోచేతిదగ్గర చర్మం మందంగా ఉంటే ప్యూమిక్ స్టోన్ తో రుద్దచ్చు. అలా రుద్దిన తర్వాతే లోషన్ రాసుకోవాలి. వారానికి రెండుసార్లు మోచేతుల దగ్గర స్క్రబ్ తో శుభ్రంచేసుకోవచ్చు.

 మోచేతుల దగ్గర చర్మం బాగా ఎండినట్టు ఉంటే నిమ్మరసం, పసుపు పేస్టును పూస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఆ ప్రదేశంలోని చర్మాన్ని కూడా మెరిసేలా ఈ మిశ్రమం చేస్తుంది. అంతేకాదు నిమ్మకాయ చర్మ సంరక్షణకు బాగా పనిచేస్తుంది. దీంట్లో సహజసిద్ధమైన బ్లీచింగ్ సుగుణాలు ఉన్నాయి. స్నానం చేసే ముందర సగం కోసిన నిమ్మ చెక్కతో మోచేతులపై రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం శుభ్రం కావడమే కాదు అక్కడ చేరిన మ్రుతకణాలు పోయి చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

 పెరుగు, శెనగపిండి పేస్టును కూడా నల్లగా అయిన మోకాళ్లు, మోచేతులపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. పెరుగులో ఒక స్పూను వెనిగర్, శెనగపిండి కలిపి రాసుకుంటే ఆ ప్రాంతంలో ఏర్పడ్డ నల్లని మచ్చలు పోతాయి. ఈ పేస్టును మోచేతులు, మోకాళ్లపై ఉండే చర్మంపై రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మ్రుదువుగా అయి మెరుస్తుంటుంది.

 పొడారినట్టు ఉన్న మోచేయి, మోకాలు చర్మంపై తాజా అలొవిరా గుజ్జును రాసి 20 నిమిషాలు అలాగే ఉంచుకొని నీళ్లతో కడిగేసుకోవాలి. అలొవిరా గుజ్జు చర్మానికి కావలసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

 కొబ్బరినూనెతో మోకాలు, మోచేతి చర్మంపై మసాజ్ చేసినట్టు రాస్తే కూడా ఆ ప్రాంతంలో చర్మం మ్రుదువుగా తయారవుతుంది. నల్లదనం పోతుంది.

 ఆలివ్ ఆయిల్, సుగర్ స్క్రబ్ తో మోచేతి, మోకాళ్ల చర్మంపై రుద్దితే చర్మంకు బాగా హైడ్రేషన్ అంది కాంతివంతం అవుతుంది.

 మోచేయి, మోకాళ్ల దగ్గర ఉన్న పొడిబారిన, కాంతిహీనమైన చర్మంపై ఓట్మీల్, పెరుగు కలిపిన మాస్కును రాసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. ఇది చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. పెరుగును, ఓట్మీల్ ను సమపాళ్లల్లో తీసుకుని మాస్కు తయారుచేసుకుని దాన్ని మోచేతి, మోకాళ్ల మీద రాసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News