అసెంబ్లీ సమావేశాలు 7 రోజుల్లో 56 గంటల 25 నిమిషాల పాటు, శాసన మండలి సమావేశాలు 5రోజుల్లో 17గంటల పాటు అర్థవంతంగా జరిగాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం చర్చకు సమాధానమివ్వడంతో ముగిసాయి. పోడు భూములపై గిరిజన, ఆదివాసీలకు హక్కులు కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. వాల్మీకి బోయలను, కాయస్త లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించుకున్నట్టు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఐదు బిల్లులను ఆమోదించుకుని.. ఈ సమావేశాల్లోనే శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుని.. పద్దులపై సవివరమైన చర్చ జరిగినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వం తరుపున మంత్రులు పద్దులపై సమాధానం చెప్పే సమయంలో ప్రతిపక్ష సభ్యులు లేక పోవడం విచారకరమని.. వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ది, చట్ట సభల పట్ల ఉన్న గౌరవం ప్రజలకు అర్థమయ్యిందన్నారు.